శ్రీశైల దేవస్థానం:
శ్రీశైల దేవస్థానం సహాయ సంపాదకులు కె. వి. సత్యబ్రహ్మాచార్య రచించిన శైవకాల వివేకం అనే శైవ సంప్రదాయ గ్రంథావిష్కరణ కార్యక్రమం గురువారం ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో నిర్వహించారు.
ఉగాది పంచాంగ శ్రవణం, పండిత సత్కారం కార్యక్రమం తరువాత ఈ గ్రంథావిష్కరణ జరిపించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తొలి ప్రతిని స్వీకరించి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి డా. వీరభద్ర దైవజ్ఞ సిద్ధాంతికి అందించారు.
16వ శతాబ్దానికి చెందిన నిగమజ్ఞాన శివాచార్యులు శైవాగమ గ్రంథాలను పరిశోధించి శివాలయాలో శైవ సంబంధమైన సమస్త పూజలు, ఉత్సవాలు, ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం మొదలైన కార్యక్రమాలకు ముహూర్త నిర్ణయం చేసే ప్రామాణిక గ్రంథాన్ని శైవకాల వివేకం పేరిట సంస్కృతంలో రచించారు. ఈ సంస్కృత గ్రంథాన్ని ప్రస్తుతం కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య తెలుగులోకి అనువదించారు.
ఈ సందర్భంగా దేవస్థానం సిద్ధాంతి గ్రంథ పరిచయం చేస్తూ ఈ గ్రంథం ప్రతి శివాలయంలో ఉండదగినదని, ఆగమీకులకు, సిద్ధాంతులకు ఈ గ్రంథం ఎంతో ఉపయోక్తంగా ఉంటుందన్నారు.
ఆవిష్కరణ సందర్భంగా గ్రంథ రచయితను సత్కరించారు. బ్రహ్మాచార్య వారి కలం నుంచి ఇటువంటి మరెన్నో గ్రంథాలు వెలువడాలని ఈ సందర్భంగా దేవస్థానం అర్చకస్వాములు ఆకాంక్షించారు. కార్యక్రమములో పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
