శ్రీశైలం ఉగాది మహోత్సవాలు ఆగమశాస్త్రానుసారం ప్రారంభం

శ్రీశైల దేవస్థానం:ఐదు రోజులపాటు (27.03.2025 నుండి 31.03.2025) జరిగే  ఉగాది ఉత్సవాలు
గురువారం ఘనంగా  ప్రారంభమయ్యాయి ఈ ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమశాస్త్రానుసారం
జరిపారు. ఈ సందర్భంగా శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.

యాగశాల ప్రవేశం :
ఉత్సవ నిర్వహణలో భాగంగా ముందుగా కార్యనిర్వహణాధికారి స్థానాచార్యులు (అధ్యాపక),
అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలో స్వామివార్ల
యాగశాల ప్రవేశం చేశారు.
వేదస్వస్తి :
ఆలయ ప్రవేశం చేసిన వెంటనే వేదపండితులు వేదపారాయణలు చేసి వేదస్వస్తి నిర్వహించారు.
శివసంకల్పం :
వేదపఠనం అయిన వెంటనే స్థానాచార్యులు ( అధ్యాపక), అర్చకస్వాములు, వేదపండితులు,
లోకక్షేమాన్నికాంక్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పఠించారు. దీనికే శివసంకల్పం అని పేరు.
ఈ సంకల్పంలో దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించ
కుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి
ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు జరగకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు,
వాహన, ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరు సుఖశాంతులతో
ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు సంకల్పపఠనం చేశారు.
గణపతి పూజ :
సంకల్పపఠనం తరువాత ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ చేశారు.
పుణ్యాహవచనం :
గణపతిపూజ తరువాత పుణ్యాహవచనం జరిపారు. వృద్ధి , అభ్యుదయాల కోసం
ఈ పుణ్యహవచనం జరిపారు.

చండీశ్వరపూజ :
సంకల్ప పఠనం తరువాత చండీశ్వరపూజ జరిపారు. ఈ ఉత్సవాలు క్షేత్రపాలకుడైన
వీరభద్రస్వామి పర్యవేక్షణలో, శివపరివార దేవతలలో ఒకరైన చండీశ్వరుని నాయకత్వంలో
జరుగుతాయని  అంటారు.
అందుకే యాగశాల ప్రవేశం తరువాత చండీశ్వరుని ప్రత్యేకంగా పూజాదికాలు జరపించడం
సంప్రదాయం.
కంకణ పూజ, కంకణధారణ:
చండీశ్వరపూజ తరువాత కంకణాలకు (రక్షాబంధనాలకు) శాస్త్రోక్తంగా పూజాదికాలు
జరిపారు. తరువాత అధికారులు, అర్చకస్వాములు కంకణాలను ధరించారు.
ఋత్విగ్వరణం :
కంకణధారణ తరువాత ఋత్విగ్వరణం నిర్వహించారు. ఉత్సవాలలో ఆయా వైదిక
కార్యక్రమాలు నిర్వహించమని ఋత్వికులను ఆహ్వానిస్తూ వారికి దీక్షావస్త్రాలను అందజేసే
కార్యక్రమానికే ఋత్విగ్వరణం అని పేరు.
అఖండస్థాపన :

ఋత్విగ్వరణం తరువాత అఖండ దీపస్థాపన చేశారు. అనంతరం వాస్తుపూజ
రుద్రకలశస్థాపన :
వాస్తు హోమం తరువాత మండపారాధన చేసి ప్రత్యేక కలశస్థాపన జరిగింది. కలశస్థాపన
తరువాత కలశార్చన చేశారు తరువాత పంచావరణార్చనలు నిర్వహించారు.
అనంతరం లోకకల్యాణం కోసం జపానుష్ఠానాలు జరిపారు.
అంకురార్పణ :
ఉత్సవాల మొదటిరోజు సాయంకాలం జరిగే అంకురార్పణకు ఎంతో విశేషముంది.
ఈ కార్యక్రమములో ఆలయ ప్రాంగణంలోని నిర్ణీత పునీత ప్రదేశములోని మట్టిని సేకరించి
యాగశాలకు తీసుకువస్తారు. దీనినే “మృత్సంగ్రహణం” అంటారు. తరువాత ఈ మట్టిని తొమ్మిది
పాలికలలో (మూకుళ్ళలో) నింపి, దాంట్లో నవధాన్యాలను పోసి, ఆ మట్టిలో మొలకెత్తించే పని ప్రత్యేకం.
ఈ అంకురారోపణ కార్యక్రమానికి చంద్రుడు అధిపతి, శుక్లపక్ష చంద్రునివలే పాలికలలోని
నవధ్యానాలు సైతం దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తారు. పాలికలలో రోజూ నీరు పోసి నవధాన్యాలు
పచ్చగా మొలకెత్తేలా చూస్తారు. అలంకారాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టే దీనికి అంకురార్పణ
అని పేరు.

ఈ ప్రారంభ పూజలలో కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు,
అర్చకస్వాములు, వేదపండితులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
భృంగివాహనసేవ
ఈ ఉత్సవాలలో భాగంగానే ఈ సాయంకాలం స్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ
జరిగింది. ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగివాహనసేవపై వేంచేబు
చేయించి విశేషంగా అలంకార మండపములో పూజాదికాలు జరిపారు. తరువాత
గ్రామోత్సవం జరిగింది.
భృంగివాహనాధీశులైన శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించడం వలన పనులలో ఏకాగ్రత
లభిస్తుందని, పాపాలను హరించబడుతాయని చెప్పబడుతోంది.
మహాలక్ష్మీ అలంకారం:
ఉత్సవాలలో భాగంగా గురువారం  శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తికి మహాలక్ష్మీ
అలంకారం గ్రామోత్సవం జరిగాయి.
చతుర్భుజాలు గల ఈ దేవిపై రెండు చేతులలో పద్మాలను, క్రింది చేతులలో కుడివైపున అభయ
హస్తం, ఎడమ వైపు వరముద్రతో దర్శనం ఇవ్వనున్నారు. మహాలక్ష్మి స్వరూపాన్ని దర్శించడం వలన
శత్రుబాధలు నివారించబడి, సకల శుభాలు కలుగుతాయని చెప్పబడుతోంది.
అదే విధంగా గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ
చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంబాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు
కుణిత, జాంజ్ పథక్ ( కర్ణాటక డోలు) కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ,
గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి,
డోలు విన్యాసం, గిరిజన చెంచు నృత్యం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు
చేశారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.