*ఎస్వీబీసీ ద్వారా కోట్లాది మంది భక్తుల పారాయణం
*జులై 25 నుండి బాలకాండ ప్రారంభం
*టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 2021 జులై 24: కరోనా మహమ్మారిని దూరం చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టిటిడి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుందరకాండ పారాయణం తిరుమలలో చారిత్రాత్మకమని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుమల నాదనీరాజనం వేదికపై జరుగుతున్న సుందరకాండ పారాయణం శనివారం గురుపూర్ణిమ నాడు ముగిసింది.
అదనపు ఈవో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎంతోమంది సుందరకాండ పారాయణం చేపట్టి ఉండవచ్చని, అయితే తిరుమల చరిత్రలో ప్రప్రథమంగా చేపట్టిన సుందరకాండ పారాయణం ఎంతో ప్రత్యేకమని, శ్లోకార్థంతో పాటు ప్రస్తుత సమాజానికి అన్వయించి సారాన్ని భక్తుల హృదయాల్లోకి తీసుకెళ్లగలిగామని చెప్పారు. కరోనా నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు కోరుతూ ఏడాది క్రితం యోగవాశిస్టం- విషూచికా మంత్రంతో పారాయణ కార్యక్రమాలు ప్రారంభించామని, ఆ తరువాత సుందరకాండ పారాయణం చేపట్టామని చెప్పారు. బ్రహ్మ వరంతో శ్రీ వాల్మీకి మహర్షి దివ్యదృష్టితో రామాయణాన్ని చూస్తూ అక్షరీకరించారని, ఇందులోని ప్రతి శ్లోకం మంత్రమేనన్నారు. సుందరకాండలోని మొత్తం 68 సర్గల్లో గల 2,821 శ్లోకాలను 409 రోజులపాటు పారాయణం చేశామన్నారు. ప్రతి శ్లోకానికి అర్థంతోపాటు ప్రస్తుత సమాజానికి అన్వయించి పండితులు వ్యాఖ్యానం అందించారని వివరించారు. శ్రీ బేడి ఆంజనేయస్వామి, శ్రీరాముని అవతారమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో నాదనీరాజనం వేదికపై సుందరకాండ పారాయణం చేయడం గొప్ప విషయమన్నారు. రామనామస్మరణ ఎక్కడ జరిగితే అక్కడ హనుమంతుడు ఉంటారని వాల్మీకి మహర్షి తెలియజేశారని, ఆవిధంగా ఇన్నిరోజులు ఆంజనేయుడు మనమధ్యే ఉన్నారని చెప్పారు. ఆంజనేయుని ఆశీస్సులతో కరోనా త్వరగా దూరం కావాలని ఆకాంక్షించారు.
సుందరకాండ పారాయణానికి సహకరించిన శ్రీ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని, డా. ఆకెళ్ల విభీషణశర్మ, శ్రీ మారుతి, శ్రీ చలపతి, శ్రీ శేషాచలం, శ్రీ రామానుజం పండితులకు, ఈ కార్యక్రమాన్ని కోట్లాది మంది భక్తులకు చేరువ చేసిన ఎస్వీబీసీ సిఈఓ సురేష్ కుమార్ కు, అద్భుతమైన కీర్తనలు ఆలపించిన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులకు అదనపు ఈవో ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం పండితులను, కళాకారులను సన్మానించారు.
16వ విడత సుందరకాండ అఖండ పారాయణం
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ లోక కల్యాణార్థం టిటిడి నిర్వహిస్తున్న పారాయణ యజ్ఞంలో భాగంగా, మంత్ర పారాయణం ప్రారంభించి 471 రోజులు పూర్తికాగా, సుందరకాండ పారాయణం 409 రోజులు పూర్తి చేసుకుని శనివారంతో సంపూర్ణంగా ముగిసిందని వివరించారు. వాల్మీకి మహర్షి గురువుగా మారి రామాయణాన్ని లోకానికి అందించారని, గురుపూర్ణిమ నాడు సుందరకాండ పారాయణం ముగియడం శుభసూచికమని చెప్పారు.
65 నుండి 68వ సర్గ వరకు 4 సర్గలు, యుద్ధకాండ, శ్రీరామపట్టాభిషేక ఘట్టం కలిపి మొత్తం 229 శ్లోకాలను శ్రీ అవధాని పర్యవేక్షణలో శ్రీ పివిఎన్ఎన్.మారుతి, శ్రీ ఎం. పవనకుమార శర్మ, శ్రీ శేషాచార్యులు పారాయణం చేశారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తమ ఇళ్ల నుంచే పారాయణంలో పాల్గొన్నారు.
జులై 25 నుండి బాలకాండ ప్రారంభం
తిరుమల నాదనీరాజనం వేదికపై జులై 25వ తేదీ ఆదివారం నుండి బాలకాండ పారాయణం ప్రారంభం కానుంది. ఉదయం 7 నుండి 8 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్షప్రసారం చేస్తుంది. బాలకాండలో మొత్తం 2,228 శ్లోకాలున్నాయి. ధర్మగిరి వేదవిజ్ఞానపీఠం శాస్త్ర పండితులు డా. రామానుజం శ్లోక పారాయణం చేస్తారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు డా. ప్రవ రామకృష్ణ వ్యాఖ్యానం అందిస్తారు.
ఈ కార్యక్రమంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య దక్షిణామూర్తి, ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు, పండితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
