
శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారు సోమవారం సాయంత్రం శ్రీ స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు.
తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యనిర్వహణాధికారి ఎ.వి.ధర్మారెడ్డి ఈ పట్టువస్త్రాలను సమర్పించారు.
వస్త్ర సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, అర్చకస్వాములు, వేదపండితులు సంప్రదాయాన్ని అనుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి స్వాగతం పలికారు.
అనంతరం ఆలయ రాజగోపురం వద్ద వస్త్ర సంకల్పం పఠించారు. ఆ తరువాత పట్టు వస్త్రాలకు పూజాదికాలు నిర్వహించారు.పూజాదికాల తరువాత టి.టి.డి కార్యనిర్వహణాధికారి, వైదిక సిబ్బంది తదితరులు, మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి వస్త్ర సమర్పణ చేసారు.
ఈ సందర్భంగా టిటిడి కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి మాట్లాడుతూ జ్యోతిర్లింగస్వరూపుడైన మల్లికార్జున స్వామివారు, మహాశక్తిస్వరూపిణి అయిన భ్రమరాంబాదేవివారికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమయములో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆనవాయితీగా పట్టువస్త్రాలను సమర్పిస్తున్నారన్నారు. శ్రీశైలక్షేత్ర అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం తగిన సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి , కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున శ్రీశైలక్షేత్రంలో అతిథిగృహాన్ని ( సత్రాన్ని) నిర్మించాలని కోరారని , ఈ ప్రతిపాదనను రాబోవు తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రవేశపెడతామని చెప్పారు.