శ్రీశైల దేవస్థానం:ఆలయంలోకి ప్రవేశించే భక్తులకు విభూతిధారణ చేయించే సంప్రదాయాన్ని దేవస్థానం సోమవారం పున:ప్రారంభించింది.దర్శనం క్యూకాంప్లెక్సు దగ్గర ఈ విభూతిధారణను దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు ఈ రోజు ఉదయం పున: ప్రారంభించారు.
గతంలో అమలులో ఉన్న ఈ కార్యక్రమం కోవిడ్ సమయములో నిలిపివేశారు. కాగా ఆలయ సంస్కృతీ సంప్రదాయాలపై భక్తులందరికీ మరింత అవగాహన కల్పించాలనే సంకల్పముతో ఈ విభూతిధారణ కార్యక్రమాన్ని తిరిగి ప్రవేశపెట్టారు.
భక్తులకు విభూతిధారణ చేయించేందుకు శివసేవకుల సహకారాన్ని తీసుకుంటున్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ నుదుట బొట్టు పెట్టుకోవడం అనేది మన సనాతన సంప్రదాయమన్నారు. ఎంతో విశిష్టమైన మన ఆర్ష సంస్కృతికి ఇది ప్రతీకగా నిలుస్తుందన్నారు.అందుకే ఆలయప్రవేశం చేసేవారందరూ తప్పనిసరిగా నుదుట బొట్టును ధరించేందుకు వీలుగా ఈ విభూతిధారణ తిరిగి ఏర్పాటు అయిందన్నారు.
కాగా మన శాస్త్రాలలో విభూతి మహిమ ఎంతో విశేషంగా పేర్కొన్నారు. విభూతి పవిత్రతను కలిగిస్తుందని, అరిష్టాలన్నింటిని తొలగించి సకల శుభాలను కలిగిస్తుందని చెప్పబడుతోంది. అంతేకాక విభూతిధారణ వలన సమస్త సంపదలు చేకూరుతాయని కూడా నమ్మకం.
విభూతిధారణ పునః ప్రారంభ కార్యక్రమములో స్వామివార్ల ప్రధానార్చకులు హెచ్.వీరయ్యస్వామి, సహాయ కార్యనిర్వహణాధికారులు ఎం.హరిదాసు,ఐ.ఎన్.వి. మోహన్, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, పర్యవేక్షకులు టి. హిమబిందు తదితరులు పాల్గొన్నారు.