×

ఆరు గ్యారంటీలను ప్రజలకు చేరవేయడానికి మీరే మా సాధకులు-కలెక్టర్లు, ఎస్పీలు సమావేశంలో ముఖ్యమంత్రి ఆలోచనలు

ఆరు గ్యారంటీలను ప్రజలకు చేరవేయడానికి మీరే మా సాధకులు-కలెక్టర్లు, ఎస్పీలు సమావేశంలో ముఖ్యమంత్రి ఆలోచనలు

* ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  ప్రసంగం.. (24-12-2023)

 కొత్త ప్రభుత్వం తరపున మీకందరికి స్వాగతం పలుకుతున్నా..   ప్రధానంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి  ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే..  అధికారులు, ప్రజాప్రతినిధులు  సేవకుల్లాగా పనిచేయాలి.  అప్పుడే అనుకున్న లక్ష్యం దిశగా  మనం ప్రయాణం చేయడానికి అవకాశం వుంటుంది.  ఇందులో ఏది కూడా  కాస్త వెనుకా ముందు చేసినా  సరైన పనులు చేయకపోయినా.. ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, ఎన్నికలలో ఇచ్చిన గారంటీలను అమలు చేయడానికి  మొట్టమొదట పాలకులు, పరిపాలకులంటే..  సచివాలయంలో ఏ నిర్ణయం జరిగినా క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఒక పక్కన కలెక్టర్లది, పోలీస్ అధికారులది.  పత్యక్షంగా ప్రజలతో సంబంధాలు వుండాల్సినవాళ్లు, వుండే వాళ్లు జిల్లా కలెక్టర్లు,  జిల్లా ఎస్పీలు,  పోలీస్ కమిషనర్లు,  అందుకే ఈ రెండు ప్రజాపాలన మీద గ్రామ సభలు నిర్వహించి  నిజమైన లబ్దిదారులను గుర్తించి  నిస్సహాయులకు సహాయం అందించాలని  ఆలోచనతో,  ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టడం జరిగింది.  ఈ సందర్భంగా డా.బాబాసాహెబ్ అంబేడ్కర్   చెప్పిన అంశాన్ని మీకు గుర్తు చేస్తూ.. మిగతా వివరాలు మాట్లాడదలుచుకున్నా..  అభివృద్ది చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు.  పౌరుల నైతికాభివృద్దే నిజమైన  దేశాభివృద్ది..  అద్దాల మేడలు కట్టో..  రంగుల గోడలు చూపించో.. అభివృద్ది జరిగిందని ఎవరైనా భ్రమపడితే…  తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు.  నిజమైన అభివృద్ది అనేది పౌరులయొక్క సమగ్రాభివృద్ది జరిగినప్పుడే… చివరి వరసలో వున్న పేదవారికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం గానీ, దేశం గానీ అభివృద్ది చెందినట్లు భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ.. అందుకే  ఈరోజు  చివరి వరుసలో నిలబడ్డ  తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో   వుండే ప్రతి పేదవాడికి  ప్రభుత్వం అందించదలుచుకున్న సంక్షేమ పథకం చేరాలి.  చేరాలంటే చేరవేయవలసిన వారధి మీరే..  మీమీదనే మా ప్రభుత్వం  పూర్తి స్థాయిలో బాధ్యత  పెట్టి నమ్మకంతో విశ్వాసంతో  ఈ అభయ హస్తం ద్వారా  అమలు చేయబోయో ఆరు గ్యారంటీలను  దానికి సంబంధించి వినతిపత్రాలను, అప్లికేషన్లను తీసుకోవాలని ఆలోచన చేసి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.

సివిల్ సర్వీసెస్ కు సంబంధించిన అఖిల భారత సర్వీసెస్  అధికారుల గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు  మీరందరూ, మనమందరం గుర్తు చేసుకోవాల్సింది  ఎస్.ఆర్. శంకర్ గారు.  వారు జీవితకాలం  సచివాలయానికి ఉదయం 9.30 గంటలకు నడుచుకుంటూ వచ్చి రాత్రి వరకు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతీ  పైల్ ను క్షుణ్ణంగా పరిశీలించి,  విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వారు. అతను అఖిల భారత సర్వీసెస్ అధికారులకు  ఒక ఆదర్శప్రాయమైన అధికారిగా నిలబడ్డవాడు ఎస్.ఆర్. శంకరన్‌ గారు.  వీరు ప్రతిరోజు  ఉదయం విధులకు ముందు ఎస్ఆర్ శంకర్ ను గుర్తు తెచ్చుకుంటే తప్పకుండా మన  విధానంలో మార్పు వస్తుంది. ప్రజలకు అది ఉపయోపడుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను.  ఆనాటి కేంద్ర ప్రభుత్వం వారి సేవలను గుర్తించి  పద్మభూషణ్ అవార్డు ఇస్తే కూడా  వారు సున్నితంగా తిరస్కరించారు.  సన్మానాలకు ఇలాంటి అవార్డులకు నేను అతీతం,  ఇలాంటివి నేను ఆశించను.  నేను నా బాధ్యత నెరువేరుస్తానని ఎస్.ఆర్.శంకరన్‌ గారు వినయంగా, వినమ్రతతో  కేంద్ర ప్రభుత్వ పద్మభూషన్ అవార్డు తిరస్కరించడం ద్వారా  వారు గొప్ప ఆదర్శవంతమైన అధికారిగా చరిత్రలు నిలిచిపోయారు.

