భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు నార్త్-సౌత్ కారిడార్‌ను అభివృద్ది చేస్తామని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. జె.బి.ఎస్ నుండి వయా ట్యాంక్‌బండ్ మీదుగా ఆబిడ్స్, మోజంజాహీమార్కెట్, చార్మినార్ ద్వారా ఫలక్‌నూమా వరకు ఉన్న రోడ్లను అభివృద్ది పర్చేందుకు అవసరమైన చర్యల కు ఇండో- ఫ్రెంచ్ కన్సార్టియం ద్వారా వివిధ సంస్థల చే అధ్యయనం చేయిస్తున్నామని తెలిపారు. ఫ్రెంచ్ డెవలప్‌మెంట్ ఫండ్ తో ఈ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ మార్గంలో ఉన్న రోడ్లు, ట్రాఫిక్ పరిస్థితిని, ప్రత్యామ్నాయ సూచనలను ఈ అధ్యయనం ద్వారా తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ మార్గంలో హెరిటేజ్ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ పర్యాటక కట్టడాలకు గుర్తింపు తేనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా సంస్థలు ప్రాథమికంగా అధ్యయనం చేసిన అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 2020 ఫిబ్రవరిలో సమగ్ర అధ్యయన నివేదిక అందిన అనంతరం ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, అధ్యయనం చేస్తున్న ఏజెన్సీల ప్రతినిధులు విన్సెంట్ లిచ్చర్ (Suez Consultancy), హర్షిత (అర్భన్ మాస్ ట్రాన్సిట్ కార్పొరేషన్), బ్రూనో (బ్రూనో ఏజెన్సీ) క్లైమెన్స్ విడాల్, వాలెండినో (ట్రాన్స్ సామో) తదితరులు పాల్గొన్నారు.