ఈనెల 22,23 తేదీల్లో కాళేశ్వరం పర్యటన– మంత్రి హరీశ్ రావు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన పనులలో మరింత వేగం అవసరమని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.ఈ నెల 22, 23 తేదీలలో కాళేశ్వరం పనులను పరిశీలిస్తానని ఆయన తెలియజేశారు.సోమవారం నాడిక్కడ జలసౌధ లో ఈ ప్రాజెక్టు పనులను సమీక్షించారు.ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరాన్ని పూర్తి చేసేందుకు పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ ఇంకా వేగం పెంచాలని ఆయన కోరారు. మోటార్ల బిగింపు పనులు, గేట్ల తయారీ బిగింపు పనులు  కూడా వేగం పుంజుకోవలసి ఉందని మంత్రి అన్నారు. ఈ ఏడాది కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు ఎత్తి తెలంగాణ బీడు భూముల్లో పారించాలనే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యాన్ని చేరుకునేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ రేయింబవళ్లు కృషి చేయాలని హరీశ్ రావు కోరారు. ఇంకా నాలుగైదు నెలల  గడువు మాత్రమే ఉండడంతో గోదావరిపై నిర్మించే మూడు బరాజ్‌లు, మూడు  పంప్‌ హౌజ్‌లతో పాటు కీలకమైన ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ మార్గం పనుల పురోగతిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.కాళేశ్వరం కు చెందిన మేడిగడ్డ, అన్నారం,సుందిళ్ళ బ్యారేజీలు,పంపు హౌజ్ లు, అన్నారం-కన్నేపల్లి గ్రావిటీ కెనాల్ పనులతో పాటు ప్యాకేజీ 6, 7, 8, 17,18,19 ల పనులపై సూక్ష్మ స్థాయిలో మంత్రి హరీశ్ రావు సోమవారం సమీక్షించారు.దుబ్బాక,గజ్వేల్, మేడ్చెల్,మెదక్,ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగునీరందించే 17,18,19 ప్యాకేజీల పనులను సమీక్షించారు.అన్నారం-కన్నేపల్లి మధ్య 13 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పనులు కూడా అత్యంత కీలకమని మంత్రి అభిప్రాయపడ్డారు.మేడిగడ్డ కు సంబంధించి మహారాష్ట్ర సరిహద్దుల్లో పెండింగ్ లో భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. మిగిలిన భూసేకరణ పనులపై ప్రతిరోజూ ఈ రెండు శాఖల అధికారులు,ఏజన్సీ ప్రతినిధులు సమీక్షించుకొని సమన్వయంతో పనిచేయాలని కోరారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు అత్యధికంగా అతవీప్రాంతాల్లోనే ఉన్నందున వర్షాలు త్వరగా పడే అవకాశాలున్నందున ఏజన్సీ ప్రతినిధులు,ఇరిగేషన్ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ మంత్రి కోరారు.ఈ సమీక్షా సమావేశంలో  ఇ.ఎన్.సి. మురళీధరరావు, టెక్నికల్ అడ్వైజర్ విజయప్రకాష్, కాళేశ్వరం సి.ఇ. వెంకటేశ్వర్లు,ఎస్.ఇ. సుధాకరరెడ్డి,ఇ.ఇ. శ్రీధర్ నూనె తదితర అధికారులు, వివిధ ఎజన్సేలా ప్రతినిధులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.