తిరుమల, 2023 సెప్టెంబరు 23: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శనివారం ఉదయం హనుమంత వాహనసేవలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. ఆంధ్ర, తమిళనాడు, కేరళ ప్రాంతాలకు చెందిన 10 కళాబృందాలలో 275 మంది కళాకారులు ప్రదర్శనలిచ్చారు.
కేరళ రాష్ట్రం పాలక్కాడ్‌కు చెందిన చెన్నమేళం (కేరళ డ్రమ్స్) బృందంలో 25 మంది కళాకారులు ఉన్నారు. వీరు డ్రమ్స్, తాళాలు లయబద్ధంగా వాయిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేశారు. అదేవిధంగా 25 మంది మహిళలు కేరళ సాంప్రదాయ వస్త్రధారణ తో తిరువాతరకలై నృత్యం చేస్తూ భక్తులను విశేషంగా ఆకర్షించారు.
తమిళనాడు రాష్ట్రం చెన్నైకి చెందిన శ్రీ భరత కళా అకాడమికి 30 మంది యువతులు శ్రీ కృష్ణవైభవం నృత్యం ప్రదర్శించారు. రాజమండ్రికి చెందిన శ్రీ లక్ష్మీ గణేశ భజన మండలికి చెందిన 25 మంది యువతుల జానపద నృత్యం, తిరుమల శేష భజన మండలికి చెందిన 25 మంది కళాకారులు నవ దుర్గల వేషధారణలో దేవిస్త్రోత్రానికి అనుగుణంగా నృత్యం ప్రదర్శించారు. అనంతపురంకు చెందిన 15 మంది అన్నమయ్య కీర్తనలకు భరతనాట్యం ప్రదర్శించారు.