జాప్యం లేకుండా నిధులు రీయింబ‌ర్స్ చేయండి-షెకావ‌త్‌ను కోరిన వైయ‌స్ జ‌గ‌న్‌

న్యూఢిల్లీ: 2022 జూన్ నాటికి పోల‌వ‌రం ప్రాజెక్టు పనులతో పాటు, భూసేకరణ–పునరావాస పనులను పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, వెంటనే స‌వ‌రించిన అంచనాలకు ఆమోదం తెలపాలని  ఏపీ   ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి   కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్‌ను  కోరారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్, కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌లతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా పోలవరం ప్రాజెక్టు అంశంపై జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో విస్తృతంగా చ‌ర్చించారు.  పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయాల్సి అంశాన్ని పునరుద్ఘాటించారు. పోలవరం పీపీఏతోపాటు, కేంద్ర జలమండలి సిఫార్సులతోపాటు, కేంద్ర జలశాఖకు చెందిన సాంకేతిక సలహామండలి (టెక్నికల్‌అడ్వైజరీ కమిటీ– టీఏసీ) అంగీకరించిన విధంగా 2017–18 ధరల సూచీ ప్రకారం రూ. 55,656.87 కోట్ల పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆమోదం తెలిపాలని కోరారు.

జాతీయ ప్రాజెక్టుల విషయంలో ఉన్న మార్గదర్శకాల ప్రకారం వాటర్ సప్ల‌య్‌ని కూడా ఇరిగేషన్‌ ప్రాజెక్టులో భాగంగా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వనరుల నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేస్తున్నామని, జాప్యం లేకుండా ఆ నిధులను రీయింబర్స్‌ చేయాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కోరారు. రీయింబర్స్‌మెంట్‌ను కాంపోనెంట్‌ వైజ్‌ ఎలిజిబిలిటీకి పరిమితం చేయొద్ద‌న్నారు 2013 రైట్‌ టు ఫెయిర్‌ కాంపన్‌సేషన్, ట్రాన్స్‌పరెంటీ ఇన్‌ ల్యాండ్‌ అక్విజిషన్, రీహేబ్‌లిటేషన్ అండ్ రీ సెటిల్‌మెంట్‌ చట్టం ప్రకారం పునరావాస పనులకు రీయింబర్స్‌ చేయాలని కోరారు.

పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం తరలించాలని కేంద్ర‌మంత్రిని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కోరారు. హైదరాబాద్‌లో ఇప్పుడు సచివాలయ కార్యకలాపాలు లేవని, ప్రాజెక్టు పర్యవేక్షణ, పరిశీలన కోసం సుదూరంలో ఉన్న హైదరాబాద్‌ నుంచి రావడం కష్టం అవుతోందని, అందుకే పీపీఏ కార్యాలయాన్ని రాజమండ్రి తరలించాలన్నారు.

అంత‌కు ముందు కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌తో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స‌మావేశ‌మ‌య్యారు. పోలవరం ప్రాజెక్టులో స్టాకింగ్‌ పనులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల్లో చిన్న చిన్న అంశాలు మిగిలిపోయాయని వెంటనే వాటిని పరిష్కరించాలని కోరారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.