×

మనిషి తన శరీరాన్ని సాధనంగా చేసుకుని, మనస్సును మార్గంగా చేసుకుని చేసే అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర యోగా- శ్రీశైలప్రభ సంపాదకుడు డా. సి. అనిల్ కుమార్

మనిషి తన శరీరాన్ని సాధనంగా చేసుకుని, మనస్సును మార్గంగా చేసుకుని చేసే అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర యోగా- శ్రీశైలప్రభ సంపాదకుడు డా. సి. అనిల్ కుమార్

శ్రీశైల దేవస్థానం: మనిషి తన శరీరాన్ని సాధనంగా చేసుకుని, మనస్సును మార్గంగా చేసుకుని చేసే అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర యోగా అని  శ్రీశైలప్రభ సంపాదకుడు డా. సి. అనిల్ కుమార్ అన్నారు. దేవస్థానం శుక్రవారం  అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించింది.దక్షిణమాడవీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ద ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసారు. ముందుగా సంప్రదాయాన్ని అనుసరించి అర్చక స్వాములు, అధికారులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తరువాత ఒంగోలు నగరానికి చెందిన చిన్నారులు రాధా రమణి, వల్లెపు ధనశ్రీ గణపతి ప్రార్థన, సరస్వతి ప్రార్థన, శివస్తోత్రాలకు సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు.

అనంతరం శ్రీశైలప్రభ సంపాదకుడు డా. సి. అనిల్ కుమార్  ప్రారంభ ప్రసంగం చేస్తూ విజ్ఞానానికి నిలయమైన మన భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుండి అభివృద్ధి చెందిన పలు శాస్త్రాలలో యోగశాస్త్రం కూడా ఒకటని అన్నారు. వాస్తవానికి యోగా అనేది మన సంస్కృతిలో అనాదిగా ఆచరణలో ఉన్నప్పటికీ పతంజలి మహర్షి దానిని సూత్రబద్ధం చేసి యోగసాధన మార్గాన్ని సుగమం చేశాడన్నారు.యోగసాధనకు పతంజలి మహర్షి ఎనిమిది అంచలు ఏర్పరచాడని, దానిని అష్టాంగయోగాగా పేర్కొంటున్నామన్నారు.యోగా అంటే కలయిక, కూర్పు, కూడిక, విధానం అనే అర్థాలు ఉన్నాయని చెబుతూ యోగసాధన అనేది ఆత్మ – పరమాత్మల అనుసంధానానికి దోహదం చేస్తుందన్నారు.

 పతంజలి మహర్షి “యోగ: చిత్తవృత్తి నిరోధ:” అని యోగాను నిర్వచించాడని, ఇక్కడ “చిత్తము” అనేదానికి “మనస్సు” అనే అర్థాన్ని స్వీకరించాలన్నారు డా. సి. అనిల్ కుమార్. కాబట్టి మనస్సు వలన జరిగే వృత్తులను అంటే మనసు యొక్క విధులను నిగ్రహించగలగడమే యోగా అని పేర్కొన్నారు.యోగా అనేది అటు మనసుతో పాటు ఇటు శరీరానికి కూడా సంబంధించిందన్నారు.కాబట్టి మనిషి తన శరీరాన్ని సాధనంగా చేసుకుని మనస్సును మార్గంగా చేసుకుని చేసే అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రగా ఈ యోగాను పేర్కొనవచ్చన్నారు.ఈ ఆధ్యాత్మిక గమనములో ఆరోగ్యం, ఆనందం, ఆయువు, ఉపవుత్పత్తులుగా లభిస్తాయన్నారు. అదేవిధంగా చురుకైన జీవనశైలి అలవడుతుందన్నారు.యోగ

మనసును కట్టడి చేస్తుందని, మనసుకు శాంతిని, విశ్రాంతిని ఇవ్వగలుగుతుందన్నారు. అందుకే యోగసాధన వలన బుద్ధి వికసిస్తుందన్నారు.

యోగాసనాలు:

కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ యోగా శిక్షకులు, యోగాచార్య, గంధవళ్ల బాలసుబ్రహ్మణ్యం, ఒంగోలు వారు ఆయా అంశాలను వివరిస్తూ అందరిచేత యోగాసనాలు చేయించారు.ప్రతి ఆసనానికి కూడా వీరు వివరణ ఇస్తూ, యోగపరమైన అంశాలను అధునిక వైద్య విజ్ఞానంతో అనుసంధానం చేస్తూ ఆయా విశేషాలను, యోగా వల్ల కలిగే ప్రయోజనాలను పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శారీరక ఆసనాలు, శ్వాసపై ధ్యాస, ధ్యానం, ప్రాణాయామం, ముద్రలు మొదలైనవన్నీ యోగాలోని ప్రధాన క్రియలు అని చెప్పారు. ఆరోగ్యకరమైన జీవితం, సుఖసంతోషాలు, బాధల నుండి విముక్తి, మానసిక ప్రశాంతత మొదలైనవన్నీ కూడా యోగసాధన ద్వారా పొందవచ్చునని అన్నారు.యోగావలన శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎన్నో మంచిఫలితాలు లభిస్తాయన్నారు.కార్యక్రమములో వీరు తాడాసనము, వృక్షాసనము, వక్రాసనము, ఉత్తాన పాదాసనము, పవనముక్తాసనము, అర్థహలాసనము, శలభాసనము, పాదహస్తానము, దండాసనము మొదలైన ఆసనాలను వేయించారు.

ఆసనాల తరువాత సూక్ష్మవ్యాయమం చేయించారు. సూక్ష్మవ్యాయమం తరువాత ప్రాణాయామం చేయించారు. కపాలభాతి, అనులోమ విలోమ, శీతలి, భ్రామరి మొదలైన విధానాలతో ప్రాణాయామం కొనసాగింది.ప్రాణాయామం తరువాత ధ్యానం చేయించారు. చివరగా శాంతిమంత్రాలతో ఈ యోగా కార్యక్రమం ముగిసింది.

అదేవిధంగా యోగా శిక్షకులందరికీ దేవస్థానం తరుపున శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి, వారిని సత్కరించారు.

ఈ యోగా కార్యక్రమములో యోగాచార్య బాలసుబ్రహ్మణ్యంతో పాటు కె.వి. శేషరావు, ఎస్.సుబ్బారావు, డి.వెంకయ్య, ఎం.స్వర్ణలత, స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

 కార్యక్రమంలో దేవస్థాన ఉప కార్యనిర్వహణాధికారి రవణమ్మ, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, శ్రీశైలప్రభ సంపాదకులు డా. సి. అనిల్ కుమార్, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed