తెలంగాణా భాషాసాహిత్యాలకు చిరునామ రవ్వా శ్రీహరి

హైదరాబాద్: సామాన్య చేనేత కుటుంబం నుంచి వచ్చి తెలుగు సాహిత్యంలో మహోన్నత శిఖరంగా ఎదిగిన మహా మహోపాధ్యాయుడు రవ్వా శ్రీహరికి తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రగాఢ సంతాపం తెలియజేస్తోందని  సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ తెలిపారు. ఎల్బీనగర్, బైరమల్ గూడా లోని గ్లోబల్ ఆసుపత్రిలో రవ్వా శ్రీహరి మృతదేహానికి ఆయన నివాళులర్పించారు. మలక్ పేట లోని రవ్వాశ్రీహరి నివాసంలో ఆయన సతీమణి విజయలక్ష్మీని, కుటుంబసభ్యులను జూలూరు గౌరీశంకర్ కలిసి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

తెలుగు, సంస్కృత భాషల్లో ఇంతగా పాండిత్యాన్ని సంపాదించినవారు, విరివిగా రచనలు చేసినవారు, తెలుగు సంస్కృత భాషలకు ఇంత సేవ చేసిన వ్యక్తి సమకాలంలో మరొకరు లేరని జూలూరు గౌరీశంకర్ తెలిపారు. అందుకే ఆయన్ను మహామహోపాధ్యాయ పేరుమీద తిరుపతిలోని సంస్కృత కళాశాల బిరుదునిచ్చి సత్కరించిందన్నారు. సంస్కృతంలో ఉన్న కావ్యాలను తెలుగులోకి తేవడం సహజమే కాని, తెలుగులో ఉన్న ఉత్తమ కావ్యాలను సంస్కృతంలోకి తేవడం రవ్వాశ్రీహరి మహా ప్రతిభకు తార్కాణమని పేర్కొన్నారు. బహుజన వర్గాల నుంచి వచ్చిన ఈ కాలం వాల్మీకి రవ్వా శ్రీహరి ఆని ఆయన అభివర్ణించారు. రవ్వా శ్రీహరి ఉత్తమమైన వ్యక్తిత్వంతో పాటు నిరాడంబరమైన జీవితాన్ని కొనసాగించారని తెలిపారు. తెలంగాణా ప్రాంతంలో పోతన, కాళోజీ నారాయణరావుల తర్వాత మళ్ళీ అంత గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తి రవ్వా శ్రీహరియేనని తెలిపారు.హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్య‌క్షులుగా, ద్రావిడ యూనివ‌ర్సిటీ మాజీ వీసీగా  సుప్రసిద్ధ సాహిత్యవేత్త ఆచార్య ర‌వ్వా శ్రీహ‌రి నలభై సంవత్సరాల పాటు బోధనారంగంలో అనితరసాధ్యమైన సేవలందించారని అన్నారు.

నల్లగొండ జిల్లా వెల్వర్తి గ్రామంలోని నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రవ్వా శ్రీహరి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సంస్కృత పాఠశాలలో చదువుకొని తెలుగు సాహిత్యంలో  ప్రొఫెసర్ గా , ద్రవిడ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ గా పనిచేసి ఆ ఉద్యోగానికి వన్నె తెచ్చిన వ్యక్తి అని  జూలూరు గౌరీ శంకర్ అన్నారు. తెలంగాణ భాష అంటే తక్కువగా చూస్తున్న సమయంలో ఆ భాష ప్రాధాన్యతను ప్రకటిస్తూ, ఆయా ప్రాంతాలకు సంబంధించిన మాండలిక పదాలను వెలికి తీసి మాండలిక పదకోశాలను తయారు చేశారని చెప్పారు. అదేవిధంగా ఎంతోమంది విస్మృత కవుల పద్య సాహిత్యాన్ని సేకరించి అలబ్ద సాహిత్య పద్యముక్తావళి పేరుతో గ్రంథాలను వెలువరించి సాహిత్యానికి ఎనలేని సేవచేశారని తెలియజేశారు. ఒక సంస్థ చేయవలసిన పనిని తానొక్కడే చేసి శ్రీహరి నిఘంటువు అనే నిఘంటువును వెలువరించారని కొనియాడారు. అదేవిధంగా ఇంతవరకు ఎవ్వరు కూడా తెలుగులో అనువదించని అష్టాధ్యాయిని రెండు సంపుటాలుగా ఎనిమిది అధ్యాయాల్లో తెనుగీకరించారని, తెలుగు సాహిత్యంలో నిరంతరం పరిశోధన చేసి తెలుగు సాహిత్యానికి తెలంగాణ సాహిత్యానికి ఒక చిరునామాగా మారిన వ్యక్తి ఆచార్య రవ్వా శ్రీహరి అని తెలిపారు.తెలుగులోనే కాకుండా సంస్కృతంలో కూడా దాదాపుగా 20 గ్రంథాలను వెలువరించిన వ్యక్తి ఆచార్య రవ్వా శ్రీహరి అని చెబుతూ, తన చివరి శ్వాస వరకు సాహిత్య పరిశోధనపై కృషి చేస్తూ అనారోగ్యాన్ని వయోభారాన్ని కూడా లెక్కచేయకుండా ఎన్నో గ్రంథాలను వెలువరించిన సాహితీ మూర్తి అని అన్నారు.

అంచలంచలుగా ఎదిగి తెలుగు సాహిత్యానికే మహా సంపదగా ఆయన మారారని  సంతాప సందేశంలో తెలిపారు. తెలంగాణ భాషలో ఉన్న గొప్పతనాన్ని తెలియజేస్తూ నల్లగొండ పదకోశాన్ని తయారు చేశారని, ఆయన మరణం తెలుగు సాహిత్యానికి పూడ్చలేని లోటు అని జూలూరు గౌరీశంకర్ అన్నారు.

print

Post Comment

You May Have Missed