

శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు తొమ్మిదవ రోజు సోమవారం శ్రీస్వామిఅమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి.
తరువాత యాగశాల లో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు జరిగాయి.అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపారు.
ఈ సాయంకాలం ప్రదోషకాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిపారు.
భవ్యంగా రథోత్సవం;
ఈ రోజు సాయంకాలం స్వామిఅమ్మవార్ల రథోత్సవం ఘనంగా జరిగింది.
తెప్పోత్సవం:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ రోజు రాత్రి 8.00గం.లకు శ్రీస్వామిఅమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించారు.
ఆలయ పుష్కరిణి వద్ద ఈ తెప్పోత్సవ కార్యక్రమం జరిగింది.
ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచారపూజలు నిర్వహించారు. తరువాత ఉత్సవమూర్తులను ఆలయ రాజగోపురం నుండి పుష్పాలంకృత పల్లకీలో ఊరేగింపుగా తోడ్కోని వచ్చి పుష్కరిణిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తెప్పపై వేంచేబు చేయించి విశేష పూజాదికాలను నిర్వహించారు.
తరువాత మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రాలతో ఎంతోశాస్త్రోక్తంగా ఈ తెప్పోత్సవం నిర్వహించారు.
కాగా వివిధ రకాల పుష్పాలతో చేసిన ప్రత్యేక అలంకరణతో, విద్యుత్దీపాలంకరణతో ఈ తెప్ప ఎంతో కళాత్మకంగా రూపొందించారు.
తెప్ప అలంకరణకుగాను ఎరుపుబంతి, పసుపు బంతి, తెల్లచేమంతి, గులాబీలు, కనకాంబరం, ఆస్టర్, జబ్రా, గ్లాడియోలస్, ఆర్కిడ్స్, మొదలైన పుష్పాలను వినియోగించారు.
తెప్పోత్సవాన్ని దర్శించుకోవడం వలన శ్రేయస్సు కలుగుతుంది. శత్రుబాధలు తొలగిపోతాయి. కోర్కెలు నెరవేరుతాయి. ముఖ్యంగా సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయి.
