గోదావరి నదిలో అనూహ్యంగా వరద నీటి ఉధృతి పెరగడంతో అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. గోదావరి వరద ఉధృతి, తీసుకుంటున్న చర్యలపై ఆదివారం ఉదయం నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుతోనూ, తీసుకుంటున్న జాగ్రత్తలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతోనూ ముఖ్యమంత్రి మాట్లాడారు. గోదావరి నది ప్రవాహ ఉధృతికి అనుగుణంగా తీసుకుంటున్న చర్యలను మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రికి వివరించారు.
గోదావరి బేసిన్లోని అన్ని ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో నీరు వచ్చి చేరిందని మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రికి వివరించారు.
నిజాంసాగర్:
————-
నిజాంసాగర్ ప్రాజెక్టులోనే 17 టిఎంసి పూర్తి సామర్థ్యానికి గాను 10 టిఎంసిల నీరు ఇప్పటిదాకా వచ్చిందన్నారు. సాయంత్రానికి నిజాంసాగర్ కూడా పూర్తి స్థాయిలో నిండిన తర్వాత తదుపరి చర్యలకు సంబంధించి కూడా కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు.
మిడ్ మానేరు వద్ద పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు, అవసరమైన చర్యలు తీసుకునేందుకు మిడ్ మానేరుకు బయల్దేరిన మంత్రి హరీష్ రావు.
మిడ్ మానేరు వద్ద పరిస్థితి:
—————————-
అప్పర్ మానేరు, సిరిసిల్ల, కామారెడ్డి ప్రాంతాల్లో గత రాత్రి భారీగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో ఈ నీరు కూడా కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరుకు చేరుకుంది. దీంతో నిర్మాణంలో ఉన్న మిడ్ మానేరుకు రెండు లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చి చేరింది. మిడ్ మానేరు కట్టపై నుంచి నీరు ప్రవహిస్తున్నాయి. కేవలం మూడు టిఎంసి నీటి నిల్వ సామర్థ్యం మేరకే నిర్మాణం పుర్తయినందున వచ్చే ప్రవాహాన్ని మిడ్ మానేరులో నిల్వ చేసే పరిస్థితి లేదు. నీరు కిందికి పోతున్నది. ఈ నేపథ్యంలో మిడ్ మానేరు నుంచి ఎల్ఎండికి పోయే నీటి ప్రవాహం మాన్వాడ, పుత్తూరు, మల్లాపూర్, కంది కట్కూరు తదితర గ్రామాలకు చేరుకునే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నాలుగు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అంచనా వేస్తూ, మిడ్ మానేరు వద్ద తీసుకోవాల్సిన చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మిడ్ మానేరు నుంచి కిందికి వదిలిన నీటిని ఎల్ఎండికి చేరుస్తామాని, అక్కడ కూడా నిల్వ సామార్థ్యం దాటితే కిందికి వదులుతామని మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రికి చెప్పారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంత్రి హరీష్ రావుతో పాటు కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, సిఇ అనిల్ కూడా మిడ్ మానేరు వద్ద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఎస్.ఆర్.ఎస్.పి:
—————-
ఎస్.ఆర్.ఎస్.పి పూర్తి నిల్వ సామర్థ్యం 90 టిఎంసిలు కాగా, 85 టిఎంసిల నిల్వను స్థిరంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం వస్తున్నందున డానికి అనుగుణంగా ఎస్.ఆర్.ఎస్.పి నుంచి నీటిని కిందికి వదులుతున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిన్న మధ్యాహ్నం తర్వాత 25వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. సాయంత్రానికి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. అయితే రాత్రికి వరద ప్రవాహం మరింత ఎక్కువ కావడంతో ఎస్.ఆర్.ఎస్.పి లోకి నాలుగు లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతున్నది. దీంతో ఉదయం నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల కిందికి వదులుతున్నారు.
మహారాష్ట్రలో వర్షాలు, వరదల పరిస్థితిపై అక్కడి నీటి పారుదల శాఖ మంత్రి గరిష్ మహాజన్ తో తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. అక్కడి ప్రాజెక్టుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎంత మేరకు, ఎన్ని రోజుల పాటు కిందికి నీరు వచ్చే అవకాశం ఉందొ అంచనా వేశారు. అక్కడి నుంచి వచ్చే నీటి ప్రవాహంతో పాటు తెలంగాణ భూభాగంలోని వివిధ వాగులు, వంకల నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని కూడా అంచనా వేసి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణలోని ఎస్.ఆర్.ఎస్.పి, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, ఎల్ఎండి, సింగూరు, నిజాంసాగర్ తదితర ప్రాజెక్టుల వద్ద చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆయా ప్రాజెక్టుల వద్ద నీటి పారుదలశాఖ సీనియర్ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్, నిజామాబాద్ నుంచి మిడ్ మానేరు ప్రాంతానకి చేరుకున్న ఎన్.డి.ఆర్.ఎఫ్., మిడ్ మానేరుకు బయల్దేరిన సీనియర్ ఐఎఎస్ అధికారి బి.ఆర్.మీనా.