
కర్నూలు/శ్రీశైలం, ఫిబ్రవరి 16 : -శ్రీశైల క్షేత్రంలో ఈ నెల 22 నుండి మార్చి 4 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకొని, ఆ మేరకు సంబంధిత అధికారులు మనస్ఫూర్తిగా, భక్తిభావంతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ఆదేశించారు.బుధవారం బ్రహ్మోత్సవాలు -2022 నిర్వహణ, ఏర్పాట్ల పై శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి కార్యాలయ కమాండ్ కంట్రోల్ రూంలో రెండవ కోఆర్డినేషన్ సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీశైలం వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన, ప్రశాంత వాతావరణంలో దైవదర్శనం చేసుకునేలా, ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా భక్తులకు అనుభూతి మిగిలేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలలో సాధారణ భక్తులు, శివమాల భక్తులకు, కాలి నడకన వచ్చే భక్తులకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా సాఫీగా, త్వరగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనం కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత రెండు సంవత్సరాల కాలం నుంచి కోవిడ్ కారణంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరు కాలేదని, ఈ ఏడాది భక్తులు, శివదీక్ష భక్తులు లక్షల సంఖ్యలో హాజరవుతున్న నేపథ్యంలో ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నియమ నిబంధనలు తప్పక పాటిస్తూ స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రధానంగా భక్తుల క్యూ లైన్లు, లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం, త్రాగునీరు , పారిశుద్ధ్య నిర్వహణ, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణ, పాతాళ గంగ వద్ద భక్తులకు జల్లు స్నానాలు, పోలీసు భద్రత, గజ ఈతగాళ్ల ఏర్పాటు, హోటల్స్ లో అధిక ధరలు లేకుండా చూడడం, వసతి కల్పన, మెడికల్ క్యాంపులు, తగినన్ని ఆర్టీసీ బస్సుల ఏర్పాటుపై లాంటి ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.
మార్చి ఒకటో తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహన్యాస రుద్రాభిషేకం, లింగోద్భవం, రాత్రి పాగాలంకరణ, కళ్యాణోత్సవం, రథోత్సవం, తెప్పోత్సవం తదితర వాహన సేవలన్నీ ఆలయ సంప్రదాయం ప్రకారం ఘనంగా నిర్వహించాలని దేవస్థానం ఈఓను ఆదేశించారు. ఉత్సవాలలో ఎవరెవరు ఎక్కడ ఎక్కడ, ఏ సెక్టార్ లో ఏం పనులు చేయాల్సింది, సంబంధిత పనులన్నింటినీ నివేదిక రూపొందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దేవాలయ పరిసర ప్రాంతంలో పారిశుద్ధ్యo పై ప్రత్యేక దృష్టి సారించాలని డిపిఓ, దేవస్థానం ఈవోను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కాలినడకన వచ్చే భక్తులకు వైద్య సేవలకు సంబంధించి ప్రతి పది కిలోమీటర్ల పరిధిలో మెడికల్ క్యాంపులు ఏర్పాటుతో పాటు వైద్యపరంగా కావలసిన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని డీఎంహెచ్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భక్తులు ఇబ్బంది పడకుండా విడిది కేంద్రాలలో చలవ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, మంచినీటి వసతి కల్పించాలన్నారు. అడవిలో కాలినడకన వచ్చే భక్తులకు ఏదైనా సమస్య వస్తే వెంటనే సమాచారం ఇచ్చేందుకు తగినన్ని వైర్లెస్ సెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని పోలీస్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అన్నదానం చేసే భక్తుల వివరాలను సేకరించి, ఎవరెవరు ఏ రోజుల్లో ఎంతమందికి అన్నదాన వితరణ చేయనున్నారో సంబంధిత వివరాలను సేకరించాలని దేవస్థానం ఈఓను జిల్లా కలెక్టర్ సూచించారు. అన్నదాన ప్రాంతాలు, మరుగుదొడ్లులో సమృద్ధిగా నీరు ఉండటంతోపాటు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేటాయించిన ప్రదేశాలలోనే వాహనాల పార్కింగ్ చేసుకునేలా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. దాదాపు ఎనిమిది వేల వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు స్థలం కేటాయించామని, ఆ పనులను వేగవంతంగా చేయాలన్నారు. దేవాలయం గర్భగుడిలో విద్యుత్ అసౌకర్యం కలగకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని దేవస్థానం ఈవో ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దేవాలయ పరిసర ప్రాంతాల్లో దాదాపు 315 సీసీ కెమెరాలు బాగా పనిచేసేలా చూడాలన్నారు.
