
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం ఉగాది మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఇందుకు చక్కని ఏర్పాట్లకు సిద్ధమవుతున్నామని ఈ ఓ ఎస్.లవన్న వెల్లడించారు. మార్చి 30 నుండి ఏప్రియల్ 3వతేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరుగుతాయి.ఐదు రోజులపాటు ఈ మహోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం కార్యాలయంలోని సమావేశ భవనం లో ఈ ఓ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఇప్పటికే ఈ ఏర్పాట్లకు సంబంధించి ఈ నెల 6వ తేదీన ప్రాథమిక సమావేశం జరిగింది.
కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లోని పలు భక్త సంఘాలు,పాదయాత్ర బృందాలు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంత స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో దేవస్థానం 9 న విజయపురలో సమన్వయ సమావేశాన్ని కూడా నిర్వహించింది. ఈ రోజు సమావేశంలో స్వామివారి ఆలయ ఉపప్రధానార్చకులు, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు, దేవస్థానం అన్ని విభాగాల అధిపతులు (యూనిట్ ఆఫీసర్స్) పర్యవేక్షకులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఈ నెల 24 నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యే 30వ తేదీ వరకు ఏడు రోజులపాటు భక్తులందరికీ స్పర్శదర్శనం కల్పిస్తారు. మార్చి 31వ తేదీ నుంచి ఉత్సవాలు ముగిసే ఏప్రియల్ 3వ తేదీ వరకు నాలుగు రోజులపాటు భక్తులందరికీ స్వామివార్ల అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు. కర్ణాటక, మహారాష్ట్రలలో కూడా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తారు.
మార్చి 24వ తేదీ నుంచి మార్చి 30 తేదీ వరకు సామూహిక అభిషేకాలను (రూ. 1500/-) శ్రీ వృద్ధమల్లికార్జునస్వామివారి ఆలయములో జరుగుతాయి. ఈ అభిషేక సేవాకర్తలకు స్వామివార్ల స్పర్శదర్శనం చేయిస్తారు.
మార్చి 31వ తేదీ నుంచి ఏప్రియల్ 3వ తేదీ వరకు సామూహిక అభిషేకాలు నిలుపుదల చేస్తారు. అయితే శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం యథావిథిగా ప్రతీరోజు నిర్వహిస్తారు.
సమావేశంలో ఈ ఓ మాట్లాడుతూ మార్చి 31వ తేదీ నుంచి స్వామివార్ల స్పర్శదర్శనం నిలిపివేస్తున్నందున భక్తులు ఉత్సవాల ప్రారంభంకంటే వారం రోజుల ముందు నుంచే క్షేత్రాన్ని దర్శించే అవకాశం ఉందని, ఆయా ఏర్పాట్లన్నీ ముందస్తుగానే పూర్తి చేయాలన్నారు.ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండే కాకుండా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని కోణాల నుండి తగు జాగ్రత్తలు తీసుకొనేందుకు సిబ్బంది అందరు సిద్ధంగా ఉండాలన్నారు.ఉగాది ఉత్సవాల కార్యాచరణ ప్రణాళికను, భక్తులరద్దీని బేరీజు వేసుకుంటూ తగిన ఏర్పాట్లు ముందస్తుగానే పూర్తి చేయాలన్నారు ఈ ఓ.అన్ని విభాగాల అధికారులందరు కూడా నిరంతరం స్థానిక పోలీస్, అటవీ, వైద్యశాఖ తదితర అధికారుల సమన్వయముతో ఉత్సవాల నిర్వహణలో ఆయా చర్యలు చేపట్టాలన్నారు.
కాలిబాటలో వచ్చే భక్తుల సౌకర్యార్థం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలో ఏర్పాటు చేసినట్లుగానే కైలాసద్వారం నుంచి భీమునికొలను వరకు మంచినీటి సదుపాయం కల్పించాలన్నారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతరం నీటి సరఫరా జరుగుతుండాలని ఆదేశించారు ఈ ఓ.వెంకటాపురం, నాగలూటి, అటవీ మార్గములో భక్తులకు కన్నడ భాషలో సూచన బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దర్శనం క్యూలైన్లు విశాలంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారుముఖ్యంగా క్యూలైన్లలో నిరంతరం మంచినీరు, అల్పాహారం అందిస్తుండాలన్నారు.ఉత్సవాలలో భక్తులరద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న కారణంగా క్యూకాంప్లెక్స్ లో ముందస్తుగానే మంచినీటిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
ఆలయప్రాంగణంలో శ్రీకృష్ణదేవరాయగోపురం నుండి స్వామివార్ల ఆలయప్రవేశ ద్వారం వరకు, స్వామివారి ఆలయ వెలుపల నుండి అమ్మవారి ఆలయ ప్రవేశం వరకు కూడా నిరంతరం భక్తులకు మంచినీటిని అందిస్తుండాలన్నారు ఈ ఓ.
కాలిబాట మార్గంలోని నాగలూటి, పెద్ద చెరువు, కైలాసద్వారం మొదలైన చోట్ల, శ్రీశైలక్షేత్ర పరిధిలో పలుచోట్ల భక్తులకు అన్నదానం చేసే దాతలకు దేవస్థానం నుండి అవసరమైన సహాయ సహకారాలను అందించాలని సంబంధిత అధికారులను ఈ ఓ ఆదేశించారు.
పారిశుద్ధ్య నిర్వహణకుగాను మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల లాగానే కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆ దిశలో చర్యలు తీసుకోవాలన్నారు, పారిశుద్ధ్య పనులకు గాను దేవస్థానం పారిశుద్ధ్య సిబ్బందితో పాటు అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు ఈ ఓ.ఎప్పటికప్పుడు చెత్తచెదారాలను తొలగించేందుకుగాను అవసరమైన సంఖ్యలో ట్రాక్టర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
క్షేత్రపరిధిలో పలుచోట్ల గల శాశ్వత మరుగుదొడ్లను భక్తులు వినియోగించుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచాలన్నారు. వీటితో పాటు పలుచోట్ల తాత్కాలిక మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా క్షేత్రపరిధిలో బహిరంగ మలమూత్ర విసర్జనను నిషేధించిన విషయమై సూచికబోర్డుల ద్వారా భక్తులకు అవగాహన కల్పించాలన్నారు.వైద్య సేవల కల్పనలో భాగంగా దేవస్థానం వైద్యశాలలో అవసరమైన ఔషధాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైనచోట్ల కాయిర్ మ్యాట్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కాయిర్ మ్యాట్ ఎప్పటికప్పుడు నీటితో తడుపుతూ ఉండాలన్నారు.