ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానం- ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ సంతోషం

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో నిలవడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను సులభతరం, సరళతరం చేసిన ఫలితాలు అందరికీ అందుతున్నాయని సిఎం అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేవారికి వర్తక, వ్యాపార, వాణిజ్యాలు నిర్వహించాలనుకునే వారికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు స్పూర్తిగా నిలిచాయని చెప్పారు. 340 విభాగాల్లో విధానాలను అధ్యయనం చేసిన తర్వాత ర్యాంకింగ్ నిర్వహించారని, ఈ 340 విభాగాలు పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగానికి సిఎం అభినందనలు తెలిపారు. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో పారదర్శకత, సింగిల్ విండో విధానం, భూమి లభ్యత, నిర్మాణ అనుమతులు, పర్యావరణ పరిరక్షణ లాంటి ప్రధాన విభాగాల్లో తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలకు గరిష్ట మార్కులు రావడం పట్ల సిఎం ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు గొప్పగా ఉండబట్టే అతి తక్కువ సమయంలోనే తెలంగాణలో 2,550 పరిశ్రమలు కొత్తగా వచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. గత ఏడాది 13వ స్థానంలో ఉన్న తెలంగాణ ఈ ఏడాది మొదటి స్థానంలో నిలవడానికి ప్రభుత్వ విధానాలతో పాటు అధికారుల కృషి కూడా కారణమన్నారు. ఇదే స్పూర్తి, ఒరవడి కొనసాగించి మరింత నాణ్యమైన, సులభతరమైన సేవలందించాలని సిఎం పిలుపునిచ్చారు.

 

 

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.