శ్రీశైల దేవస్థానం: *ధర్మప్రచారంలో భాగంగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
*సామూహిక వరలక్ష్మీ వ్రతంలో ప్రత్యేకంగా చెంచు గిరిజనులకు అవకాశం
*సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న దాదాపు 1500 మంది భక్తులు
*వ్రతములో పాల్గొన్న వారందరికీ చీర, రవిక వస్త్రం, తులసి మొక్క అందజేత
- వ్రతాన్ని జరిపించుకున్న వారందరికీ శ్రీస్వామిఅమ్మవార్ల దర్శనం , అన్న ప్రసాదాల ఏర్పాట్లు
ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవస్థానం శ్రావణ నాలుగో శుక్రవారమైన ఈ రోజు 30న ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించింది.శ్రావణ రెండవ శుక్రవారం ( 16.08.2024) రోజున కూడా ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించారు.
ఆలయ ఉత్తర ద్వారం ఎదురుగా ఉన్న చంద్రవతి కల్యాణ మండపంలో ఈ వ్రతాలను ఏర్పాటు చేశారు.
ఈ రోజు సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు చెంచు గిరిజన భక్తులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 600 మంది కిపైగా చెంచు భక్తులు ఈ వ్రతాన్ని జరిపించుకున్నారు. అదేవిధంగా దాదాపు 900 మంది ఇతర భక్తులు కూడా వ్రతాన్ని నిర్వహించుకున్నారు.
కార్యక్రమములో దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, ఆలయ విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.అదేవిధంగా పలువురు ఐ.టి.డి.ఏ అధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు.
కాగా నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు, బండి ఆత్మకూరు, శ్రీశైలం, ఆళ్ళగడ్డ, పల్నాడు జిల్లాలోని మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, ప్రకాశం జిల్లాలోని దోర్నాల, యర్రగొండపాలెం తదితర ప్రాంతాల నుంచి సుమారు 600 మందికి చెంచు భక్తులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.చెంచు భక్తులను ఎంపిక చేయడములో స్థానిక గిరిజనాభివృద్ధి సంస్థ ( ఐటిడిఏ) అధికారులు పూర్తి సహాయ సహకారాలను అందజేసారు.
ఈ వ్రతాలకు కావలసిన పూజాద్రవ్యాలనన్నంటినీ దేవస్థానమే కూర్చింది. వ్రత కార్యక్రమంలో ప్రతీ ముత్తైదువల కోసం వేరు వేరుగా కలశాలను నెలకొల్పి శాస్త్రోక్తంగా ఈ వ్రతం జరిపించారు.
సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వ్రతంలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ నిర్వహించారు. తరువాత వేదికపై వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపారు.
వరలక్ష్మీవ్రతంలో భాగంగా భక్తులందరిచేత విడివిడిగా కలశస్థాపన చేయించి వరలక్ష్మీదేవివారిని సమంత్రకంగా ఆవాహన చేసారు. తరువాత శ్రీసూక్త విధానంలో వ్రతకల్పపూర్వకంగా వరలక్ష్మీదేవివారికి షోడశోపచారపూజలు జరిపించారు. అనంతరం ఆలయ అర్చకులు వ్రత కథను పఠించి వ్రత మహిమావిశేషాలను భక్తులకు తెలియజేశారు. చివరగా నీరాజన మంత్రపుష్పాలను జరిపి వ్రతసమాప్తి చేశారు.
వ్రతాన్ని జరిపించుకున్న వారందరికీ, చీర, రవికవస్త్రం, పూలు, గాజులు, కంకణాలు, తులసిమొక్క, శ్రీశైలప్రభ మాసపత్రిక, మూడు రకాల ప్రసాదాలు అందించారు.
కాగా ఈ సంవత్సరమే మొదటిసారి భక్తులందరికీ చీర, తులసిమొక్క అందించారు.
భక్తులందరికీ ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించారు. దర్శనానంతరం దేవస్థానం అన్నపూర్ణ భవనం లో భక్తులందరికీ అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు.
భక్తులందరూ వ్రతక్రియను సౌకర్యవంతంగా వీక్షించేందుకు వీలుగా చంద్రవతి కల్యాణ మండపంలో ఎల్.ఈ.డి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు.