కేంద్ర సెన్సార్ బోర్డ్ కొత్త ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్ లోని కవాడిగూడలో ప్రారంభం
చిత్ర పరిశ్రమకు ఆన్ లైన్ సర్టిఫికేషన్ వంటి మరింత మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సిబిఎఫ్ సి చైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ వెల్లడించారు. కేంద్ర సెన్సార్ బోర్డ్ కొత్త ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్ లోని కవాడిగూడ సి.జి.ఒ. టవర్స్ లో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నిహ్లానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రముఖ చలనచిత్ర దర్శకుడు శ్యామ్ బెనెగల్ నాయకత్వంలోని నిపుణుల సంఘం కొన్ని సిఫారసులతో కూడిన ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖకు సమర్పించిందని సిబిఎఫ్సీ సీఈవో అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు. ఈ నివేదికలో సినిమాటోగ్రఫీ చట్టానికి కొన్ని సవరణలను సూచించారని వెల్లడించారు. వాటిని సిబిఎఫ్ సి అమలుపరిచేందుకు కట్టుబడి ఉందన్నారు. సిబిఎఫ్ సి తనకు నిర్దేశించిన నియమాలను తు.చ.తప్పక పాటిస్తోందన్నారు. 2015-16 సంవత్సరంలో 1,185 చిత్రాలకు సెన్సార్ సర్టిఫికెటును జారీ చేసిందని, వీటిలో 348 కథాచిత్రాలు కూడా ఉన్నాయని శ్రీవాస్తవ తెలిపారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ దేశంలోనే మూడో అతి పెద్ద చలనచిత్ర నిర్మాణ పరిశ్రమగా ఉందని శ్రీవాస్తవ చెప్పారు. అధిక సంఖ్యలో చిత్రాలను అందించడమే కాకుండా దేశంలోకెల్లా అత్యధిక సంఖ్యలో సినిమాహాళ్లను కలిగివున్నదని ఆయన ప్రశంసించారు. బాహుబలి, శ్రీమంతుడు, మగధీర వంటి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయని గుర్తు చేశారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అతి పెద్ద సినీ నిర్మాణ సముదాయంగా పేరు తెచ్చుకొని గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించిందన్నారు.
చలనచిత్రాల పైరసీని అరికట్టడంలో సిబిఎఫ్ సి స్నేహపూర్వకంగా తోడ్పాటును అందించాలని దక్షిణ భారత ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సి. కల్యాణ్ అభ్యర్థించారు.
ప్రాంతీయ సెన్సార్ బోర్డ్ అధికారి పి. వి. ఆర్. రాజశేఖరమ్, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అచ్చిరెడ్డి, ప్రసాద్ లేబొరేటరీస్ అధిపతి రమేశ్ ప్రసాద్, సినీ నటి రేవతి, పలువురు సెన్సార్ బోర్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.