కేటీఆర్ ఇచ్చిన హామీని గుర్తు చేసిన టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ
తూప్రాన్, ఫిబ్రవరి 6: జర్నలిస్టులకు విద్య, వైద్య, గృహాల సమస్యల పరిష్కారం కోసం ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, వాటిని పరిష్కరించే బాధ్యత తనదేనంటూ కేటీఆర్ తమకు హామీ ఇచ్చిన విషయాన్ని టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ గుర్తు చేశారు.అర్హులకు గూడు, అక్రెడిటేషన్, హెల్త్‌కార్డులను సకాలంలో అందించాలన్నారు. ఐదారు నెలలుగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో హెల్త్‌కార్డులు పనిచేయడంలేదని, దీంతో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు అప్పులు చేసి చికిత్స పొందుతున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు భద్రత, మరోవైపు సంక్షేమం కోసం గత ఆరు దశాబ్దాలుగా తమ సంఘం రాజీలేని పోరాటాలు కొనసాగిస్తూ ముందుకెళ్తుందని కె. విరాహత్ అలీ స్పష్టం చేశారు. బుధవారం మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో నిర్వహించిన యూనియన్ జిల్లా ముఖ్యుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. జర్నలిస్టులపై దాడులు, వేధింపులు లేకుండా ఉండేందుకు గాను మీడియా రక్షణ చట్టం అవసరమని విరాహత్ అలీ డిమాండ్ చేశారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్సిగ్రేషియా, పింఛన్ చెల్లింపు ఐదేళ్లకు పెంచాలని విరాహత్ డిమాండ్ చేశారు. అలాగే 60ఏళ్లు నిండిన జర్నలిస్టులకు రూ. 10వేల పెన్షన్ సౌకర్యం కల్పించి గౌరవంగా బతికే విధంగా చూడాలని అన్నారు . 14 రాష్ట్రాల్లో పెన్షన్ సౌకర్యం ఉందన్నారు. జర్నలిస్టులకు సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని, టోల్‌ఫ్లాజా, రింగ్‌రోడ్ టోల్‌ప్లాజాలలో జర్నలిస్టులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు . రాష్ట్రంలో ఎన్నో సంఘాలు ఉన్నా, సంస్థాగత నిర్మాణంలో 31 జిల్లాల్లో తమ సంఘమే ముందంజలో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. వేలాది మంది సభ్యుల ఆదరణతో దేశంలోనే అత్యధిక జర్నలిస్టుల ప్రాతినిధ్య సంస్థగా టీయుడబ్ల్యుజె అగ్రస్థానంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. మార్చి 4న రాష్ట్ర అధ్యక్ష, కౌన్సిల్ సభ్యుల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైందని, ఈ ఎన్నికల ప్రక్రీయ ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా ఉంటుందన్నారు. మెదక్ జిల్లా మహాసభను మార్చి 2న మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌లో నిర్వహించడానికి నిర్ణయించారు. కార్యక్రమానికి శంకర్‌దయాళ్‌చారి అధ్యక్షత వహించగా, సీనియర్ జర్నలిస్టులు కంది శ్రీనివాస్‌రెడ్డి, మిన్ పూర్ శ్రీనివాస్, బుక్కా అశోక్, డీజీ శ్రీనివాస్‌శర్మ, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
Post Comment