×

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

 తిరుపతి, 28 నవంబరు 2022: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన అమ్మవారి కార్తీక  బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.రాత్రి 9.30 గంటలకు  ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గజ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు.
బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం . విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం .
ఈ కార్యక్రమంలో జేఈవో  వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో లోకనాథం, ఏఈఓ  ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు  బాబు స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ దాము పాల్గొన్నారు.

వైభ‌వంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

– క‌నుల‌విందుగా సిరుల తల్లికి స్న‌ప‌న‌తిరుమంజ‌నం

– పద్మ పుష్కరిణి స్నానంతో తన్మయుత్వం చెందిన భక్తులు

శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోవారం పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో స్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు.

ఉదయం 6.30 గంటల నుండి 7.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకిలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీ తీర్థ మండపానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. అర్చకులు పంచమి తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

అమ్మవారికి శ్రీవారి కానుక

శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం సందర్బంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారు కానుకలు పంపారు . రూ. 25 లక్షలు విలువ చేసే 500 గ్రాములు బ‌రువు గల రెండు బంగారు పతకాలు, ఒక హారం, సారెతో పాటు తిరుప‌తి పుర‌వీధుల‌లో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.

శోభాయ‌మానంగా సిరుల తల్లి స్న‌ప‌న‌తిరుమంజ‌నం

పంచమి తీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు, కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి.

కుంకుమపువ్వు, అత్తిపండు, బాదం, జీడిపప్పు, నెల్లి కాయలు, రోజా, తులసి మాల‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

త‌మిళ‌నాడులోని తిరుపూర్‌కు చెందిన శ్రీ ష‌ణ్ముగ సుంద‌రం, శ్రీ బాలసుబ్రమన్యన్ ఈ మాల‌ల త‌యారీకి విరాళం అందించారు.

ఆకట్టుకున్న ఫలపుష్పం మండపం

పంచమి తీర్థం సందర్భంగా పంచమి మండపం వద్ద ఏర్పాటుచేసిన ఫలపుష్ప మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది ఇందులో ఆపిల్, ఆస్ట్రేలియా ఆరంజ్, తామర పూలు, రోజాలు, లిల్లీలు , కట్ ఫ్లవర్స్, సాంప్రదాయ పుష్పాలతో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.

ఉదయం 11.40 నుండి 11.50 గంటల మధ్య పంచమి తీర్థం(చక్రస్నానం) ఘట్టం ఘనంగా జరిగింది.

చక్రత్తాళ్వార్‌తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

కాగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఊరేగించనున్నారు. అనంతరం రాత్రి 9.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి దంపతులు,
చంద్రగిరి ఎంఎల్‌ఏ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, శ్రీ రామేశ్వరరావు, శ్రీ రాములు, శ్రీ మారుతి ప్రసాద్, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ శ్రీ కనుమూరి బాపిరాజు దంపతులు, జేఈవో లు శ్రీమతి సదా భార్గవి , శ్రీ వీరబ్రహ్మం దంపతులు, సివిఎస్‌వో శ్రీ నరసింహ కిషోర్, సి ఈ శ్రీ నాగేశ్వరరావు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

నవంబరు 29న పుష్పయాగం

నవంబరు 29వ తేదీ మంగళవారం సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరుగనుంది.

శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ పద్మావతి అమ్మవారికి సారె

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె స‌మ‌ర్పించారు.

ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు.

ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో ఊరేగింపు చేప‌ట్టారు. అనంత‌రం శ్రీవారి వక్ష:స్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వ‌హించారు. ఆ త‌రువాత ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది. ఈ సారెను గజాలపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ్లారు. అక్క‌డినుండి కోమ‌ల‌మ్మ స‌త్రం, శ్రీ కోదండరామాలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, లక్ష్మీపురం సర్కిల్, శిల్పారామం నుండి తిరుచానూరు పసుపు మండపం మీదుగా ఆలయం వ‌ద్ద అమ్మ‌వారికి సారె స‌మ‌ర్పించారు.

ఆభ‌ర‌ణంతో కూడిన శ్రీ‌వారి సారెను అలిపిరి వ‌ద్ద ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి జెఈవో  వీరబ్రహ్మంకు అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు  పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed