గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై రూపొందించిన పాటను ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్

*ప్రాణ వాయువును అందిస్తూ, ఆయుష్షుని పెంచేవి అడవులు, చెట్లు*

*హరిత భారతాన్ని స్వప్నిద్దాం, ఆకుపచ్చని తెలంగాణ సాధిద్దాం*

*గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తి దాయకంగా కొనసాగుతోంది. అందరి చేయూత అవసరం: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి*

*గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై రూపొందించిన పాటను ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పద్మశ్రీ వనజీవి రామయ్య*

హైద‌రాబాద్, డిసెంబ‌ర్ 24: పర్యావరణంపై  ప్రతీ ఒక్కరూ బాధ్యతగా, ప్రేమగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైందిని   అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై తయారు చేసిన పాటను పద్మ శ్రీ వనజీవి రామయ్యతో కలిసి అరణ్య భవన్ లో మంత్రి ఆవిష్కరించారు.  ప్రపంచ మానవాళి ముందు ఇప్పుడు ఉన్న అతిపెద్ద సవాల్ పర్యావరణ రక్షణే అని మంత్రి అన్నారు. రాష్ట్రాన్ని హరిత తెలంగాణ‌గా మార్చాల‌నే ల‌క్ష్యంతో సీయం కేసీఆర్  హ‌రిత‌హారం కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టార‌న్నారు.  హ‌రిత హారం కార్య‌క్ర‌మం వ‌ల్ల తెలంగాణ‌లో 4 % ప‌చ్చ‌ద‌నం పెరిగింద‌ని వెల్ల‌డించారు.

ముఖ్యమంత్రి చేపట్టిన తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ఎం.పీ సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను దేశ వ్యాప్తంగా చేశారని, ఒక్కొక్కరు మూడు మొక్కలను నాటుతూ, మరో ముగ్గురిని నాటాల్సిందిగా సవాల్ చేయటం, ఒక గొలుసు కట్టులాగా విస్తరిస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతీ ఒక్కరూ హరిత భారతాన్ని స్వప్నించాలని, ఆకు పచ్చని తెలంగాణ సాధనే ధ్యేయంగా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు.  క్షీణిస్తున్న అడవులు ప్రాణాధారమైన ఆక్సీజన్ ను తగ్గిస్తున్నాయని, ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి, సంరక్షిస్తూ పచ్చదనం పెంచాల్సిన అవసరం ఉందన్నారు వనజీవి రామయ్య. నిరంతర కృషి, పట్టుదలతోనే అడవులు, చెట్ల పెంపకం సాధ్యమౌతుందన్నారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తమ స్థాయిలో పర్యావరణ హితానికి పాల్పడాలని, పచ్చదనం పెంపు ఉద్యమాన్ని హరిత భావజాల వ్యాప్తిలాగా చేపట్టాలని కోరారు.

దేశపతి శ్రీనివాస్ రాసిన పాటను, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించి, నటించగా, పూర్ణ చందర్ దర్శకత్వం, శిరీష్ కొరియోగ్రఫీ,  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ నిర్మాణ బాధ్యతలను నెరవేర్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విశిష్టతను పాట రూపంలో తీసుకువచ్చి, మరింత మందికి దగ్గర చేసేందుకు కృషి చేసిన పాట రూపకర్తలను ఎం.పీ సంతోష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్య‌క్ర‌మంలో పీసీసీఎఫ్ (సోష‌ల్ పారెస్ట్రీ) ఆర్.యం, డోబ్రియ‌ల్,  గాయ‌కులు రాహుల్ సిప్లిగంజ్, ద‌ర్శ‌కులు పూర్ణ చందర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్ర‌తినిది కిషోర్ గౌడ్, కొరియోగ్రఫర్ శిరీష్, ఎడిట‌ర్ వంశీ, సంగీత ద‌ర్శ‌కులు బాజీ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.