శ్రీశైల దేవస్థానం:రథసప్తమి (మాఘ శుద్ధ సప్తమి) పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో సూర్యారాధన జరిపారు.
ఈ కార్యక్రమానికి ముందుగా, దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు జరగకుండా ఉండాలనీ, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగ
కుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు లోక కల్యాణ సంకల్పాన్ని చెప్పారు.
తరువాత కలశస్థాపనచేసి ,కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ వైదికాచార్యులు ఆయా బీజమంత్రాలతోనూ, ప్రత్యేక ముద్రలతోనూ
జరిపారు. అనంతరం సూర్యనమస్కారాలు చేసారు.
ఈ కార్యక్రమంలో భాగంగానే సూర్యయంత్ర పూజ, వేదపారాయణలు,అరుణపారాయణ జరిపారు . అనంతరం సూర్యభగవానుడికి ఉత్తర పూజ (షోడశోపచారపూజ), నివేదన, మంత్రపుష్పము జరిపారు.
కాగా మన పురాణాలలో ఈ సూర్యారాధన ఎంతో విశేషంగా వుంది. సూర్యారాధన వల్ల అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరుతుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రథసప్తమి రోజున సూర్యుని ఆరాధించడం ఎంతో ఫలదాయకం.
మన్వంతర ప్రారంభంలో సూర్య భగవానుడు మాఘశుద్ధ సప్తమి రోజున మొట్టమొదటిసారిగా తన ప్రకాశాన్ని లోకాలకు అందించాడని చెబుతారు. అందుకే రథసప్తమి రోజు సూర్య జయంతిగా జరుపుకోవడం ఆచారంగా కొనసాగుతోంది.
ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు దంపతులు, అర్చకస్వాములు, వేదపండితులు పాల్గొన్నారు.