ఈరోజు ఇక్కడ వున్న మా ఉన్నతాధికారులకు, మా జిల్లా కలెక్టర్లకు, మా ఎస్పీలకు, అడీషినల్ కలెక్టర్లకు  నా సూచన ఒక్కటే..  ఈ ప్రభుత్వం అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్.  ప్రెండ్లీగవర్నమెంట్ అంటే అధికారులు మీరు ప్రజలచేత శభాష్ అనిపించుకున్నంతవరకే ఈ ప్రభుత్వం మీతో ఫ్రెండ్లీగా వుంటుంది.  మీ పరిపాలనలో  నిర్లక్ష్యం వహించినా.. లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటన్నింటిని కూడా సమీక్షించడం జరుగుతుంది.   అదే విధంగా మనం చాలా సందర్భాల్లో  కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు మనను ఆకర్షిస్తాయి.  కొంతకాలం పనిచేసిన అధికారులు వారు  బదిలీ అయినప్పుడు  వివిధరాష్ట్రాల నుంచి  వచ్చిన అఖిల భారత సర్వీసులో భాగంగా  తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కొరుకుని వచ్చిండ్రు.  కనీసం 35 సంవత్సరాల సర్వీసు చేయగలరు. ఈ రాష్ట్రంలో పౌరుల్లో భాగంగా  మీరు కూడా ఒక బాధ్యత తీసుకుని ఈ  రాష్ట్ర నిర్మాణంలో కీలకపాత్ర పోషించడానికి  మీరు  ఈరాష్ట్రానికి వచ్చిండ్రు.  మాది ఏదో రాష్ట్రమనో, భాష వేరే అని  మీరెవరు భావించవలసిన అవసరం లేదు.   మేము ఎవరమూ కూడా మిమ్మల్ని ఆ రకంగా నియంత్రించే విధంగా చూడడం లేదు.  భాషను తెలుసుకోండి.. ప్రజల మనసులను గెలుచుకోండి. ప్రజల మనసులు మీరు గెలిచి విశ్వాసంతో నమ్మకంతో పనిచేయండి. జవాబుదారితనంతో వ్యవహరించండి.    కొంతమంది అధికారులు బదిలీ అయిపోతున్నప్పుడు  ప్రజలే ప్రత్యక్షంగా వచ్చి ఆ అధికారులను సన్మానించడం, కన్నీళ్లు పెట్టుకోవడం మీరు చూసే వుంటారు. మీ సూదూరమైన ప్రయాణంలో  ఎక్కడైనా, ఏ జిల్లాలో పనిచేసినా..  అది మీ బాధ్యత అనుకోండి..  మీరు చాలా బాగా పనిచేయాలని భావిస్తున్నాము.  అలాంటి వారికి ప్రభుత్వం సహాయ సహకారాలందిస్తుంది.  అధికారుల్లో మానవీయ కోణం ఉండాలె.. చట్టాలను అమలు చేసేటప్పుడు మానవీయ కోణమున్నప్పుడు… తొంబై తొమ్మిది శాతం పేద ప్రజలు తీసుకువచ్చే సమస్యలకు పరిష్కారం చూపించే అవకాశం వుంటుంది. మానవీయ కోణంతో ప్రజలు లెవనెత్తిన అంశాలను అర్థం చేసుకోలేకపోతే మనం ఏ సమస్యకు కూడా పరిష్కారం చూపించలేం.   రూల్స్ ను మేము అమలు  చేస్తున్నామని అనుకోవడం కంటే కూడా మనకు బాధ్యత ఇచ్చింది.. మనం ఈ కుర్చీలో కూర్చున్నది ఆ ప్రజల యొక్క సమస్యలను పరిష్కంచడానికే.. మన దగ్గరికి వచ్చినవారి సమస్యలు పరిష్కరించడానికే మనం వున్నాము. మేమైనా మీరైనా.. మన దగ్గరికి వచ్చినవారి సమస్యలు ఎలా పరిష్కరించాలో పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్లాలి.  పాజిటివ్ అప్రోచ్ వుండాలి. నెగెటివ్ అప్రోచ్ తో మనదగ్గరికి ఏ కాగితం వచ్చినా ఎట్లా తిరస్కరించాలే అనే ఆలోచనతో మనం ముందుకువెళితే ఈ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కానీ, సంక్షేమం కానీ సరైన దిశగా ప్రయాణం చేయదు.

