WWW.ONLINENEWSDIARY.COM
విజయ దశమి శుభాకాంక్షలు
శ్రీ దుర్ముఖి నామ సం॥రం॥ దక్షిణాయనం; శరదృతువు; ఆశ్వీయుజ మాసం; శుక్ల పక్షం; దశమి:
”శమీ శమీయతే పాపం… శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం”
విజయదశమి అంటే విజయాలను సమకూర్చే పండుగ. దుర్గాదేవి చల్లని చూపు మన మీద ఉంటే అన్ని పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగి చేపట్టిన ప్రతీ పనిలో విజయం చేకూరి సంతోషం మన సొంతమవుతుంది. గురువారం దసరా పండుగను అత్యంత వైభవంగా జరుపుకునేందుకు ఊరువాడా పల్లె పట్నం తేడా లేకుండా అంతా సర్వసన్నద్ధమైంది. అమ్మ వారిని స్థుతిస్తూ 9రోజుల పాటు దుర్గానవరాత్రులను జరుపుకుని చివరి రోజు మహిషాసురమర్ధిని అలంకారంలో అమ్మను దర్శించుకుని త్రిలోకాలు మురిసిపోయే అపూర్వ ఘట్టం ఇది. దశహార అనే సంస్కృత పదం క్రమంగా దసరాగా మారింది.
మనలోని పది అవగుణాలను హరించేది దశహార పండుగకామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య, స్వార్ధ, అన్యాయ, అమానవత్వ, అహంకారం ఈ పది దుర్గుణాలపై విజయం సాధించే శక్తిని ఇచ్చేది అని కూడా అంటారు. ఆ పరమేశ్వరి పూజలలో తరించి జగదంబ అనుగ్రహం పొందేందుకు త్రిశక్తిమాతను మనసార 9రోజులు కొలవడం స్త్రీశక్తిలోని గొప్పదనం అవగతమవుతుంది.
దసరా పండుగ నేపథ్యాన్ని చూస్తే…
మహిషాసురుడు దేవేంద్రుని ఓడించి దేవ లోకానికి అధిపతి అయ్యాడు. ఆ రాక్షసుడు పెట్టే బాధ భరించలేక దేవతలు త్రిమూర్తులతో మొర పెట్టుకున్నారు. బ్రహ్మ, విష్ణు,మహేశ్వరుల నుంచి వెడలిన మహోజ్వల శక్తి.. శక్తి రూపంగా ఆవిర్భవించింది. ఆ విధంగా సాక్షాత్కారమైన ఆ దివ్య మంగళరూపానికి మహాశివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, బ్రహ్మ అక్షమాలను, కమండలాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణుడు పాశాన్ని, హిమవంతుడు సింహవాహనాన్ని ఇచ్చారు. ఇక ఆ మహాశక్తి దేవతలను పట్టి పీడిస్తున్న మహిషాసురుడిని తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి చివరికి సంహరించింది. మహిషాసురుడిని వధించింది కనుకనే మహిషాసురుమర్ధిని అయింది.
మహిషాసురుడి పీడ విరగడ అయింది కాబట్టి ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకున్నారు అదే విజయదశమి అయింది. ఈ రోజు సాయంకాల సమయాన్ని విజయమంటారు. ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా విజయం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. గ్రామ ప్రజలందరూ మంగళవాయిద్యాలతో గ్రామ పొలిమెరలకు ఈశాన్య దిక్కుగా దాటి శమీ(జమ్మి) వృక్షానికి పూజలు నిర్వహించాలని ధర్మ నిర్ణయ సింధు తెలియజేస్తోంది. శమీ శమీయతే పాపం… శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం..అని శమీ వృక్షానికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పాపాలను శమింపజేసి శత్రువు వినాశనం కావించేది శమీ వృక్షం.
అర్జునుడు పేడి ఆకృతిని వదలి ఈ శమీ వృక్షానికి పూజను నిర్వహించి తిరిగి గాండీవం చేపట్టాడని, రాముడు రావణుడిని సంహరించి శమీ వృక్షానికి పూజను నిర్వహించి తిరిగి అయోధ్యకు పయనమయ్యాడని కనుక శమీ వృక్షం అత్యంత పవిత్రమైందని, శమీ పూజ విజయానికి సంకేతమని శాస్ర్తాలుచెబుతున్నాయి. జమ్మి పూజ అనంతరం శమీ శమీయతే పాపంశమీ శత్రు వినాశనంఅర్జునస్య ధనుర్ధారిరామస్య ప్రియదర్శనం అని పాడుతు చెట్టు చుట్టు ప్రదక్షిణలు చేస్తారు. జమ్మి చెట్టు కింద కూర్చొని తాము చేపట్టబోయే పనులను తల్చుకుని పూజలు చేస్తారు. శత్రునాశనం చేయాలని కోరుకుంటారు.జమ్మి ఆకును బంగారంగా భావించి పెద్దల చేతిలోపెట్టి ఆశీర్వాదాలు తీసుకుంటారు. విజయదశమి సందర్భంగా ఇళ్లల్లో బొమ్మలకొలువు ఏర్పాటు చేస్తారు.
‘జమ్మిచెట్టు‘ (శమీ వృక్షం) ప్రాముఖ్యత:
‘జమ్మిచెట్టు’ (శమీ వృక్షం) విజయదశమి రోజునే అందరికీ గుర్తుకు వస్తుంది. ఆ రోజున జమ్మి చెట్టును పూజించి ”శమీ శమీయతే పాపం… శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం” అనే శ్లోకం కూడా రాసి జమ్మిచెట్టుకు కడుతూవుంటాం. జమ్మిచెట్టుపై ఆయుధాలు దాచి … దానిని పూజించిన కారణంగానే పాండవులు యుద్ధంలో గెలిచారని ఇతిహాసాలు చెబుతున్నాయి.
పురాణాలు జమ్మిచెట్టును ‘అగ్ని వృక్షం’గా పేర్కొంటున్నాయి. యజ్ఞయాగాది క్రతువులకు అవసరమైన అగ్నిని రాజేసేందుకు ఈ చెట్టు వేళ్లను … బెరడును ఉపయోగిస్తూ వుంటారు. అగ్ని వృక్షంగా అందరి ప్రశంసలు అందుకున్న జమ్మిచెట్టు, శత్రు సంహారం చేయడానికి అవసరమైన శక్తిని ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే శత్రు సంహారానికి సిద్ధపడిన వాళ్లు ఈ చెట్టును పూజించి యుద్ధానికి వెళ్లేవారని తెలుస్తోంది.
ఇక ఈ చెట్టు విజయంతో పాటు సంపదలు ప్రసాదిస్తుందనే విశ్వాసం ప్రాచీనకాలం నుంచి వుంది. పూర్వం రాజులు తమ సంపద పెరగడం కోసం … అది స్థిరంగా వుండటం కోసం జమ్మిచెట్టు కొమ్మలను గానీ … ఆకులను గాని ఖజానాలో ఉంచేవారట. ఇదే సంప్రదాయం నేటికీ కనిపిస్తూ వుండటం విశేషం. విజయదశమి రోజున జమ్మి పూజ కాగానే ఆకులను దూయడం … ఒకరికొకరు ఇచ్చుకోవడం … తమ సంపదతో కలిపి భద్రపరుచుకోవడం ఆనవాయతీగా వస్తోంది.