
శ్రీశైల దేవస్థానం: మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని పంచాహ్నిక దీక్షతో నిర్వహించే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఈ రోజు (12.01.2022) ప్రారంభమయ్యాయి.ఏడు రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు 18వ తేదీతో ముగియనున్నాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ ఉత్సవాలు చేస్తారు.
లోక కల్యాణం కోసం జరిపే ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ జ్యోతిర్లింగస్వరూపుడైన శ్రీమల్లికార్జునస్వామివారికి విశేషార్చనలు, మహాశక్తిస్వరూపిణి అయిన శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, రుద్రహోమం, చండీహోమం,నవగ్రహ మండపారాధనలు, కలశార్చనలు,జపాలు, పారాయణలు జరుపుతున్నారు.
ఈ ఉదయం 9.15 గంటల నుంచి ఆలయప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమ శాస్త్రానుసారం జరిగాయి.
బ్రహ్మోత్సవ ప్రారంభ సూచకంగా అధికారులు ఆలయ అర్చకులు, వేదపండితులు సంప్రదాయబద్ధంగా యాగశాల ప్రవేశం చేశారు.
తరువాత వేదపండితులు చతుర్వేదపారాయణలతో వేదస్వస్తి నిర్వహించారు.
శివసంకల్పం :
వేదస్వస్తి తరువాత దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించ కుండా సకాలంలో తగినంత వర్షాలు కురువాలని, దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు జరగకుండా ఉండాలనీ, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరు సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు లోక కల్యాణ సంకల్పాన్ని చెప్పారు.
గణపతిపూజ:
సంకల్పపఠనం తరువాత ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజను చేసారు.
చండీశ్వరపూజ :
గణపతి పూజ తరువాత శివ సంచార దేవతలలో ఒకరైన చండీశ్వరునికి విశేషపూజ జరిగింది. ఈ చండీశ్వరుడు స్వామివారి బ్రహ్మోత్సవ ఏర్పాటు చేస్తూ ఉత్సవాలను నిర్వహిస్తాడని ప్రతీతి.
*కంకణపూజ – కంకణ ధారణ:
చండీశ్వర అర్చన తరువాత కంకణాలకు పూజాదికాలు జరిగాయి. అనంతరం అధికారులు, అర్చకస్వాములు, స్థానాచార్యులు కంకణాలను ధరించారు.
ఋత్విగ్వరణం:
కంకణధారణ తరువాత ఋత్విగ్వరణం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో ఆయా వైదిక కార్యాలను నిర్వహించమని ఋత్వికులను ఆహ్వానిస్తూ వారికి దీక్షావస్త్రాలను అందజేసే కార్యక్రమానికే ఋత్విగ్వరణం అని పేరు.
అఖండ దీప స్థాపన :
తరువాత అఖండ దీపస్థాపన, వాస్తుపూజ, వాస్తు హోమం జరిగాయి.
వాస్తు హోమం తరువాత మండపారాధన, పంచావరణార్చన, ప్రధాన కలశస్థాపన కార్యక్రమాలు జరిగాయి.
సాయంకాలం కార్యక్రమాలు అంకురార్పణ:
రేపటి కార్యక్రమాలు
ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు (13.01.2021) శ్రీస్వామిఅమ్మవార్లకు విశేష పూజలు, చండీశ్వరపూజ, మండపారాధనలు, పంచావరణార్చనలు, జపానుష్ఠానాలు, రుద్రహోమం, సాయంకాల నిత్యహవనాలు జపాలు, పారాయణలు మొదలైన కార్యక్రమాలు జరుగుతాయి.
ఈ ఉత్సవాలలో భాగంగా రేపు సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ ఊరేగింపు వుంటుంది.
*శ్రీశైలములో ఈ రోజు (13.01.2022) ముక్కోటి ఏకాదశి ఉత్సవము
• ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు
• శ్రీస్వామిఅమ్మవార్లకు రావణవాహనసేవ