హోటల్లు, ప్రత్యేక తినుబండారాల కేంద్రాలలో, పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్న షాపులలో ఎంఆర్పి రేట్ ల ధరల పట్టికను ప్రదర్శించేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 22 నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు సున్నిపెంట, శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో అక్రమ మద్యం విక్రయాలను నిషేధించాలని పోలీస్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.కాలినడకన వచ్చే భక్తులు ఆటవీప్రాంతంలో ఎక్కడపడితే అక్కడ చెత్తా చెదారం వేయకుండా డస్ట్ బిన్ లో మాత్రమే వేయడంతోపాటు, అడవులను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎవరైనా పిల్లలు లేదా వృద్దులు తప్పిపోవడం జరగవచ్చని,ఇందుకోసం ఎక్కువ జనసంద్రం ఉన్న ఏరియాలో టెంట్లు ఏర్పాటు చేసి మైక్ అనౌన్స్మెంట్ చేయాలని దేవస్థానం ఈవో ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కేటాయించిన విధులలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. శ్రీశైలం అన్నదానం క్యాంటీన్లో ఆహార పదార్థాల తయారీకి సంబంధించి వెల్ఫేర్ హాస్టల్ వార్డర్లు పర్యవేక్షణ చేసేలా చూస్తూ భక్తులకు మంచి భోజనం అందేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ఫుడ్ ప్రిపరేషన్, లడ్డు తయారీకి సంబంధించి ఫుడ్ ఇన్స్పెక్టర్ చెక్ చేసేలా చూడటంతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్లు బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు డ్యూటీ కేటాయించాలని జాయింట్ కలెక్టర్ ను ఆదేశించారు. మరుగుదొడ్లలో దుర్వాసన రాకుండా ఉండేలా ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయాలని, పారిశుద్ధ్య మీద ప్రత్యేక దృష్టి సారించాలని డిపివోను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు తాత్కాలిక 30 పడకల ఆసుపత్రిని సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. 108 అంబులెన్సులు, 104 సంచార వైద్య వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇంకా ఐదు రోజులు మాత్రమే సమయం ఉందని, కేటాయించిన విధులను తూచా తప్పకుండా పాటించి పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…. శ్రీశైల మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశాలున్నాయని, గతంలో మాదిరి కంటే అధిక మందిని పోలీస్ లను విధులకు కేటాయించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ మల్లికార్జున బ్రమరంభ అమ్మవార్లను దర్శనం చేసుకునేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న మాట్లాడుతూమహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఎలాంటి లోపాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని పిపిటి ద్వారా జిల్లా కలెక్టర్ కు వివరించారు. భక్తులకు మంచినీటి ఇబ్బంది తలెత్తకుండా 17 చోట్ల ఆర్ ఓ ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసి భక్తులకు శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కు వివరించారు.
సమీక్షలో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతుభరోసా) రామసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, అడిషనల్ కమీషనర్ చంద్రశేఖర్ ఆజాద్,కర్నూలు, ప్రకాశం, మహబూబ్ నగర్, అచ్చంపేట, నాగర్ కర్నూల్ జిల్లాల అధికారులు, దేవస్థాన డిప్యూటీ ఈవోలు, ఏఈఓలు, పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.