కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామికి శ్రీశైల దేవస్థానం తరుపున పట్టువస్త్రాల సమర్పణ
శ్రీశైల దేవస్థానం:కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం తరుపున ఈ రోజు ఉదయం పట్టువస్త్రాలు సమర్పించారు.
ఆగస్టు 22 తేదీ నుండి ప్రారంభమైన కాణిపాక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 11వ తేదీతో ముగియనున్నాయి.
ఈ మేరకు దేవస్థానం సహాయ కమిషనరు పి. కోదండరామిరెడ్డి, స్వామివారి ఆలయ అర్చకులు హరిశ్చంద్రమౌళి, అమ్మవారి ఆలయ అర్చకులు బి.వి.యస్.శాస్త్రి, అమ్మవారి ఆలయ ఇన్ స్పెక్టర్ ఎస్. వెంకటేశ్వరరాజు తదితరులు కాణిపాకం చేరుకుని దేవస్థానం తరుపున ఈ వస్త్రాలను సమర్పించారు.
ఈ సమర్పణకు ముందుగా కాణిపాక దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎ. వెంకటేష్, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి కస్తూరి, సహాయ కార్యనిర్వహణాధికారి విద్యాసాగర్ రెడ్డి, పర్యవేక్షకులు కోదండపాణి, అర్చకులు,వేదపండితులు సాదరంగా ఈ దేవస్థాన అధికారులను ఆహ్వానించారు.తరువాత సంప్రదాయబద్ధంగా మేళతాళాలతో శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించి, స్వామివారికి పూజాదికాలను జరిపారు.అనంతరం ఈ దేవస్థానం అధికారులను, అర్చకులను కాణిపాక కార్యనిర్వహణాధికారి, అర్చకస్వాములు, వేదపండితులు వేదాశీర్వచనముతో సత్కరించారు. ఆలయ సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి సంవత్సరం వరసిద్ధివినాయక స్వామి బ్రహ్మోత్సవాల సమయము ఈ పట్టువస్త్రాలను సమర్పిస్తున్నారు.
ఊయల సేవ:
లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్లకు ఊయల సేవను నిర్వహించింది.
ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలనక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ ఉంటుంది.ఈ సాయంత్రం గం. 7.30ల నుండి ఈ
ఊయల సేవ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపారు.అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు షోడశోపచార పూజ జరిపారు.
ఆ తరువాత విశేషంగా అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్ర నామపూజలు, స్వామివారికి సహస్రనామార్చన జరిపారు.చివరగా ఊయల సేవ జరిగింది.ఊయల సేవను పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిగాయి.
అంకాళమ్మ అమ్మవారికి విశేష పూజలు:
లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత అయిన శ్రీ అంకాళమ్మ అమ్మవారికి ఈ రోజు ( ఉదయం అభిషేకం, విశేష పూజలను జరిపారు.
ప్రతి శుక్రవారం శ్రీఅంకాళమ్మ అమ్మవారికి దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) ఈ విశేషపూజ ఉంటుంది. ఈ
ఇందులో భాగంగా శ్రీ అంకాళమ్మ అమ్మవారికి అభిషేకం, విశేష అర్చనలు, పుష్పాలంకరణ, కుంకుమార్చనలు జరిపారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజ , తరువాత లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు.
అనంతరం పంచామృతాభిషేకం, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం, విశేష అభిషేకం పూజలను జరిపారు. అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ అంకాళమ్మ అమ్మవారికి విశేషార్చనలను జరిపించారు.
Post Comment