
శ్రీశైల దేవస్థానం: కార్తీకమాస చివరి సోమవారం నాడు అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రాన్ని సందర్శించనున్నందున
ట్రాఫిక్ క్రమబద్దీకరణ , భక్తుల సౌకర్యాల విషయాలపై కార్యనిర్వహణాధికారి లవన్న ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ పోలీస్ శాఖ సహకారంతో ట్రాఫిక్ క్రమబద్దీకరణ పై ప్రత్యేక చర్యలు చేపట్టాలని దేవస్థాన ముఖ్యభద్రతా అధికారిని ఆదేశించారు. దేవస్థాన ధర్మకర్తల మండలి ఆమోదం మేరకు క్షేత్ర పరిధిలో పలుచోట్ల అంతర్గత గేట్లు ఏర్పాటు చేసారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలలో భాగంగా ఈ గేట్లను ఏర్పా టు చేసారు. ముఖ్య కూడళ్ళ వద్ద , వలయరహదారిపై మొత్తం 28 చోట్ల ఈ గేట్లను ఏర్పాటు చేసారు.అన్ని గేట్ల వద్ద కూడా దేవస్థాన భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కూడా దేవస్థాన ముఖ్యభద్రతా అధికారిని ఆదేశించారు.
వివిధ సత్రాలకు, ఆశ్రమాలు మొదలైనవాటికి వెళ్ళే భక్తులు వలయ రహదారిమీదుగా వెళ్ళే విధంగా సంబంధిత సిబ్బంది దిశానిర్దేశం చేస్తుండాలని ఈ ఓ అన్నారు.వలయ రహదారి మీదుగా వాహనాలు సులభంగా వెళ్ళేందుకు వీలుగా ఇప్పటికే జెసి కాటేజీ వద్ద ఏర్పాటు చేసిన అంతర్గత గేటును కూడా తెరిచారు.రహదారులపై వాహనాలు నిలిచిపోకుండా ( ట్రాఫిక్ జాం కాకుండా వుండేందుకుగాను పార్కింగుకు నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే వాహనాలను నిలుపుదల చేసేందుకు దేవస్థానం ప్రసారవ్యవస్థ ద్వారా నిరంతరం సూచిస్తుండాలన్నారు. దీనివలన వాహనదారులకు తగు అవగాహన ఏర్పడుతుందన్నారు.
గణేశసదనం ఎదురుగా గల పార్కింగ్ ప్రదేశం, యజ్ఞవాటిక, ఆర్టిసి బస్టాండు వెనుకభాగం, గౌరీసదన్ ఎదురుగా గల ప్రదేశం (గిరిజన పాఠశాల ఎడమవైపు ప్రదేశం), గౌరీసదనం ఎడమవైపుగల ప్రదేశం, దేవస్థానం వైద్యశాల ఎడమవైపు ప్రదేశం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎడమవైపు ప్రదేశం, దేవస్థానం ఆగమపాఠశాల ఎదురుగాగల ఆరుబయలు ప్రదేశం, ఘంటామఠం వెనుక భాగం గల ఆరుబయలు ప్రదేశం మొదలైనచోట్ల వాహనాలను నిలుపుకునే అవకాశం ఉంది.
అదేవిధంగా వాహనాల పార్కింగు మరియు ఆయా ప్రదేశాలకు దారులను తెలుపుతూ ముఖ్య కూడళ్లు , వలయరహదారులపై సూచికబోర్డులు ఏర్పాటు చేసారు. క్యూలైన్లలో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు ఈ ఓ.ముఖ్యంగా క్యూకాంప్లెక్స్ లో నిరంతరం మంచినీరు, అల్పాహారం, బిస్కెట్లు మొదలైనవాటిని సరఫరా చేస్తుండాలన్నారు. ఉదయం వేళలో వేడిపాలను కూడా భక్తులకు అందజేయాలన్నారు.భక్తులరద్దీకి అనుగుణంగా తగినన్ని లడ్డుప్రసాదాలను సిద్ధంగా ఉంచుకోవాలని లడ్డుతయారీ , లడ్డుప్రసాద విక్రయ విభాగాలను ఆదేశించారు.ఉదయం 10.30గంటల నుంచే భక్తులకు అన్నప్రసాద వితరణను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి.రామకృష్ణ, సహాయ కమిషనర్ హెచ్.జి. వెంకటేష్, అన్నప్రసాద వితరణ సహాయ కార్యనిర్వహణాధికారి డి. మల్లయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు నరసింహారెడ్డి, ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ , ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, పర్యవేక్షకులు దేవిక, ముఖ్యభద్రతా అధికారి నరసింహారెడ్డి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు భవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.