శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బంగా ఈ రోజు (06.03.2021) న సాయంత్రం విజయవాడ,ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం వారు శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.ఆ దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు, ప్రధానార్చకులు,ముఖ్య అర్చకులు, వేదపండితులు తదితర సిబ్బంది ఈ పట్టువస్త్రాలను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి దేవస్థానం అధికారులు, అర్చకస్వాములు, వేదపండితులు, దుర్గామల్లేశ్వర దేవస్థానం సిబ్బందికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.తరువాత ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాల సమర్పణ సంకల్పం పఠించి తరువాత నూతన వస్త్రాలకు పూజాదికాలు చేసారు.అనంతరం మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను, ఫలపుష్పాలను, అమ్మవారికి పసుపు, కుంకుమలు గాజులుసమర్పించారు.
ఎంతో చారిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీశైల క్షేత్రంలో ఎందరో చక్రవర్తులు, రాజులు, రాజకుటుంబీకులు మొదలైన వారు ఆయా ఉత్సవ సందర్భాలలో శ్రీ స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించేవారని ప్రతీతి.ఈ సంప్రదాయాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలోనూ ,దసరామహోత్సవాలలోనూ శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను అనవాయితీగా సమర్పిస్తోంది.
అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పట్టువస్త్రాలను సమర్పిస్తున్నారు.
శ్రీవరసిద్ధి వినాయక దేవస్థానం, కాణిపాకం వారు కూడా శ్రీస్వామి అమ్మవార్లకు బ్రహ్మోత్సవాలలో పట్టువస్త్రాలను సమర్పిస్తున్నారు.
ఈ సందర్భంగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు మాట్లాడుతూ శ్రీశైల బ్రహ్మోత్సవాలలో మూడో రోజున దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరుపున పట్టువస్త్రాలను సమర్పిస్తున్నామన్నారు.జ్యోతిర్లింగస్వరూపుడైన శ్రీమల్లికార్జునస్వామివారికి,మహాశక్తిస్వరూపిణి అయిన భ్రమరాంబా దేవివారికి బ్రహ్మోత్సవాలలో పట్టువస్త్రాలను సమర్పించే అవకాశం రావడం తమ పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భం తమకెంతో ఆనందం కలిగిస్తోందన్నారు.
ఈ సమర్పణ కార్యక్రమం లో ఆ దేవస్థానం ప్రధానార్చకులు ఎల్. దుర్గాప్రసాద్, అర్చకులు శ్రీనివాసశాస్త్రి, పలువురు వేదపండితులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, అసిస్టెంట్ ఇంజనీరు తదితరులు పాల్గొన్నారు.
7 న తిరుమల తిరుపతి దేవస్థానం, కాణిపాకంవారిచే పట్టు వస్త్రాల సమర్పణ:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారు రేపు (07.03.2021) న సాయంత్రం 6గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
టీటీడీ వారు సమర్పించే వస్త్రాలను రథోత్సవం రోజున శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామి వార్లకు అలంకరిస్తారు.
అదేవిధంగా శ్రీ వరసిద్ధివినాయస్వామివారి దేవస్థానం తరుపున కూడా (07.03.2021) న ఉదయం 8.00 గంటలకు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.