
బుధవారం సీఎం కేసీఆర్ పర్యటనను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు వెళ్లిన హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ మూడు మొక్కలు నాటారు. పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ మొక్కలు నాటి ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు ట్విట్టర్ లో, సోషల్ మీడియాలో గ్రీన్ చాలెంజ్ విసిరారు. ఈ సవాల్ స్వీకరించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెలంగాణా టూరిజం కార్పోరేషన్ చైర్మన్ పన్యాల భూపతి రెడ్డితో కలిసి మూడు మొక్కలు నాటారు. ఎంపీ వినోద్ కుమార్ గ్రీన్ చాలెంజ్ పిలుపు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటాలని, వాటిని కాపాడే బాధ్యత కూడా స్వీకరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, ఉద్యోగులు, బ్యాంకులు, సంస్థలు ఒక ఉద్యమంలా హరితహారం కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేసారు.