
శ్రీశైలదేవస్థానం:ధనుర్మాసంలో ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామివారికి వార్షిక ఆరుద్రోత్సవం జరిగింది.
ఈ ఆరుద్రోత్సవాన్ని ప్రతి నెలలో మాసోత్సవంగా నిర్వహిస్తుండగా, ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రం వార్షిక ఆరుద్రోత్సవంగా నిర్వహిస్తున్నారు.
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబరు 19వ తేదీ రాత్రి శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక లింగోద్భవకాల రుద్రాభిషేకం, అన్నాభిషేకం జరిగాయి.
ఈ రోజు (20.12.2021) తెల్లవారుజామున శ్రీ స్వామివార్ల ప్రాత:కాల పూజల అనంతరం ఉత్తరద్వార దర్శనం, నందివాహన సేవ, మాడవీధుల్లో స్వామివార్ల ఉరేగింపు జరిగాయి.
కాగా ఈ ఉత్సవంలో భాగంగా నిన్న(19.12.2021) రాత్రి గం.10.00లకు నిర్విఘ్నంగా ఉత్సవం జరగాలని ముందుగా గణపతి పూజ జరిపారు. తరువాత లోక కల్యాణం కోసం ఈ ఉత్సవ సంకల్పంలో దేశం సుభిక్షంగా ఉండాలని, దేశంలో సుఖశాంతులు విలసిల్లాలని, అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని, జనులందరికి సుఖసంతోషాలు కలగాలని పేర్కొన్నారు . అనంతరం మహన్యాసాన్ని జరిపి శ్రీ స్వామివారికి లింగోద్భవకాల రుద్రాభిషేకం చేసారు. పంచామృతాలతోనూ, అరటి, కమలా, ద్రాక్ష మొదలైన ఫలరసాలతోనూ, ఆలయప్రాంగణంలోని మల్లికాగుండ పుణ్యజలంతోనూ ఈ అభిషేకం ఎంతో శాస్త్రోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేదపండితులు రుద్రమంత్రాలను పఠిస్తూ ఈ అభిషేకాన్ని నిర్వర్తించారు.
తరువాత స్వామివారికి అన్నాభిషేకం జరిగింది. అనంతరం పలు రకాల పుష్పాలతో, బిల్వదళాలతో స్వామివారికి విశేష పూజలు జరిగాయి.
ఈ రోజు (20.12.2021) వేకువజామున గం.3.00లకు మంగళవాయిద్యాల అనంతరం గం. 3.30 ని!!లకు సుప్రభాతసేవ జరిగింది. తరువాత శ్రీ స్వామివార్లకు ప్రాత:కాలపూజలను జరిపించిన అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వామివారి ఆలయ ముఖమండపంలో ఉత్తరముఖంగా వేంచేబు చేయించి ప్రత్యేక పూజలు చేసారు.
ఈ ఉత్సవంలో భాగంగానే ఉత్సవమూర్తులను స్వామివారి ఆలయ ముఖమండప ఉత్తరద్వారం నుండి వెలుపలకు తోడ్కొనివచ్చి ఆలయ ఉత్తరభాగంలోనే నందివాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు జరిపారు.
తరువాత మాడవీధులలో (శివవీధి)స్వామివార్ల ఊరేగింపు జరిగింది.
శ్రీ స్వామి అమ్మవార్ల ఊరేగింపు ప్రారంభమైన తదుపరి ఉదయం గం.6.00 ల తరువాత భక్తులను దర్శనానికి, ఆర్జిత సేవలకు అనుమతించారు.