శ్రీశైల దేవస్థానం:శ్రీశైలక్షేత్రాన్ని సందర్శించాలని కోరుతూ పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లుగా దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు తెలిపారు.
ఇందులో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను క్షేత్రానికి విచ్చేసి శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకోవాలని కోరుతూ ధర్మకర్తల మండలి తరుపున ఆహ్వానిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
అదేవిధంగా దాతలను ఆహ్వానించుటలో భాగంగా పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులను కూడా క్షేత్రాన్ని సందర్శించాలని కోరనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే భక్తులరద్దీ రోజు రోజుకు పెరుగుతోందన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచేకాకుండా కర్ణాటక మహారాష్ట్రాలతో పాటు పలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా క్షేత్రాన్ని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారన్నారు. అందుకే మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. శ్రీశైలక్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదన్నారు. మరెక్కడాలేని విధంగా జ్యోతిర్లింగం , శక్తిపీఠం ఒకే ఆలయ ప్రాంగణములో వెలసివుండడం ఈ క్షేత్రం యొక్క విశేషమని అన్నారు. అంతేకాకుండా శ్రీశైలం అనాదిక్షేత్రంగా కూడా ప్రసిద్ధమైందని కూడా పేర్కొన్నారు. అందుకే క్షేత్రాన్ని మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందకు పలు చర్యలు చేపడుతున్నామన్నారు. మాస్టర్‌ప్లాన్‌లో తుది రూపానికి రూపొందించిన డి.పి.ఆర్.లో కూడా పలు ఆధ్యాత్మిక కట్టడాల నిర్మాణాలకుప్రతిపాదించడం జరిగిందన్నారు. అదేవిధంగా క్షేత్రాభివృద్ధికి ఇతోధికంగా దాతల సహకారాన్ని కూడా పొందడం జరుగుతుందని ఛైర్మెన్ పేర్కొన్నారు.
