శ్రీశైల దేవస్థానం:
ఉగాది మహోత్సవాలలో భాగంగా చివరి రోజైన శుక్రవారం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. యాగశాల లో శ్రీచండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపించారు. అనంతరం లోకకల్యాణం కోసం జపాలు చేసారు. తరువాత నిత్యహోమ బలిహరణలను చేసి హోమాలు జరిపారు।
తరువాత యాగపూర్ణాహుతి, వసంతోత్సవం, అవభృథం కార్యక్రమాలు జరిపారు.
పూర్ణాహుతి :
పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలో ఆహుతిగా సమర్పించి యాగ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
వసంతోత్సవం :
పూర్ణాహుతి తరువాత వసంతోత్సవం జరిపారు. ఈ కార్యక్రమములో స్థానాచార్యులు (అధ్యాపక) వసంతాన్ని (పసుపు, సున్నం, సుగంధ ద్రవ్యాలు కలిపిన మంత్ర పూరిత జలం) సమంత్రకంగా భక్తులపై ప్రోక్షించారు.
అవభృథం – త్రిశూలస్నానం
వసంతోత్సవం తరువాత చండీశ్వరస్వామివారికి మల్లికాగుండం వద్ద అవభృథం ఆ తరువాత త్రిశూలస్నానం కార్యక్రమాలు జరిపించారు.
అవబృథం :
వసంతోత్సవం ముగిసిన వెంటనే చండీశ్వరస్వామివారిని ఆలయ ప్రాకార ప్రదక్షిణతో మల్లికాగుండం వద్దకు వద్దకు పల్లకీలో తోడ్కొనివచ్చారు.తరువాత చండీశ్వరస్వామికి అవభృథం జరిపించారు.
ఈ అవభృథంలో చండీశ్వరస్వామివారికి శుద్ధజలం, పంచామృతాలు, భస్మోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, సుగంధోదకం, బిల్వోదకం, పుష్పోదకం,నారికేళోదకం మొదలైన వాటితో స్నపన కార్యక్రమం నిర్వహించారు.
త్రిశూలస్నానం :
తరువాత మల్లికాగుండంలో త్రిశూలస్నాన కార్యక్రమం జరిపించారు.
త్రిశూలస్నానం జరిగే సమయములో మల్లికాగుండ జలాన్ని తలపై ప్రోక్షించుకోవడం వలన పాపాలన్ని నశించి శ్రేయస్సు కలుగుతుందని చెబుతారు.
ఈ కార్యక్రమాలలో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, అర్చక స్వాములు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకస్వాములు, వేద పండితులు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