తెలంగాణ రాష్ట్రం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మీరు గత 20 సంవత్సరాలనుండి ఇక్కడి ప్రజలతో మమేకమై వున్నారు.  దేశంలోని మిగతా రాష్ట్రాలు వివిధ కారణాలు,  ప్రత్యేకమైన రాజకీయవసరాలతో కానీ ఏర్పడ్డాయి. కానీ తెలంగాణ  రాష్ట్రం ఆషామాషీగా ప్రత్యేక రాష్ట్రంగా అవతరణ జరుగలేదు. కోట్లాదిమంది ప్రజలు కోరుకున్నారు.  లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమబాట పట్టిండ్రు.  వందలాది మంది అమరులై నేలకొరిగితే ఈ  రాష్ట్రం ఏర్పడింది.   ఎంతో బలమైన ఆకాంక్ష వుంటే తప్ప ఎవరూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టుకుని  తమ రాష్ట్రాన్ని సాధించుకోరు.  ఈ దేశంలో వుండే మిగతా రాష్ట్రాలకంటే  తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు ప్రత్యేకత వున్నది.  ఇక్కడి  డిఎన్ఎ దేన్నైనా సహిస్తుంది కానీ, స్వేచ్చను హరించాలన్న ఆలోచనతోటి, సామాజిక న్యాయాన్ని దెబ్బతీయాలన్న విధానంతోటి సమానమైన అభివృద్దిని దృష్టిలో పెట్టుకోకపోతే ఇక్కడి ప్రజలయొక్క రియాక్షన్  చాలా వైల్డ్ గా వుంటుంది. వాళ్లు సామాన్యమైన పరిస్థితుల్లో చాలా సబ్ హెసివ్ గా, చాలా గౌరవంగా, మర్యాదగా ఏ విధంగా వ్యవహరిస్తారో మీరందరూ  చూసిండ్రు.  అదే సమయంలో మనం ఇచ్చి పుచుకునే ధోరణిలో వాళ్లు వాళ్లు ఏమి ఆలోచన చేస్తుండ్రో మనం అర్థం చేసుకోకపోతే ప్రజలల్లో ఒకరకమైన చైతన్యం వుంది. ఆ చైతన్యం అనేది ఎంతటి వారినైనా కూడా ఇంటికి పంపించేటువంటి శక్తి   ఈ ప్రాంతం ప్రజలకు వున్నది.  మీరు ప్రజల్లోకి వెళ్లేట్పప్పుడు, కలిసేటప్పుడు ఈ ప్రత్యేకమైన  రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు వీటిని మీరు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోని వుండాలి..  ప్రజలయొక్క ఆలోచన ఎట్లుంటది అన్న దానికి గుర్తు చేయదలుచుకున్నా..  కాబట్టి మేము  జవాబుదారీతనంగా… బాధ్యతాయుతంగా  ప్రజలకు అందుబాటులో వుండి ప్రజల సమస్యల పరిష్కరించడంలో పేరుకుపోయిన సమస్యలను.. ఆ చిక్కుముడులను విప్పడం ద్వారా  ప్రజలకు పరిపాలనను అందుబాటులోకి తీసుకువచ్చి ఈ పాలన ప్రజలది..

