శ్రీశైల దేవస్థానం: భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం గణేశ సదనము పేరుతో నిర్మిస్తున్న 224 గదుల వసతి నిర్మాణ సముదాయములోని రెండు గదులకు ఇద్దరు దాతలు ఈ రోజు 21న విరాళాలను అందించారు.ఇందులో వి.టి.వెంకటరమణ, హైదరాబాద్ రూ.10లక్షలను, వి. లక్ష్మీనారాయణ, హైదరాబాద్ రూ. 10 లక్షలను అందజేశారు.ఈ మేరకు విరాళాలను కార్యనిర్వహణాధికారి కార్యాలయములో కార్యనిర్వహణాధికారి కి అందించారు.
గణేశ సదన సముదాయములో ఒక్కొక్క గది నిర్మాణానికి మొత్తం విరాళం రూ. 10లక్షలుగా నిర్ణయించారు.
దాతలకు శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డుప్రసాదాలను కార్యనిర్వహణాధికారి అందజేశారు.
కార్తీకమాసోత్సవం:
ఈ నెల 16 వతేదీ నుండి కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబరు 14వ తేదీతో ఈ మాసోత్సవాలు ముగియనున్నాయి.
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ కార్తీకమాసోత్సవాలు నిర్వహిస్తున్నారు.
ముఖ్యంగా భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, స్వామిఅమ్మవార్ల ఆర్జితసేవలు, పారిశుద్ధ్యం, సోమవారాలు, పౌర్ణమిరోజులలో లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి, కార్తీకపౌర్ణమిరోజున జ్వాలాతోరణోత్సవం, నదీహారతి మొదలైన వాటికి సంబంధించి పలు ఏర్పాట్లు చేసారు.
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా పలు ప్రత్యేక చర్యలతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ దర్శనానికి విచ్చేసే భక్తులు తప్పనిసరిగా ఆన్లైన్లో దర్శనాల రిజిస్ట్రేషన్ చేయించుకోవలసినదిగా ఇప్పటికే ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులకు తెలిపారు. దర్శనాలకు విచ్చేసే భక్తులందరు తప్పనిసరిగా మాస్కు ధరించే నియమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దర్శన ప్రవేశద్వారం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ధర్మల్ గన్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను పరీక్షించిన తరువాతనే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.
కరోనాను అరికట్టేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారణ చర్యలు మొదలైన వాటి గురించి భక్తులలో అవగాహన కలిగించేందుకు దేవస్థానం ప్రసార వ్యవస్థ ద్వారా (మైకుద్వారా) ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు.
కార్తీకదీపోత్సవం భక్తులు కార్తికదీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద, శ్రీ కృష్ణదేవరాయ గోపురము ఎదురుగా గల గంగాధర మండపంవద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ఈ కార్తికదీపారాధన చేసుకునే భక్తులకు ఆలయ ఉత్తరభాగం నుండి ప్రత్యేక ప్రవేశం కల్పించారు.
భక్తులు ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద, గంగాధర మండపం వద్ద కార్తికదీపారాధనలను చేస్తున్నారు. కొందరు భక్తులు లక్షవత్తుల నోములను కూడా నోచుకున్నారు.
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అన్నప్రసాదాలను పొట్లాల రూపంలో అందిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 3.00గంటల వరకు ఈ అన్నప్రసాదాలను పొట్లాలుగా అందిస్తున్నారు.
ఆలయ దక్షిణ మాడవీధిలో ఈ అన్నప్రసాద పొట్లాలను అందిస్తున్నారు. ఆయా పర్వదినాలలో భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లలో వేడిపాలను కూడా ఇస్తున్నారు.
శివచతుస్సప్తాహభజనలు:
ఈ కార్తికమాసోత్సవాలలో లోకకల్యాణం కోసం అఖండ శివచతుస్సప్తాహభజన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
అందరికి శ్రేయస్సు కలగాలనే భావనతో ఈ భజనలు చేస్తున్నారు.
ఈ అఖండ శివభజనల వల్ల భక్తులలో భక్తిభావాలు, ఆధ్యాత్మికత పెంపొందడమే కాకుండా, క్షేత్ర వైశిష్ట్యం కూడా మరింతగా పెరుగుతుంది. కార్తికమాసమంతా నిరంతరం భజనలు కొనసాగుతాయి.