×

కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు శిరసువంచి నమస్కరిస్తున్నా

కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు శిరసువంచి నమస్కరిస్తున్నా

అమరావతి :- సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ- జనసేన-బీజేపీ కూటమికి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు శిరసువంచి నమస్కరిస్తున్నానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు అన్నారు. ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలవాలి అనే మా పిలుపునకు  ప్రజలు అనూహ్య మద్దతిచ్చారన్నారు. కూటమి నేతలు, కార్యకర్తల సమిష్టి కృషి వల్లే ఈ విజయం దక్కిందని ఆయన అన్నారు. ప్రజలు ఇచ్చింది అధికారం మాత్రమే కాదని…ఇది ఒక ఉన్నతమైన బాధ్యత అని స్పష్టం చేశారు. ఫలితాలు వెలువడిన అనంతరం మొదటి సారి ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. నేను ఇప్పటికి 10 ఎన్నికలు చూశాను…ఎన్నో సమీక్షలు నిర్వహించి ఎన్నికలకు వెళ్లాం.
పొట్టకూటి కోసం పక్కరాష్ట్రాలకు వెళ్లిన వారూ వచ్చి ఓట్లేశారు
ఇంతటి చారిత్రాత్మక ఎన్నికలు నా జీవీతంలో చూడలేదు..ఈ ఎన్నికల్లో ఎక్కడో విదేశాల్లో ఉండే వ్యక్తులు లక్షలు ఖర్చు పెట్టుకని వచ్చి మరీ ఓటు వేశారు. పక్క రాష్ట్రాలకు పొట్టకూటి కోసం వెళ్లిన వారు కూడా సొంత డబ్బులు పెట్టుకుని వచ్చి ఓట్లు వేశారు. ప్రజల నిబద్ధతను ఎలా అభినందించాలో, ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల కంటే టీడీపీ, ఏపీ చరిత్రలో ఈ విజయం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. టీడీపీ స్థాపించినప్పుడు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో 200 సీట్లు వచ్చాయి. 1994లో ప్రతిపక్షానికి కొన్ని చోట్ల డిపాజిట్ రాలేదు. వాటన్నింటినీ కూడా ఇప్పుడు అధికమించి నేడు ఈ విజయం చేకూరడానికి కారణం ప్రజలు అనుభవించిన బాధలు. ఐదేళ్లు ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారు. బతకడంపై ఆశలు కోల్పోయారు. ఈ ఎన్నికల్లో కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయి. ఇందులో టీడీపీకి 45.60 శాతం, వైసీపీకి 39.37 శాతం ఓట్లు వచ్చాయి.

పాలకులం కాదు..సేవకులం అనే నినాదానికి శ్రీకారం చుడతాం:
ప్రజలు మాకు ఇచ్చింది అధికారం అని అనుకోవడం లేదు…బాధ్యతగా తీసుకుంటున్నాం. పాలకులం కాదు..సేవకులం అనే నినాదానికి శ్రీకారం చుడుతున్నాం. సూపర్-6, ప్రజాగళం మేనిఫెస్టో ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి కూటమికి బీజం వేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బీజేపీ కూడా కూటమిలో భాగమైంది…మూడు పార్టీలు ఎక్కువ తక్కువ కాకుండా భేషజాలు లేకుండా పని చేశాయి. కేంద్ర నాయకత్వంతో కలిసి గట్టిగా పని చేశాం.
ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు నేను ఎప్పుడూ కుంగిపోలేదు…గెలిచినప్పుడు ఎగిరిపడలేదు. ఓడిపోయినప్పుడు బాధ్యతగా ప్రతిపక్ష పాత్ర పోషించాం. గెలిపిచిప్పుడు ప్రజలకు మెరుగైన సేవలు అందించాము. మేము ఎప్పుడూ ప్రజల పక్షానే ఉన్నాం. నా మాటను, గౌరవాన్ని నిలబెట్టిన ప్రజల రుణం తీర్చుకుని ప్రజల ఆశల మేరకు పని చేస్తాం. నేడు ఓట్లు వేసిన ప్రజలు….రేపు కూడా సహకరించాలని కోరుతున్నా. ప్రజల సహకారం, భాగస్వామ్యంతో పాలన సాగిస్తాం.

కూటమి విజయంపై భాగస్వామ్య పక్షాలకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రధాని మోదీ, కేంద్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నా. మూడు పార్టీలు తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి కార్యకర్త, నాయకుడు బ్రహ్మాండంగా పని చేశారు.  మేము ఎన్డీయేతోనే ఉన్నాం, ఉంటాం.’ అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
*

print

Post Comment

You May Have Missed