ఈ ప్రజాపాలన, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం దిశగా ఈ నెల  28 నుంచి జనవరి 6,  2024 వరకు 8 పనిదినాలలో ఈ కార్యక్రమాలను తీసుకోవాలని.. దీనికి సంపూర్ణమైన సహకారం మీవైపు నుంచి వుండాలని కలెక్టర్లందరికీ తెలియజేస్తూ.. అదే విధంగా ఇక్కడ ఐపిఎస్ అధికారులన్నారు.. వాళ్లందరికి నేను కొద్దిగా గుర్తు చేయదలుచుకున్నా..  తెలంగాణ రాష్ట్రం గతంలో ఉద్యమ నేపథ్యం వున్న   రాష్ట్రం.. గతంలో ఇక్కడ రకరకాల భావజాలంతోని, పౌర హక్కుల కోసం ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వివిధ సంఘాలు ప్రభుత్వాలు నిషేధించిన సంస్థలు కూడా  తెలంగాణ రాష్ట్రంలో ప్రజల తరపున పోరాటాలు చేసిండ్రు.. ప్రభుత్వం చట్టాలు అమలు చేసిటప్పుడు  కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుని వుండొచ్చు.. పోలీసు అధికారులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేటప్పుడు కఠినంగా వ్యవహరించి వుండొచ్చు. అప్పుడప్పుడు నేను టీవిల్లో, పేపర్లలో చూస్తున్నాను.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని… ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరితోటి… పౌరునితో వుండాలి.. క్రిమినల్స్ తో  కాదు. ఫ్రెండ్లీ పోలీసింగ్, ప్రెండ్లీ అప్రోచ్ అనేది క్రిమినల్స్ తో కాదు.. గంజాయి, హెరాయిన్, కొకైన్ వాడే వాళ్లతో ఫ్రెండ్లీగా వుండమని కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అర్థం. నేరాలు, హత్యలు చేసిన వాళ్లు పోలీస్ స్టేషన్ కు వస్తే..వాళ్లను ఫ్రెండ్స్ లా ట్రీట్ చేయమని కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే….   సామాన్యమైన పౌరుడు పోలీస్ స్టేషన్ కు వస్తే ఫిర్యాదు చేయడానికి వస్తే  అతను ఏమి చెప్తున్నాడో…  వాళ్లను కూర్చోబెట్టి మర్యాదగా వాళ్లను అడిగి తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ ను మిస్ యూస్ చేసినా అబ్యూస్ చేసినా…ప్రభుత్వం ఉపేక్షించదు.. అందరూ పోలీస్ అధికారులు స్పష్టంగా అర్థం చేసుకోండి.. భూ కబ్జాదారులను, నేరగాళ్లను, డ్రగ్స్ మాఫీయా… ఉద్యమ నేపథం వున్న తెలంగాణ రాష్టంలో ఈరోజు  చిన్నచిన్న పట్టణాల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది..జూనియర్ కాలేజీల్లో, స్కూళ్లలో కూడా ఈరోజు మత్తు పదార్ధాలు అందుబాటులోకి వచ్చినయ్.. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి..  ఇట్లాంటి వాటిని  ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం క్షమించదు.  మీరు గతంలో తీవ్రవాదులను, ఐఎఐ లాంటి వాళ్లను కూకటి వేళ్లతో పెకిలించడానికి, నిర్మూలించడానికి ఏ రకంగా అయితే కఠినమైన చర్యలు తీసుకున్నారో.. వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారో.. ఈరోజు  ఈ డ్రగ్ మహమ్మారినికి కూడా నిర్మూలించేందుకు కృషిచేయాలి.  అడీషినల్ స్థాయి అధికారులను నియమించాం..  కింది స్థాయి వ్యవస్థలను కూడా బలోపేతం చేసే అధికారులను నియమిస్తాం.  గ్రేహండ్స్ , ఎసిబి, సైబర్ క్రైమ్ వంటివి ఏ పర్పస్ కు స్టార్ట్ చేసిండ్రో… విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏ పర్పస్ కు స్టార్ట్ చేసిండ్రో.. ఆయా సందర్భాలలో,  ప్రమాణాల ప్రకారం అప్పటి ప్రభుత్వం యొక్క అవసరాలను బట్టీ ఆ సంస్థలను పోలీస్ విభాగంలో అడిషినల్ పవర్స్ వారికిచ్చుకుంటూ ఎదైతే ఏర్పాటు చేసిండ్రో.. ఈరోజు ఒక గ్రేహండ్స్, ఎసిబి, సైబర్ క్రెం వీటిన్నింటిని కలిపితే.. ఇక్వల్ టూ టిఎస్ న్యాక్.. ఆంటే నార్కోటిక్ బ్యూరో అనేది అత్యంత కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం వున్నది..

