తిరుపతి, 2022 ఫిబ్రవరి 04: తిరుమల తిరుపతి దేవస్థానం అమలుచేస్తున్న పరిపాలన విధానాలను ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ శైలం ఆలయ అధికారులు అధ్యయనం చేశారు.
తిరుపతిలోని శ్వేత భవనంలో మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ మూడు రోజుల్లో టిటిడి ఆడిటింగ్, అకౌంటింగ్, హుండీ కానుకల లెక్కింపు, ప్రోటోకాల్ దర్శనాలు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటి, అన్నదానం, ప్రసాదాల తయారీ, వంటశాలల ఆధునీకరణ, వసతి కల్పన, ఆదాయమార్గాలు మెరుగుపర్చడం, దర్శన టికెట్ల జారీ విధానం, ఐటి, టెండర్ల నిర్వహణ, ఆస్తుల నిర్వహణ, లీజుకు ఇవ్వడం, ధార్మిక ప్రాజెక్టులు, పారిశుద్ధ్యం, ఉద్యానవనాలు, వేదపాఠశాలలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. చివరి రోజు ఫైనాన్స్, ఎస్టేట్ విభాగాల అధికారులు వీరికి అవగాహన కల్పించారు. ఈ మూడు రోజుల్లో శ్రీశైలం దేవస్థానం అధికారులు తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని స్థానిక ఆలయాలను, ఎస్వీబీసీ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి వ్యవస్థను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్నతోపాటు 10 మంది వివిధ విభాగాల అధికారులు, శ్వేత సంచాలకులు శ్రీమతి ప్రశాంతి, సిఏవో వెంకటరమణ, ప్రాపర్టీస్ ఏఈఓ అశోక్, రెవెన్యూ ఏఈఓ మునిరత్నం, కోర్సు కో-ఆర్డినేటర్ బాలాజి దీక్షితులు పాల్గొన్నారు.