అమరావతి, జూన్ 12 : రాష్ట్రంలో మొత్తం రూ.16,12,316 కోట్ల పెట్టుబడులతో 2,721 పరిశ్రమలు వివిధ దశలలో ఉన్నాయి. ఈ యూనిట్లు పూర్తిగా అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో 36,40,068 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మొత్తం 706 పరిశ్రమలు ఉత్పత్తి దశలో ఉన్నాయి. ఇవి రూ.1,47,566 కోట్ల పెట్టుబడులతో 2,99,078 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించాయి. గ్రీన్, రెడ్ కేటగిరిలుగా రెండురకాల వర్గీకరణతో పరిశ్రమల ట్రాకింగ్ జరుపుతున్నారు. మొత్తం 1041 పరిశ్రమలు గ్రీన్ కేటగిరి దశకు చేరుకున్నాయని, మరో 1680 యూనిట్లు రెడ్ కేటగిరిలో వున్నాయని మంగళవారం రాత్రి సచివాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వివరించారు. రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేశ్, అమరనాథరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గ్రీన్ కేటగిరికి చేరుకున్న 18 ప్రభుత్వ శాఖలకు చెందిన 1041 పరిశ్రమలు పూర్తిగా ఉత్పత్తి దశకు చేరుకుంటే రూ.4,76,111 కోట్ల పెట్టుబడులతో 8,45,401 మందికి ప్రత్యక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. ఇందులో 27 పరిశ్రమలు ట్రయల్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. 64 యూనిట్లు యంత్ర బిగింపు దశకు చేరుకున్నాయి. రూ.2,10,625 కోట్లు పెట్టుబడులతో మరో 198 పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే మరో 2,88,196 మందికి ఉద్యోగ, ఉపాధి దక్కుతుంది. ఇవిగాక, రూ.23,971 కోట్ల విలువ చేసే 46 పరిశ్రమలు పునాదిరాయి వేసుకోబోతున్నాయి. ఇక, రెడ్ కేటగిరిలో ఉన్న మొత్తం 1680 పరిశ్రమలలో రూ.16,529 కోట్ల పెట్టుబడులతో వచ్చిన 51 పరిశ్రమలకు భూ కేటాయింపులు, ఇతర అనుమతులను పూర్తి చేసుకున్నాయి. రూ.76,911 కోట్ల పెట్టుబడులతో వచ్చే మరో 429 యూనిట్లకు భూ కేటాయింపులు జరగగా, ప్రస్తుతం అవి ఇతర అనుమతుల సాధన దశలో ఉన్నాయి. రూ.2,36,128 కోట్ల మేర పెట్టుబడులతో వచ్చే మరో 300 పరిశ్రమలు భూకేటాయింపులు, అనుమతుల దశలో ఉన్నాయి. ఇంకో 900 యూనిట్లు రూ.8.06,557 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చి డీపీఆర్ అందించడానికి సిద్ధంగా ఉన్నాయని పరిశ్రమల శాఖ కార్యదర్శి సోల్మాన్ ఆరోఖ్యరాజ్ ముఖ్యమంత్రికి చెప్పారు.
629 యూనిట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ ప్రథమ స్థానంలో నిలవగా, పరిశ్రమల శాఖ 510 పరిశ్రమలతో రెండో స్థానంలో ఉంది. 480 సంస్థలతో ఐటీ మూడవ స్థానంలో నిలిచింది. ఇడీబీ మొత్తం 413 పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చింది. పర్యటక రంగంలో 194 సంస్థలు ముందుకొచ్చాయి. సీఆర్డీఏ పరిధిలో 98 సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి.