మన కళ్లముందు కుప్పకూలిపోయిన పంజాబ్ రాష్ట్రం కనిపిస్తున్నది. తెలంగాణ పంజాబ్ రాష్ట్రం వంటి పరిణామాల వైపు  వేగంగా ప్రయణిస్తున్నది. దీన్ని నిషేధించి నిర్మూలించాల్సిన బాధ్యత మన పోలీస్ అధికారులది. నాకు కొంత అవగాహన వున్నది.. నేను ప్రజల్లో తీరుగుతూ వున్నాను. ఎక్కడ ఎమి జరుగుతుందో పోలీస్ అధికారుల వద్ద సమాచారం వుందో లేదో కానీ, స్వయంగా నా దగ్గర కొంత సమాచారం వుంది.  పోలీస్ శాఖకు, అధికారులకు నేను ఇక్కడి నుంచి ఇచ్చే ఆదేశాలు మీరు ఉక్కు పాదంతో అణిచివేయాల్సిన అవసరం వుంది. గంజాయి అనే పదం ఈరాష్ట్రంలో వినిపించకూడదు.  ఉద్యమనేపథ్యం వున్న తెలంగాణలో గంజాయి లాంటివి, డ్రగ్స్ లాంటివి ఇక్కడొచ్చి  ఇక్కడి యువతను  ఆక్రమించుకుంటున్నాయి.  ఇది అత్యంత ప్రమాదకరం.  సైబరాబాద్ కమిషనర్ ను ఆదేశిస్తున్నా..  సన్ బర్న్ పార్టీకి సంబంధించి డిజిటల్ మార్గంలో కొన్ని టికెట్లు అమ్ముతున్నట్లు వున్నారు. బుక్ మై షో లాంటి కొన్నింటిని నేను స్వయంగా గమనించినా.. వాళ్లు ప్రభుత్వ అనుమతి పొందలేదు.. అనుమతి పొందకుండా 31 రాత్రి సన్ బర్న్‌ పార్టీకి సంబంధించి టికెట్టు విక్రయిస్తున్నారు. 18 సంవత్సరాలలోపు వారికి అనుమతి లేదు.. అండర్ 18 వారికి మద్యం అమ్మడానికి లేదు.   ఈరోజు స్కూల్ పిల్లలకు కూడా దొరుకుతున్నాయి. బుక్ మై షో  ఫ్లాట్ ఫాం ఎదైతో వుందో దానిమీద ఎంక్వైరీ చేయండి.. అనుమతి లేకుండా పార్టీలు చేసుకోవడానికి వీలు లేదు. పోలీసుల అనుమతి లేకుండా టికెట్లు అమ్మడానికి లేదు. వారు ఎలా అమ్ముతున్నారు.  ఇట్లాంటి విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే.. గతంలో నేరగాళ్లకు ఒక విధానం వుండేది.  ఇప్పుడు సైబర్ క్రైమ్ బిగ్గెస్ట్ టాస్క్.. సంప్రదాయమైన నేరాలంటారు గదా ఆ నేరాలిప్పుడు పూర్తిగా  సైబర్ క్రైమ్ లొకి వెళ్లిపోయినయ్.  ఇప్పటి నేరాల నేచర్ మారిపోయింది.  సైబర్ క్రైమ్ నేరగాళ్లు పెరిగిపోయారు.   పోలీస్ వాళ్లు ఇంకా పటిష్టతను పెంచుకోవాలి.. దీని మీద కూడా పోలీస్ అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి.

ఈవెంట్స్‌ను జల్లెడ పట్టండి..  వాటిని ఆదాయ వనరుగా చూడకండి.   అవి ఎలాంటి కల్చర్ పెంపొందిస్తున్నాయంటె.. యువతను పెడద్రోవకు మళ్లిస్తున్నాయి.  హుక్కా సెంటర్స్, పబ్స్  లో జరిగే వ్యవహారాలు గాని, ఇట్లాంటి సన్ బార్న్ పార్టిలను గోవా, కర్ణాటక, మహరాష్ట్ర  రాష్ట్రాలు నిషేధించాయి.   ప్రస్తుతం మాత్రం చాలా కఠినంగా వ్యవహరించండి.   ఎంత పెద్దవాళ్లయినా, వాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఏమున్నా ఎవ్వరినీ ఉపేక్షించకండి.  ఎవ్వరూ మాట్లాడినా.. ఎవ్వరినీ వదలాల్సని పని లేదు. ఈ విషయంలో  సంపూర్ణంగా పోలిస్ అధికారులకు అధికారాలు ఇస్తున్నాను. గంజాయి ఎవోబి ప్రాంతం నుండి సప్లయ్ అవుతుందా? ఎమవుతుంది.. మన దగ్గర పండించేది చాలా తక్కువగా వుండొచ్చు..  కానీ వినియోగించేది ఎక్కువైంది. ఎవోబి ప్రాంతం నుండి మన ప్రాంతానికి ఏరకంగా వస్తుంది? ఎలా జరుగుతుందన్నది పోలీస్ అధికారులు  క్షుణ్ణంగా చూడండి.   లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఒక్కటే కాదు మీరు చేసే పని..  ప్రతి జిల్లా ఎస్పీ పట్టాణాలు, మండలాల్లో గంజాయి సరఫరా జరుగుతుందో తెలుసుకోండి.. ఇందుకోసం  ప్రత్యేకంగా అధికారులను నియమించండి.  సమాచారాన్ని సేకరించండి.  ఎవరున్నా కూడా ఎవ్వరినీ వదలడానికి వీలులేదు.

