తిరుపతి, 2021 సెప్టెంబరు 13: సనాతన ధర్మాన్ని మరింత విస్తృతంగా వ్యాప్తి చేసేందుకు ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకార గ్రామాల్లో ఆలయాల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం శ్రీవాణి ట్రస్టుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్టు ద్వారా రెండో విడతలో ఏయే ప్రాంతాల్లో, ఎన్ని ఆలయాలు / భజన మందిరాలు నిర్మించాలనే విషయమై ఇంజినీరింగ్, హిందూ ధర్మప్రచార పరిషత్ అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. గుడికో గోమాత – ఊరికో గుడి అనే నినాదంతో ముందుకెళుతున్నట్టు చెప్పారు. ఆలయాల నిర్మాణ వ్యయాన్ని నాలుగు విడతలుగా విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆలయాల నిర్మాణానికి అవసరమైన మార్గదర్శకాలు రూపొందించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని కలెక్టర్లు, దేవాదాయ శాఖ అధికారులతో రాష్ట్రస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయాల నిర్మాణం చేపట్టాల్సిన గ్రామాల జాబితాను కలెక్టర్ల నుంచి స్వీకరించాలని సూచించారు. ధర్మప్రచారంలో భాగంగా ఇదివరకే రాతివిగ్రహాలు, పంచలోహ విగ్రహాలు, మైక్‌సెట్లను పలు ఆలయాలకు అందిస్తున్న విషయం విదితమే.
ఈ సమావేశంలో టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎఫ్ఏసిఏవో ఓ.బాలాజి, హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రోగ్రామింగ్ అధికారి విజయసారథి తదితరులు పాల్గొన్నారు.