2014 నుంచి ఇప్పటి వరకు రూ.1,21,713 కోట్ల పెట్టుబడులతో 86 మెగా యూనిట్లకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అనుమతులు ఇచ్చింది. వీటి ద్వారా 2,69,710 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయి. రూ.5,249 కోట్లు పెట్టుబడితో 20 మెగా పరిశ్రమలు ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించాయి. ఇవి 37,340 మందికి ఉపాధిని కల్పించాయి. రూ.2,107 కోట్లు పెట్టుబడులతో 3 మెగా యూనిట్లు ట్రయల్ దశకు చేరుకున్నాయి. ఇవి 3 వేల మందికి ఉపాధిని అందించాయి. రూ.750 కోట్లతో ఒక పరిశ్రమ మిషనరీ బిగింపు దశలో ఉంది. ఇక్కడ మరో 3 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయి. రూ.21,583 కోట్ల పెట్టుబడులతో 18 అతి పెద్ద పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే మరో 46,620 మందికి ఉపాధి దక్కనుంది. కెల్లోగ్, ఎన్ హెచ్ కే స్ప్రింగ్, షాహీ ఎక్స్‌పోర్టు, ఇండియన్ డిజైన్, వసంతా, రెగ్జామ్, టెక్స్ పోర్ట్, గమేశా, సార్ డెనిమ్, నిషా డిజైన్స్, సెల్ కాన్, అవంతి (పశ్చిమగోదావరి), అవంతి (తూర్పుగోదావరి), సుజ్లాన్, బెర్గర్ పెయింట్స్, మోహన్ స్పిన్టెక్స్ (2), రైజింగ్ స్టార్, డిక్సన్, లిండే ఇండియా లిమిటెడ్ కంపెనీలు ఉత్పత్తిని ఆరంభించాయి.
చెట్టినాడ్, సాయిదివ్య, గ్రీన్ ప్లే పరిశ్రమలు ట్రయల్ దశలో ఉన్నాయి. కేపీఆర్ ఇండస్ట్రీస్ అనే సంస్థ మిషన్ బిగింపు దశకు చేరుకుంది. ఏషియన్ పెయింట్స్, వెమ్ టెక్, గుంటూరు టెక్స్టైల్ పార్కు, కాంటినెంటల్ కాఫీ, రెడ్సన్, సీమ్‌లెస్, తారకేశ్వర టెక్స్టైల్ పార్క్, జెయిన్ ఇరిగేషన్, మునోత్, టాటా కెమికల్స్, కేసీపీ, రాక్ మ్యాన్, విశ్వ అపెరల్స్, రెయిన్ గ్రూపు, టోరే ఇండస్ట్రీస్ వంటి సంస్థలు నిర్మాణ దశలో ఉన్నాయి. హీరో మోటార్స్, భారత్ ఫోర్జ్, జయరాజ్ ఇస్పాత్, రుషీల్ డెకార్స్, అపోలో టైర్స్, పార్లే, రామ్ కో సిమెంట్, పేజ్ ఇండస్ట్రీస్, నాచు వంటి కంపెనీలు పునాదిరాయి వేశాయి.
రాష్ట్రంలో మరో నాలుగు పరిశ్రమలు రూ.2,954 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు ముందుకొచ్చాయి. వీటిపై పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో సవివరంగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సెయింట్ గోబోయిన్ ఇండియా ప్రై.లిమిటెడ్ సంస్థ రూ.2 వేల కోట్ల పెట్టుబడులతో 450 మందికి ఉపాధి కల్పిస్తూ విశాఖపట్నంలో ప్లాస్టర్ బోర్డు, గ్లాస్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ప్రారంభించనుంది. గ్రాబ్ మెషిన్ టూల్స్ ఇండియా సంస్థ రూ.304 కోట్లతో 400 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ మెషిన్ టూల్స్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. అనంతపురం జిల్లాలో ఈ పరిశ్రమ రానున్నది. రూ.150 కోట్ల పెట్టుబడులతో 1200 మందికి ఉపాధి కల్పిస్తూ, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ సెల్ కాన్ ఇంపెక్స్ సంస్థ చిత్తూరులో యూనిట్‌ను నెలకొల్పేందుకు ప్రతిపాదనలు అందించింది. రూ.500 కోట్లతో 430 మందికి ఉద్యోగాలను కల్పించేందుకు స్మార్ట్ ఫుడ్ లిమిటెడ్ అనే సంస్థ రెడీ టు ఈట్ ప్యాకేజ్డ్ ఫుడ్ తయారీ యూనిట్‌ను చిత్తూరులో నెలకొల్పేందుకు ముందుకొచ్చింది.
వీసీఐసీ, సీబీఐసీ పురోగతిపై సమావేశంలో చర్చించారు. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
విశాఖ, శ్రీకాళహస్తి-ఏర్పేడు రెండు నోడ్లు సిద్ధం అవుతున్నాయని, 33 వేల ఎకరాలలో ప్రాథమికంగా 5,815 ఎకరాలలో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఏడీబీ దీనికి 1 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందిస్తోంది. దీంతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. మచిలీపట్నం, దోనకొండ మరో 2 నోడ్స్ ఏర్పాటవుతాయి. జులై 10న కొరియన్ అధ్యక్షుడు భారతదేశ పర్యటనకు వస్తున్నారని, ఆ పర్యటనలో సామ్సంగ్, హ్యూండాయ్, ఎల్జీ, సీజే కొరియా, ఫిలిప్స్, ఏజీఎల్, టోషీబా వంటి సంస్థలకు చెందిన వ్యాపార దిగ్గజాలు కూడా రానున్నాయని అధికారులు తెలిపారు. వీరితో చర్చించి వీఐసీసీలో గల పారిశ్రామిక సానుకూలతలను వివరించి పెట్టుబడులు పెట్టించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. వీఐసీసీ మాస్టర్ ప్లాన్ సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. వీఐసీసీని ఫాస్ట్ ట్రాక్‌లో పెట్టాలని ముఖ్యమంత్రి వీరికి సూచించారు. విశాఖలో భూముల విలువ ఎక్కువగా ఉన్నందున చిత్తూరు ప్రాంతంలో పరిశ్రమలను ప్రోత్సహించేలా చూడాలని సూచించారు. అలాగే, 34 శాతం జీఎస్డీపీ వృద్ధి రేటు ఈ రంగంలోనే ఉన్నందున రాయలసీమలో అగ్రో ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వ శాఖలు ఫెసిలిటేటర్లుగా ఉన్నాయని, నియంత్రణ కోసం కాదనేది అధికారులు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. దేశంలో ఎంప్లాయిమెంట్, ఇండస్ట్రీస్ ట్రాకింగ్ ఏపీలో మినహా మరే రాష్ట్రంలో లేదని ఆరోఖ్యరాజ్ చెప్పారు.
*ఇంకా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఏమన్నారంటే:
పరిశ్రమలు రావాలి, అదే సమయంలో ఎంప్లాయిమెంట్ కూడా ఉండాలి.
అవసరమైతే ప్రభుత్వ విధానాలలో చిన్నచిన్న మార్పులకు కూడా సిద్ధపడాలి.
తిరుపతి కేంద్రంగా ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ అభివృద్ధి చేస్తున్నాం.
తిరుపతి టు నెల్లూరు ఎలక్ట్రానిక్ హార్డువేర్ పరిశ్రమలతో కళకళలాడాలి. 400 మిలియన్ యుఎస్ డాలర్ల మేర ఎగుమతులకు ఈ రంగంలో అవకాశం ఉంది.
పరిశ్రమలు రావడానికి అవసరమైతే నిబంధనలను సడలించాలి. ఇతర రాష్ట్రాల కంటే ప్రోత్సాహకాలు బాగా ఇచ్చినప్పుడు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ రాష్ట్రంలో సక్రమంగా వుందని పెట్టుబడిదారులు విశ్వసించినప్పుడు పరిశ్రమలు వస్తాయి.
వై నుంచి ఆర్ 1 వరకు కేటగిరిలలో ఉన్న పరిశ్రమలను పరిగెత్తించాలి.
ఇన్వెస్టుమెంట్ ట్రాకర్ : ఆన్లైన్లో ఎంప్లాయిమెంట్ వివరాలు, పనిచేస్తున్న వారి పూర్తి సమాచారం అందుబాటులో ఉంది. ఈఎస్ఐ, ఈపీఎఫ్, ఇతర అన్ని వివరాలు వున్నాయి. ఫోటో కూడా పెట్టండి. ఎంఎస్ఎమ్ఈ ప్రత్యేకంగా ట్రాక్ చేయండి. ఇప్పటికే ఆయా యూనిట్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందినవారి సంఖ్యను ఆన్లైన్లో అందుబాటులో ఉంచండి.జులై 3, 4 వ వారంలో ప్రత్యేకంగా వర్క్ షాప్ పెట్టి ట్రాకులో పెట్టాలి.
లోకేశ్ : మొబైల్స్, టీవీలు, సర్వర్లు వంటి ఎలక్ర్టానిక్ ఉపకరణాల తయారీలో ఏపీ ముందంజలో ఉన్నాయి. ఐటీ రంగంలో బిల్డింగులు కట్టి ఐటీ కంపెనీలకు ఇచ్చినట్టే ఈ రంగంలో డెవలపర్లు వస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా పాలసీని తీసుకొస్తున్నాం.