  •        నకిలీ విత్తనాలు. ఇది టెర్రరిజం కంటే ప్రమాదకరమైనది. ఆరుగాలం కష్టపడే రైతు నకిలీ విత్తనాల ద్వారా  రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే నకిలీ విత్తనాలే కారణం. నకిలీ విత్తనాల వెనుక ఉన్న కార్పొరేట్ కంపెనీలు సేల్స్ కోసం ఏవరో ఏజంట్ ను అపాయింట్ చేస్తడు. ఏజంట్ విత్తనాలు అమ్ముతాడు. అధికారులు కంపెనీ మీద కేసు పెట్టకుండా  లాస్ట్ పాయింట్ మీద కేసు పెట్టగానే మరుసటి రోజు విత్తనాల కంపెనీ పేరు మార్చుతాడు. అంతకుముందు అన్న పేరు మీద లైసెన్సు  ఉంటే తమ్ముడి పేరు మీద నడిపిస్తడు. అధికారులు నోటీసులు ఇవ్వగానే బోర్డు తిప్పేసి నకిలీ విత్తనాల దందా నడుస్తున్నది.
  • రౌడీషిటర్ల మాదిరిగా నకిలీ విత్తనాలు అమ్మే వారి మీద పోలీసులు… స్టేట్ అంత ఒక యునిట్ కింద క్రిమినల్స్ కోసం ఎలాగైతే డేటా బేస్ తయారుచేసుకుంటారో అలాగే  నకిలీ విత్తనాల మీద ఉక్కుపాదంతో అణచి వేయాల్సిన అవసరం ఉన్నది.
  • కంపెనీ ఓనర్లను బాధ్యులను చేసినప్పుడే నకిలీ విత్తనాల నియంత్రించబడుతాయి
  • పెద్ద కంపెనీలు ఎప్పుడూ కింద ఉన్న ఎవరిదో చూపెడుతారు. రైతులకు నష్ట పరిహారం ఇవ్వడానికి నకిలీ విత్తనాల కంపెనీల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్టు కింద వారి ఆస్తులను జప్తు చేయాలి
  • పోలీసులు డ్రగ్ మాఫీయా తో సంబంధమున్న వారి ఆస్తులు జప్తు చేస్తున్నారు . ఈడీ కేసులు ఉన్న వారి ఆస్తులు జప్తు చేస్తున్నది. నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీల ఆస్తులు ఎందుకు సీజ్ చేయడం లేదు. జవాబుదారితనం వారికి ఎందుకు  లేదు. చట్టంలో సీజ్ చేసే అవకాశం లేకుంటే చట్టాన్ని సవరించుకోవాలని అధికారులకు నేను ఆదేశిస్తున్నా. నకిలీ విత్తనాలను క్షమించే సమస్యనే లేదు. రైతులు చనిపోవడానికి ప్రధానమైన కారణం నకిలీ విత్తనాలు. ఈ విత్తనాలతో పంటలు పండిస్తే రైతు అప్పులపాలై చచ్చిపోతున్నారు. వీటన్నింటిని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. పరిపాలనలో మీరు అధికారులుగా తీసుకోవాల్సిన నిర్ణయాలు.
  • మతాల మధ్యలో, కులాల మధ్యలో వైషమ్యాలు పెంచేలా సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన విషయాల్లో కూడా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉ:డాలి. ఇలా చేసేవారి సమాచారం సేకరించి వారందరిని ఒక లైన్ లోకి పట్టుకురావాల్సిన అవసరముంది. ఏ విధంగా వారిని కంట్రోల్ చేయాలనేది ఆలోచించాలి.
  • రెవెన్యూ డిపార్ట్ మెంట్ గ్రామ సభలను నిర్వహిస్తుంది. పోలీసు డిపార్ట్ మెంట్ వీటిని స్ట్రీంలైన్ చేయాలి
  • ప్రతి రోజు రెండు సభలు రెండు గ్రామాల్లో చేయాలి. మండలంలో రెండు టీంలు ఉంటే ఒక టీంకు ఎమ్మార్వో, మరో టీఎంకు ఎంపీడీవో బాధ్యత తీసుకుంటారు.
  • ప్రజా పాలన కోసం శాసన సభ నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ను డిప్యూట్ చేస్తాం
  • 119 శాసనసభ నియోజకవర్గాలకు 119 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తాం. వారు నియోజకవర్గంలో వచ్చి కూర్చుంటరు. ప్రతి మండలాన్ని వర్టికల్ కింద డివైడ్ చేస్తారు.
  • ఒక వర్టికల్ కు ఎమ్మార్వో, మరో వర్టికల్ కు ఎంపీడీవో గారు బాధ్యత వహిస్తరు. వారి క్రింద ఆఫీసర్స్ స్ట్రక్షర్ ఉంటుంది.
  • ప్రతి అధికారి రెండు గ్రామాలకు వెళ్లాలి. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఒక గ్రామం, 2 గంటల నుంచి 6 గంటల వరకు మరొక గ్రామం. అప్లికేషన్లు తీసుకోవడం వంటి పనులుచేయాలి
  • పోలీసు డిపార్టుమెంట్ తో పాటు స్పెషల్ ఆఫీసర్ స్థానికంగా సమన్వయం చేసుకోవాలి. గ్రామాలకు సంబంధించి ముందుగా గ్రామాలకు వెళ్లి ప్రణాళికతో సభ నిర్వహించాలి. మహిళలకు ప్రత్యేకంగా ప్రాధాన్యత కల్పించాలి. ప్రత్యేక కౌంటర్లు మహిళలకు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకోండి.

 

  • మిగతావారిని కూడా స్ట్రీం లైను చేసి మొదట వచ్చిన వారికి మొదట ప్రాధాన్యత ఇవ్వండి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు మీకు అన్ని విషయాలు చేబుతారు. ఓపెనింగ్ రిమార్క్స్ అక్కడ అధికారులు చదివి వినిపిస్తారు.
  • ప్రభుత్వం ఉద్దేశ్యం ఏంటి, లక్ష్యం ఏంటి? వీటిని ఏ రకంగా అమలు చేయబోతున్నామనే విషయాలతో నోట్ పంపిస్తాం. గ్రామ సభ మొదలు పెట్టే ముందు  ప్రభుత్వం యొక్క సందేశాన్ని చదివి వినిపించిన తర్వాత కార్యక్రమాన్ని చేపట్టాలి. కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత అధికారులు బాధ్యతాయుతంగా  ఉండాలి.
  • నిరక్షరాస్యులు గ్రామ సభలకు వచ్చే అవకాశముంది. అంగన్ వాడీ, ఆశావర్కర్ల వంటి చదువుకున్న వారు ఎవరైనా ఉంటే నిరక్షరాస్యుల దరఖాస్తులు  వివరాలతో నింపించడానికి సహకారం అందించేలా చూడాలి.
  • గ్రామ సభల్లో అప్లికేషన్లు అందిస్తే గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉంది. అందుకే  ముందే గ్రామానికి అప్లికేషన్లు పంపించాలి. గ్రామ కార్యదర్శులు, ఇతర వ్యవస్థలతో ముందుగానే అప్లికేషన్లు  ప్రజలకు అందుబాటులో ఉంచాలి. దీంతొ ముందే దరఖాస్తులు నింపి సభలకు తీసుకుని వస్తారు. అప్పుడే వెళ్లి గ్రామ సభల్లో అప్లికేషన్లు పెడితే గందరగోళం ఏర్పడి పోలీసులు జోక్యం వంటి అంశాలు ఏర్పడుతాయి.
  • అందుకే ముందే గ్రామాలకు అప్లికేషన్లు పంపించి విలేజ్ సెక్రటరీ ద్వారా గ్రామపంచాయతీలు అందుబాటులో పెట్టాలి. ప్రజలకు చాటింపు వేసి తెలియజేయాలి
  • ఆధారుకార్డు, ఫోటో వంటి వాటి విషయాలు ప్రజలకు ముందే కమ్యునికేట్ చేయాలి. అమరవీరులు, ఉద్యమ కారులు ఉంటే వారికి సంబంధించిన ఎఫ్ఐఆర్, కేసుల వివరాలు వంటి వాటివి తీసుకురావాల్సి ఉంటుంది. అందుకే ముందే అప్లికేషన్లు అందించడం ద్వారా గందరగోళాన్ని తగ్గించుకోవచ్చు.
  • ప్రాక్టికల్ గా మీ అనుభవన్నాంత డిసెంబర్ 28 నుంచి జనవరి 6, 2024 వరకు ఒక పకడ్భంధీగా సమాచారాన్ని సేకరించి వీటిని డిజిటలైజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే.. ప్రభుత్వం వాటిని స్క్రూటిని చేసి అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం.

 

