
శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం రోజు శ్రీస్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.యాగశాల లో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేసారు.అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపారు.
సాయంకాలం ప్రదోషకాల పూజలు, జపానుష్టానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిపారు.
రథోత్సవం:
సాయంకాలం స్వామిఅమ్మవార్ల రథోత్సవం ఘనంగా జరిగింది. రథోత్సవంలో సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా రథాంగపూజ, రథాంగహోమం, రథాంగబలి కార్యక్రమాలు జరిగాయి. రథాంగబలిలో వసంతంతో నింపిన గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, కుంభం (అన్నంరాశి) సాత్వికబలిగా సమర్పించారు. తరువాత శ్రీ స్వామి అమ్మవార్లను రథంపైకి వేంచేబు చేయించి రథోత్సవం జరిపారు.
రథోత్సవ దర్శనం వలన సర్వపాపాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. రథోత్సవాన్ని పురస్కరించుకొని బంతి,చామంతి, గులాబీలు, కాగడాలు, కనకాంబరాలు, చాందిని, గ్లాడియోలస్, కార్నియా, ఆస్టర్స్, మొదలైన 11 రకాల పుష్పాలతో రథాన్ని అలంకరించారు.
తెప్పోత్సవం:
రాత్రి 8.00గం.లకు శ్రీస్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం జరిపారు. ఆలయ పుష్కరిణి వద్ద ఈ తెప్పోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసారు.
తెప్పోత్సవ కార్యక్రమంలో ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచారపూజలు చేసారు. తరువాత ఉత్సవమూర్తులను ఆలయ రాజగోపురం నుండి పుష్పాలంకృత పల్లకీలో ఊరేగింపుగా తోడ్కొని వచ్చి పుష్కరిణిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తెప్పపై వేంచేబు చేయించి విశేష పూజాదికాలను చేసారు.
తరువాత మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రాలతో ఎంతో శాస్త్రోక్తంగా తెప్పోత్సవం జరిగింది.
వివిధ రకాల పుష్పాలతో చేసిన ప్రత్యేక అలంకరణతో, విద్యుత్ దీపాలంకరణతో తెప్ప ఎంతో కళాత్మకంగా వుంది. తెప్ప అలంకరణకు గాను ఎరుపుబంతి, పసుపు బంతి, తెల్లచేమంతి, ఆస్టర్,
జబ్రా, గ్లాడియోలస్, ఆర్కిడ్స్, మొదలైన పుష్పాలను వినియోగించారు.
తెప్పోత్సవాన్ని దర్శించుకోవడం వలన శ్రేయస్సు కలుగుతుంది. శత్రుబాధలు తొలగిపోతాయి. కోర్కెలు నెరవేరుతాయి. ముఖ్యంగా సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయి.వివిధ కార్యక్రమాల్లో ఈ ఓ ఎస్.లవన్న ఇతర అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.