×

అన్ని శాఖల సమన్వయంతో ఘనంగా ముగిసిన  శ్రీశైల దేవస్థానం ఉగాది ఉత్సవాలు

అన్ని శాఖల సమన్వయంతో ఘనంగా ముగిసిన  శ్రీశైల దేవస్థానం ఉగాది ఉత్సవాలు

 శ్రీశైల దేవస్థానం:ఉగాది ఉత్సవాలలో భాగంగా గురువారం  సాయంకాలం శ్రీస్వామి అమ్మవార్లకు అశ్వవాహనసేవ, అమ్మవారికి భ్రమరాంబాదేవి నిజాలంకరణ కార్యక్రమాలు చక్కగా జరిగాయి.

అశ్వవాహనసేవ:

వాహనసేవలో భాగంగా శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. తరువాత ఆలయ ప్రాకారోత్సవం జరిగింది. అశ్వవాహనాధీశులైన శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించడం వలన సమస్యలు తీరిపోతాయని, సంతానార్థులకు సంతానం కలుగుతుందని నమ్మకం.

నిజాలంకరణ:

ఉగాది మహోత్సవాలలో భాగంగా , అలంకారాలలో  ఈ సాయంకాలం శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని భ్రమరాంబాదేవి నిజాలంకరణ స్వరూపంలో అలంకరింపచేసారు.అష్టభుజాలను కలిగిన ఈ దేవి శూలం, బాకు, గద, ఖడ్గం, విల్లు, డాలు, పరిగ మొదలైన ఆయుధాలను ధరించి జగన్మాతగా దర్శనమిచ్చింది.అమ్మవారి నిజాలంకరణ దర్శనం వలన సమస్యలన్ని తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయని నమ్మకం.

పూజాదికాల తరువాతా ఆలయప్రాంగణములో ప్రదక్షణగా ఉత్సవమూర్తలకు ప్రాకారోత్సవం జరిపారు.ఈ సాయంకాలం  ప్రాకారోత్సవంతో ఉగాది ఉత్సవాలు ముగిసాయి.

పూర్ణాహుతి – అవబృథం – త్రిశూలస్నానం:

ఉగాది మహోత్సవాలలో భాగంగా చివరి రోజైన  శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. తరువాత యాగశాల లో  శ్రీచండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు చేసారు. తరువాత నిత్యహోమ బలిహరణలను చేసి రుద్రహోమాన్ని, జయాదిహోమాన్ని జరిపారు. అమ్మవారి ఆలయ యాగశాలలో చండీహోమం జరిగింది.తరువాత యాగపూర్ణాహుతి, వసంతోత్సవం, అవబృథం కార్యక్రమాలు జరిగాయి.

పూర్ణాహుతి :

పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగకార్యక్రమాన్ని పూర్తి చేసారు.

వసంతోత్సవం :

పూర్ణాహుతి తరువాత వసంతోత్సవం జరిపించబడింది. ఈ కార్యక్రమములో స్థానాచార్యులు ( అధ్యాపక) వసంతాన్ని (పసుపు, సున్నం, సుగంధద్రవ్యాలు కలిపిన మంత్రపూరిత జలం) సమంత్రకంగా భక్తులపై ప్రోక్షించారు.

అవభృథం – త్రిశూలస్నానం

వసంతోత్సవం తరువాత చండీశ్వరస్వామివారికి మల్లికాగుండం వద్ద అవభృథం ఆ తరువాత త్రిశూలస్నానం కార్యక్రమాలు జరిగాయి.

అవబృథం :

వసంతోత్సవం ముగిసిన వెంటనే చండీశ్వరస్వామివారిని ఆలయ ప్రాకార ప్రదక్షిణతో మల్లికాగుండం వద్దకు వద్దకు పల్లకీలో తోడ్కొనివచ్చారు.

తరువాత చండీశ్వరస్వామికి అవభృథం జరిపారు.

ఈ అవభృథంలో రుద్రాధ్యాయ మంత్రాలతో చండీశ్వరస్వామివారికి శుద్ధజలం, పంచామృతాలు, భస్మోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, సుగంధోదకం, బిల్వోదకం, పుష్పోదకం, నారికేళోదకం మొదలైన వాటితో స్నపన కార్యక్రమం నిర్వహించారు.

త్రిశూలస్నానం :

తరువాత మల్లికాగుండంలో త్రిశూలస్నాన కార్యక్రమం జరిగింది.  కార్యక్రమములో చండీశ్వర స్వామివారికి మల్లికాగుండంలో పుణ్యస్నానం జరిపారు.త్రిశూలస్నానం సమయం లో మల్లికాగుండ జలాన్ని తలపై ప్రోక్షించుకోవడం వలన పాపాలన్ని నశించి శ్రేయస్సు కలుగుతుందని చెబుతారు.

కార్యక్రమాలలో కార్యనిర్వహణాధికారి  ఎస్. లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు  మఠం విరూపాక్షయ్యస్వామి, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, అర్చకస్వాములు, వేదపండితులు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

print

Post Comment

You May Have Missed