*Mouli, Machilipatnam*
అమరావతి : కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన అత్యాచార బాధితురాలికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అండగా నిలిచారు. హాస్టలు లో ఉంటూ చదువుకుంటున్న ఆమె 2015 లో అత్యాచారానికి లోనైంది. సమాజం దూరంగా పెట్టడంతోపాటు మరోపక్క తల్లిదండ్రుల నిరాదరణకు లోనైన ఆ యువతి ముఖ్యమంత్రిని ఆశ్రయించింది. ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రిని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని, సమాజం నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని వివరించింది. ఎక్కడికి వెళ్ళినా కనికరం చూపకుండా ఉద్యోగం, ఉపాధి కల్పించడం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దిక్కులేనివారికి దేవుడే దిక్కన్నట్లు ముఖ్యమంత్రిగా తగిన న్యాయం చేస్తారని వచ్చానని పేర్కొంది. ఆమె కష్టనష్టాలకు ఓర్చి ఎం.బి.ఎ పూర్తీ చేసింది. నా అన్న వారు లేక చదువుకున్నా ఉపాధి దొరకక ఆవేదనతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొరపెట్టుకుంది. ఆమె దీనస్థితి తెలుసుకున్న ముఖ్యమంత్రి తక్షణం స్పందించి రూ.50 వేలు ఆర్థికసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆమెకు ఉండటానికి ఇల్లు, ఉపాధికి ఉద్యోగం విషయమై కూడా పరిశీలన జరపాలని సూచించారు. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల ఆచూకీ తెలుసుకొనే అంశాన్ని పోలీసులకు అప్పగించాలని ఆదేశించారు.
.
.