శ్రీశైల దేవస్థానం: *వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు *ధర్మప్రచారంలో భాగంగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు *సామూహిక వరలక్ష్మీవ్రతంలో పాల్గొన్న 1000 మందికిపైగా ముత్తైదవులు *వ్రతంలో పాల్గొన్నవారందరికీ శ్రీస్వామిఅమ్మవార్ల దర్శనం , అన్న ప్రసాదాల ఏర్పాట్లు-
ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవస్థానం శ్రావణ రెండో శుక్రవారం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించింది.ఆలయ ఉత్తరద్వారం ఎదురుగా ఉన్న చంద్రవతి కల్యాణ మండపంలో ఈ వ్రతాలను ఏర్పాటు చేసారు.
కాగా ఈ వ్రతాలకు కావలసిన పూజాద్రవ్యాలన్నింటినీ దేవస్థానమే సమకూర్చింది. వ్రత కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ముత్తైదువల కోసం వేరు వేరుగా కలశాలను నెలకొల్పి శాస్త్రోక్తంగా ఈ వ్రతం జరిపారు.
సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వ్రతంలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ నిర్వహించారు. తరువాత వేదికపై వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు జరిపారు .
అనంతరం వరలక్ష్మీ వ్రతంలో భాగంగా భక్తులందరిచేత విడివిడిగా కలశస్థాపన చేయించి వరలక్ష్మీదేవివారిని సమంత్రకంగా ఆవహింపచేసారు. తరువాత శ్రీసూక్త విధానంలో వ్రతకల్పపూర్వకంగా వరలక్ష్మీదేవివారికి షోడశోపచారపూజలు జరిపారు . అనంతరం ఆలయ అర్చకులు వ్రతకథను పఠించి వ్రతమహిమా విశేషాలను భక్తులకు తెలియజేశారు. నీరాజన మంత్రపుష్పాలను జరిపి వ్రతసమాప్తి చేసారు.
అదేవిధంగా వ్రతాన్ని చేసిన ముత్తైదువులందరికి అమ్మవారి శేషవస్త్రాలుగా రవికవస్త్రం, పూలు, గాజులు, శ్రీశైలప్రభ మాసపత్రిక ప్రసాదాలు అందించారు.
వ్రతం చేసుకున్న ముత్తైదువులందరికీ వారు ధరించేందుకు వీలుగా శ్రీస్వామిఅమ్మవార్ల కైలాస
కంకణాలు కూడా అందించారు.
వ్రతానంతరం ముత్తైదువులందరికీ ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించారు. దర్శనానంతరం దేవస్థానం అన్నపూర్ణ భవనం లో ముత్తైదువులందరికీ అన్నప్రసాదాలు ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న దంపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ మన వైదిక సంప్రదాయంలో శ్రావణ మాసాన వరలక్ష్మీవ్రతాన్ని ఆచరించడం సంప్రదాయంగా వస్తున్నదని అన్నారు. ఈ శ్రావణమాసం సర్వదేవతా ప్రీతికరంగా చెప్పబడుతోందన్నారు. ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవస్థానం ఈ వరలక్ష్మీవ్రతాలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతంలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొనడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు.
ఈ వ్రతాన్ని స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి తెలియజేసినట్లుగా చెప్పబడుతోందన్నారు ఈ ఓ. వర అంటే ” శ్రేష్ఠమైన, ఉన్నతమైన అనే అర్థాలు ఉన్నాయన్నారు. ఈ వరలక్ష్మీ వ్రత ఆచరణ వలన శ్రేష్ఠమైనవి, ఉన్నతమైనవి మనకు లభిస్తాయి కాబట్టే ఈ వ్రతానికి వరలక్ష్మీ వ్రతం అనే పేరు వచ్చిందని అన్నారు. వరలక్ష్మీ వ్రత ఆచరణ వలన మనకు సకల సంపదలు లభిస్తాయని తెలిపారు. సాధారణంగా చాలా మంది ధన దాన్యాదులనే సంపద అని అనుకుంటూ వుంటారు. కానీ ఉత్సాహం, ఆనందం, శాంతం, శోభ, ఆరోగ్యం, ఆయువు, కీర్తి, ప్రతిష్ట, శక్తి, సామర్థ్యం మొదలైనవన్నీ సంపదలుగానే చెప్పబడుతున్నాయన్నారు.
జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీమల్లికార్జునస్వామివారు మహాశక్తి స్వరూపిణి శ్రీభ్రమరాంబాదేవివారు స్వయంవ్యక్తంగా వెలసిన శ్రీశైలమహాక్షేత్రంలో వరలక్ష్మివ్రతాన్ని జరిపించుకున్న వారందు కూడా ఎంతో అదృష్టవంతులన్నారు. అందరికీ శ్రేయస్సు కలుగుతుందన్నారు.
భూమండలానికి నాభిస్థానంగా చెప్పబడుతున్న శ్రీశైల మహాక్షేత్రములో ఏ పుణ్యకార్యం చేసినా వెయింతల ఫలితం లభిస్తుందన్నారు ఈ ఓ . అందుకే ఈ క్షేత్రములో ఆచరించే పూజాదికాలు, జప, ధ్యాన, పారాయణలు మొదలైనవన్నీ కూడా విశేషఫలితాన్నిస్తాయి.ఈ కార్యక్రమములో అర్చకస్వాములు, వేదపండితులు, ధర్మకర్తల మండలి సభ్యులు మేరాజోత్ హనుమంతునాయక్, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు మురళీధరరెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారులు ఐ.ఎన్.వి. మోహన్, ఎం. హరిదాసు,, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.