తాడేపల్లి : రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్ పెన్షన్ కానుక పంపిణీ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం నుంచే వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల చేతికి మే నెల పెన్షన్లు అందిస్తున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా బయో మెట్రిక్‌కు బదులుగా పెన్షనర్ల ఫోటోల జియో ట్యాగింగ్ ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు.
వేరే ప్రాంతాల్లో ఉన్నా..
లాక్‌డౌన్ వల్ల వేరే ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా పోర్టబిలిటీ ద్వారా పెన్షన్లు అందిస్తున్నారు. ఉదయం 5 గంటల నుండి వాలంటీర్లు ప్రతి గడప వద్దకు వెళ్లి పెన్షన్‌దారుల ఆరోగ్యంపై ఆరా తీస్తూ.. ప్రతి ఇంటిలోనూ భౌతిక దూరాన్ని పాటిస్తూ లబ్ధిదారులకు పెన్షన్ ఇస్తున్నారు. మూడు గంటల్లోనే 38 లక్షల 53 వేల మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 58.22 లక్షల మంది పెన్షన్లు అందుకోనుండగా, ఇందు కోసం ప్రభుత్వం రూ.1,421.20 కోట్లు విడుదల చేసింది.