విజయవాడ:విజయవాడ నగరం నడిబొడ్డున – దేశానికే తలమానికంగా సామాజిక న్యాయ మహాశిల్పం.
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమ సమాజ స్ఫూర్తి, రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 206 అడుగుల కాంస్య విగ్రహాన్ని విజయవాడ స్వరాజ్ మైదాన్‌లో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైయస్.జగన్.
అంతకుముందు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన సామాజిక సమతా సంకల్ప సభకు హాజరై ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగించారు.
వైయస్.జగన్ ఏమన్నారంటే…:
విజయవాడ– సామాజిక చైతన్యాలవాడ.
ఈ రోజు మన విజయవాడను చూస్తుంటే… సామాజిక చైతన్యాలవాడగా ఇవాళ కనిపిస్తుంది. భారతరత్న, బాబాసాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ మహావిగ్రహం, స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆవిష్కరణ సందర్భంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ, మొత్తం దళిత జాతికి, బహుజనులకు, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి గుండెకు ఈ రోజు మీ జగన్ ఈ వేదికపైనుంచి అభినందనలు తెలియజేస్తున్నాడు.
ఇక మీదట నుంచి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇండియాలో విజయవాడ పేరు మారుమోగుతుంది.
ఈ విగ్రహం మనందరి, ప్రభుత్వం ఈ 56 నెలల్లో అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం. ఇది ఈ విజయవాడలో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది.
అంబేద్కర్ నిరంతర స్ఫూర్తి…
బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ బ్రతికే ఉంటాడు. ఎప్పటికీ మన అడుగుల్లోనూ, బ్రతుకుల్లోనూ కనిపిస్తాడు. ఈ దేశంలో పెత్తందారీతనం మీద, అంటరానితనం మీద, కుల అహంకార వ్యవస్ధల దుర్మార్గులు మీద, అక్కచెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు ఆ మహామనిషి నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటాడు.
75వ రిపబ్లిక్‌డేకు వారం రోజుల ముందే…
విజయవాడలో.. అది కూడా స్వాతంత్య్ర సమర చరిత్ర ఉన్న మన స్వరాజ్య మైదానంలో, 75వ రిపబ్లిక్ డేకు సరిగ్గా వారం రోజుల ముందు మనం అంబేద్కర్ గారి మహా విగ్రహం ఆవిష్కరిస్తున్నాం. ఈ విగ్రహం చూసినప్పుడల్లా పేదలు, మహిళలు హక్కులకు, మానవ హక్కులకు, ప్రాథమిక హక్కులకు, సమానత్వ ఉద్యమాలకు, రాజ్యాంగ హక్కులకు నిరంతరం స్పూర్తి ఇస్తూనే ఉంటుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం
ఈ విగ్రహం దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 81 అడుగుల వేదిక ఏర్పాటు చేసి, దాని మీద 125 అడుగుల మహా విగ్రహం. అంటే 206 అడుగుల ఎత్తయిన ఈ విగ్రహం.. దేశంతో కాదు మనం పోటీ పడేది ప్రపంచంతోనే పోటీ పడుతున్నామని తెలియజేస్తున్నాను.