దత్తాత్రేయతో మంత్రి హరీశ్‌రావు భేటీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏర్పడిన నీటి వివాదాలను పరిష్కరించడానికి ఈ నెల 21న అపెక్స్ బోర్డు సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకోవాలనుకోవడం సంతోషకర పరిణామమన్నారు. సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావాల్సిన అవసరం ఉందని, లేకుంటే బడ్జెట్ పెరిగి పోతుందని అయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర మంత్రి హరీష్‌రావు దిల్కుషా అథితిగృహంలో దత్తాత్రేయతో భేటీ అయ్యారు. రాష్ట్ర ంలోని నీటి ప్రాజెక్టుల అంశంపై అయనతో చర్చించారు. ఈ నెల 21కంటే ముందే తాను కేంద్రమంత్రి ఉమాభారతిని కలిసి రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని కోరతానన్నారు. తెలంగాణ చాలా వెనుకబడిన ప్రాంతమన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ సమస్య చాలా సున్నితమైనదని …గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకపోవడం వల్లే సమస్య ఉత్పన్నమైందని విమర్శించారు. ఇరు తెలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ తగాదా పెట్టిందని దుయ్యబట్టారు. కేంద్రం నిష్పక్షపాతంగా వ్యవహారించి ఈ విషయంలో న్యాయం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా విమోచనోత్సవాన్ని జరుపాలన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించాలని తాను కోరుకుంటున్నానని ఈ విషయంలో ప్రధాని మోదీని కలుస్తానని దత్తాత్రేయ చెప్పారు.