  • అభయహస్తంలో పొందుపరిచిన ఆరు గ్యారంటీలను ప్రజలకు చేరవేయడానికి మీరే మా సాధకులు… ప్రభుత్వం మీ పై గురుతరమైన బాధ్యతలు పెడుతున్నది. సచివాలయం నుంచి మంత్రి వర్గం నుంచి పాలసీ డాక్యుమెంట్ ను మాత్రమే అప్రూవల్ ఇస్తాం. అమలు పరిచే బాధ్యత మీదే.
  • అమలు పరిచే క్రమంలో అధికారులకు ఇబ్బంది అనిపిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కానీ, పోలీసు డిపార్ట్ మెంట్ లో డీజీపీ గారికి కానీ తెలియపర్చండి . ఈ విధానంలో పనిచేయడానికి ఇబ్బందిగా ఉంటే మీరు కోరుకుంటే అక్కడి నుంచి ఇతర ప్రాంతానికి బదిలీచేయడానికి, బాధ్యతలనుంచి మార్చడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు అక్కడ ఉండి మేము ఏమీ  చేయమంటే ప్రభుత్వానికి అభ్యంతరముంటుంది. ప్రభుత్వం ఆదేశాలను బాధ్యతగా నిర్వర్తించాల్సిందే.
  • ఎవరికైనా ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడంలో ఇష్టం లేకుంటే ఎక్కువ పనిచేయాల్సి వస్తుదనుకుంటే ..18 గంటలు పనిచేయాల్సి వస్తే మానసికంగా, శారీరకంగా ఇబ్బంది మాకు ఎందుకు అనిపిస్తే మాకు చెప్పండి . కలెక్టర్లుగా , ఎస్పీలుగా అక్కడ నుంచి మార్చి వేరోచోటికి బదిలీ చేస్తాం.18 గంటలు పనిచేయకుండా ఉండే ప్రాంతానికి బదిలీ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు.
  • ప్రజా ప్రతినిధిగా అధికారులకు సూచిస్తున్నా మీ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ కలెక్టర్లుగా, ఎస్పీలుగా మీకుంటుంది.  ప్రజలకు డైరెక్టుగా కనెక్టై ప్రజల భావము, భాష అర్ధం చేసుకుని అవకాశముంది. ఇటువంటి అవకాశాన్ని మీ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ కింద మలుచుకోండి. ఇటువంటి అనుభవం మీకు రాదు.
  • నెక్స్ట్ లెవెల్ లో పదోన్నతులు వచ్చినా మీరు అఫీసర్లను మానిటర్ చేయడానికి మాత్రమే పరిమతం అవుతారు కానీ క్షేత్రస్థాయిలో వెళ్లి మీరు అనుభవం సంపాదించడానికి, తెలంగాణ సంస్కృతిని , సాంప్రదాయాలను దగ్గరగా చూసే అవకాశం రాదు. దీనిని ఉపయోగించుకుంటారని, అద్భుతంగా పనిచేస్తారని , విషయాలలో ప్రతి నాలుగు నెలలకు గ్రామ సభలను , వ్యవస్థను సమీక్షించుకుందాం.
  • మీరు బాగా చదువుకుని ప్యాషన్ తో వచ్చారు. ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్ తో ఉన్నది. మేము ఆలోచన చేసిన దానితో పోల్చితే మీరు ఇంకా ప్రజలకు  బెటర్ గా చేయడానికి  మీరు సూచనలు ఇస్తే  ప్రభుత్వం తీసుకుంటుంది. మాకు ఎలాంటి భేషజాలు లేవు.
  • మేము పాలసీ డాక్యుమెంట్ మాత్రమే చేయగలము. మీ ఆలోచన పాలసీ కింద కన్వర్ట్ చేసి అమలు చేసేందుకు మీ దగ్గరికి మాత్రమే పంపిస్తాం
  • మీ సూచనలు సలహాలను ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో తీసుకుంటుంది. జవాబుదారితనం, బాధ్యత చాలా ముఖ్యమైనది. అధికారుల ఇంటిగ్రిటి, హానెస్టీ పెద్ద కొలమానం. మీకిచ్చే పోస్టింగ్ లో వీటిని పరిగణలోకి తీసుకుంటాం అని చెబుతూ మీ అందరికి మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొత్త సంవత్సరంలో కొత్త  ప్రభుత్వం, కొత్త ఆశలు చిగురించే విధంగాఆలోచనలతో  ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా నేను మొదట్లో చెప్పినట్లుగా ఈ జోడెద్దులు సమన్వయంతో ముందుకు వెళ్లాలి. ప్రజా ప్రతినిధులుగా మేము, ప్రభుత్వ పథకాలు ముందు తీసుకెళ్లే అధికారులుగా మీరు సమన్వయంతో ముందుకు వెళ్తామని చెబుతూ సెలువు తీసుకుంటున్నాను.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్  బాబు, కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, ఫైనాన్స్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితెందర్, సీనియర్ ఐఎఎస్ అధికారులు నవీన్ మిట్టల్, దానకిషోర్, సందీప్ కుమార్ సుల్తానియా, సయ్యద్ అలీ ముర్తుజా, కెఎస్.శ్రీనివాసరాజు, రాహుల్ బొజ్జా, క్రిష్టినాజడ్ చోంగ్తూ, రఘునందన్ రావు, రోనాల్డ్ రాస్, హరిచందన దాసరి, హనుమంతరావు, కె.అశోక్ రెడ్డి, వి.అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed