శ్రీశైల దేవస్థానం:కరోనా వైరస్ విస్తరణ నివారణకు ఎప్పటికప్పుడు దేవస్థానం పలు చర్యలు చేపడుతోంది.ఇందులో భాగంగా ఈ రోజు 8న కార్యనిర్వహణాధికారి దేవస్థాన అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులతో దూరశ్రవణ సమావేశం ( టెలికాన్ఫరెన్స్ ) నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు.స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా. ఎం. సోమశేఖర్ కూడా ఈ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బంది – అందరు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశించారు. ఉద్యోగులే కాకుండా స్థానికులందరు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించే విధముగా అవగాహన కల్పించాలన్నారు. మాస్కులేని వారిని వీధిలోనికి అనుమతించకూడదని ముఖ్యభద్రతా అధికారిని ఆదేశించారు.అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలన్నారు.ముఖ్యంగా ఉద్యోగులు కార్యాలయములో విధులు నిర్వహించేటప్పుడు భౌతికదూరం పాటించడం తప్పనిసరి అన్నారు.కల్యాణకట్ట, క్యూలైన్ల ప్రవేశం మొదలైన చోట్ల విధులు నిర్వర్తించే సిబ్బంది తప్పనిసరిగా దేవస్థానం అందజేసిన పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ను ధరించాలన్నారు.అదేవిధగా దర్శన క్యూలైన్లు, ప్రసాద విక్రయ కేంద్రం మొదలైన చోట్ల కూడా ఎటువంటి లోపం లేకుండా భౌతికదూరం పాటించేవిధంగా భద్రతా చర్యలు చేపట్టాలని దేవస్థానం ముఖ్య భద్రతాధికారిని ఆదేశించారు.అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు కూడా క్షేత్రస్థాయిలో రోజువారీగా తనిఖీలు * నిర్వహిస్తూ కరోనా నివారణ చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలన్నారు.
ముఖ్యంగా కరోనా వ్యాప్తి నివారణకై తీసుకోవలసిన ముందుజాగ్రత్తలగురించి దేవస్థాన ప్రసార వ్యవస్థ ద్వారా ( మైక్ ద్వారా) నిరంతరం తెలియజేస్తుండాలని శ్రీశైలప్రభ సంపాదకుణ్ణి కార్యనిర్వహణాధికారి ఆదేశించారు.ఈ ముందు జాగ్రత్త చర్యల గురించి క్షేత్రపరిధిలో మరిన్ని ఫ్లెక్సీబోర్డులను ఏర్పాటు చేయాలని కూడా సంపాదకుణ్ణి ఆదేశించారు.దేవస్థానం కార్యాలయం, దర్శనక్యూలైన్లు, దేవస్థానం అతిథిగృహాలు, సత్రాలు, కేశఖండనశాల, మొదలైన అన్నిచోట్ల కూడా తప్పనిసరిగా ధర్మల్ గన్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను పరిక్షించిన తరువాతనే అనుమతించాలన్నారు. క్యూలైన్లు, కేశఖండనశాల, ప్రసాదాల విక్రయ కేంద్రం మొదలైన పలుచోట్ల చేతులను శానిటైజింగ్ చేసుకునేందుకు ఆయా ఏర్పాట్లు ఉన్నాయని , ఉద్యోగులందరు తరుచుగా చేతులు శుభ్రపరుచుకోవాలన్నారు. యాత్రికులందరు కూడా చేతులు శుభ్రపరుచుకునే విధంగా తగు అవగాహన కల్పించాలన్నారు.ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా ఎప్పటికప్పుడు క్యూలైన్లను శుభ్రపరచడం జరుగుతోందని, ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తుండాలని పారిశుద్ధ్య, , ఆలయవిభాగాలను ఆదేశించారు.
గంగాసదన్ – గౌరీసదన్, మల్లికార్జునసదన్ మొదలైన అతిథిగృహాలలోని క్యారిడార్లు మొదలైన వాటిని , కూడా నిరంతరం శానిటైజేషన్ చేస్తుండాలని కార్యనిర్వహణాధికారి ఆదేశించారు.కూరగాయలు, పాలపాకెట్లు మొదలైన వాటిని కొనుగోలు చేసిన తరువాత శుభ్రంగా నీటితో కడిగిన తరువాతనే వాటిని వినియోగించే విధంగా స్థానికులలో అవగాహన కల్పించాలన్నారు.