జి.ఎస్.టి. బిల్లును ఆమోదించడానికి ఈ నెల 30న శాసనసభను, శాసనమండలిని సమావేశ పరచాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారం, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి తదితరులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
రాజ్యాంగాన్ని సవరిస్తూ ఇటీవల పార్లమెంటు జి.ఎస్.టి. చట్టం తెచ్చింది. ఈ చట్టం అమల్లోకి రావడానికి దేశంలోని సగం రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జిఎస్టీ బిల్లుపై చర్చించడానికి ఈ నెల 30న ఉదయం 11 గంటలకు సమావేశ పర్చాలని స్పీకర్ మధుసూదనా చారిని, మండలి చైర్మన్ స్వామిగౌడ్ ను ముఖ్యమంత్రి కోరారు. రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లు కాబట్టి సభ్యులకు పూర్తి వివరణ ఇవ్వడానికి అడ్వకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డిని శాసనసభ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలవాలని కూడా స్పీకర్ ను ముఖ్యమంత్రి కోరారు.