—ప్రధాన జర్నలిస్టు సంఘాల బాధ్యులతో మంత్రి కేటీఆర్ సమావేశం * సాక్ష్యాధారాలతో కె.విరాహత్ అలీ ప్రస్తావనలు * విశ్రాంత జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్నిఅమలు చేయాలని వై.నరేందర్ రెడ్డి డిమాండ్* పాత్రికేయులందరికీ వెంటనే ఇంటి స్థలాలు,ఇండ్లను మంజూరు చేయాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్*
వివిధ సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ శనివారం ప్రధాన జర్నలిస్టు సంఘాల బాధ్యులతో ప్రగతి భవన్ లో దాదాపు రెండు గంటల పాటు సమావేశం అయ్యారు . జర్నలిస్టుల గొంతుకగా టీయూడబ్ల్యూజే-ఐజేయూ బాధ్యులు వివిధ అంశాలను ప్రస్తావించారు .సాక్ష్యాధారాలతో సమావేశంలో మాట్లాడారు . టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు, వాటి పరిష్కారానికి జరుగుతున్న నిర్లక్ష్యాన్ని నిర్మోహమాటంగా పేర్కొన్నారు . జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలు తీరు తెన్నులను సాక్ష్యాధారాలతో మంత్రి ముందు ఉంచారు. గత మూడు నెలలుగా హెల్త్ కార్డులను కార్పోరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు తిరస్కరిస్తున్న సందర్భాలను కూడా సాక్ష్యాలతో సమావేశంలో వివరించారు.చివరికి నిమ్స్ ఆసుపత్రిలో సైతం హెల్త్ కార్డులు చెల్లడం లేదని విరాహత్ అలీ ఆందోళన వ్యక్తం చేసారు . రోడ్డు ప్రమాదానికి గురై ఐదు రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న మేడ్చెల్ జిల్లా ఆంధ్రప్రభ ప్రతినిధి శ్రీనివాస్ విషయాన్ని మంత్రి ముందు వివరించారు. అక్రెడిటేషన్ కార్డులు పొందివున్న వేలాదిమంది జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందించడంలో సమాచార శాఖ పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ ఆంధ్రజ్యోతి విలేఖరి లింగం హెల్త్ కార్డు లేక చికిత్స పొందలేకపోతున్న పరిస్థితిని విరాహత్ అలీ మంత్రి కెటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమేనని, రాష్ట్రంలో ఇలాంటి బాధితులు ఎందరో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 239జీవో మూలంగా అర్హులైన సుమారు రెండు వేలమంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు అందకపోవడం విచారకరమన్నారు. ప్రధానంగా ఉర్దూ,చిన్న పత్రికల్లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు ఆ జీవో అన్యాయనికి గురిచేసిందన్నారు. ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు సంక్షేమ నిధి నుంచి ప్రస్తుతం చెల్లిస్తున్నలక్ష రూపాయల పరిహారాన్ని మూడు లక్షలకు పెంచాలని, బాధిత కుటుంబాలకు చెల్లిస్తున్న మూడు వేల పెన్షన్ ను 5వేలకు పెంచాలని కోరారు. విశ్రాంత జర్నలిస్టులకు పలు రాష్ట్రాల మాదిరిగా ఈ రాష్ట్రంలో కూడా పెన్షన్ పథకాన్నిఅమలు చేయాలన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామీణ విలేఖర్లకు (లోకల్ రిపోర్టర్లకు), రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పనిచేస్తున్న పాత్రికేయులందరికీ వెంటనే ఇంటి స్థలాలు,ఇండ్లను మంజూరు చేయాలని టీయూడబ్ల్యూజే-ఐజేయూ నాయకులు సమావేశంలో డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలపై ఉన్నది వున్నట్లుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ మాట్లాడుతున్న సందర్భంలో మంత్రి కెటీఆర్ తో పాటు సమావేశంలో పాల్గొన్న సమాచార శాఖ కమీషనర్ అరవింద్ కుమార్,ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు ఆసక్తిగా విన్నారని సమాచారం . అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఇండ్ల సమస్య, విశ్రాంత జర్నలిస్టులకు పెన్షన్ పథకం, మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు పరిహారం పెంచే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత తొందరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హెల్త్ కార్డులు లేని అక్రెడిటేటెడ్ జర్నలిస్టుల కోసం 15 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సమాచార శాఖ , ప్రెస్ అకాడమీకి బాధ్యతలు అప్పగించారు. ఆరోగ్య పథకాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు రెండు మూడు రోజుల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి,ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ,ఆరోగ్య శ్రీ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్పోరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.