
*ఆక్షన్ ప్లాన్ అనుగుణంగా ఏర్పాట్లను వెంటనే చేపట్టాలి – ఈ ఓ ఎస్.లవన్న
శ్రీశైల దేవస్థానం: ఈ ఏడాది శివరాత్రి ఏర్పాట్లపై ఈ ఓ అధికారులతో ప్రాథమిక సమీక్షా సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 22.02.2022 నుండి 04.03.2022 వరకు 11 రోజులపాటు నిర్వహిస్తారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు ఈ రోజు (03.01.2022) న కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న దేవస్థానం యూనిట్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షకులు, ప్రధానార్చకులతో ప్రాథమిక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశం లో స్థానిక తహశీల్దార్ రాజేంద్రసింగ్, పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వి.రమణ, ప్రాజెక్టుకాలనీ వైద్యశాల వైద్యురాలు డా.రజని, మండల ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి డా. సోమశేఖరయ్య, దేవస్థానం వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న అపోలో వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
సమావేశ ప్రారంభంలో కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ జిల్లా యంత్రాంగ సహాయ సహకారాలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది అందరు కృషి చేయాలని సూచించారు.
తరువాత విభాగాల వారిగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను గురించి కార్యనిర్వహణాధికారి కూలంకుషంగా చర్చించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్ని విభాగాల వారిని ఆదేశించారు. ఏర్పాట్లన్ని కూడా ముందస్తుగానే చేపట్టి పూర్తి చేయాలన్నారు.
జనవరి రెండవ వారంలోగా ప్రతి విభాగం కూడా ఆక్షన్ ప్లాన్ ( ఏర్పాట్ల ప్రణాళిక) రూపొందించి కార్యాలయానికి సమర్పించాలన్నారు. ఆక్షన్ ప్లాన్ అనుగుణంగా ఏర్పాట్లను వెంటనే చేపట్టాలన్నారు.
ముఖ్యంగా ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించవలసి ఉంటుందన్నారు. ఈ విషయమై భక్తులు మాస్కులు ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం, తరచుగా చేతులను శానిటైజేషన్ చేసుకోవడం లాంటి అంశాలపై భక్తులలో మరింత అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసమై క్షేత్రపరిధిలో విరివిగా ఫ్లెక్సీబోర్డులను ఏర్పాటు చేయడం, కరపత్రాలను అందుబాటులో ఉంచడం, దేవస్థాన ప్రసారవ్యవస్థ ద్వారా తరుచుగా తెలియజెబుతుండడంలాంటి చర్యలు చేపట్టాలన్నారు.దేవస్థానం అన్ని విభాగాలు కూడా సమిష్టిగా పరస్పర సమన్వయంతో ఉత్సవ నిర్వహణలో విధులు నిర్వహించాలన్నారు.
తరువాత ఉత్సవాలలో నిర్వహించాల్సిన ఆయా వైదిక కార్యక్రమాలు, వాహనసేవలు , స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ, ఉత్సవాల సమయం లో ఆలయ వేళలు, దర్శనం ఏర్పాట్లు మొదలైన వాటి గురించి చర్చించారు.అనంతరం పాదయాత్రతో వచ్చే భక్తుల సౌకర్యార్థం నాగలూటి, పెద్ద చెరువు, భీమునికొలను, కైలాసద్వారం, సాక్షిగణపతి మొదలైన చోట్ల చేయవలసిన ఏర్పాట్ల గురించి చర్చించారు.
ముఖ్యంగా శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు, జ్యోతిర్ముడి సమర్పణకు చేయాల్సిన ఏర్పాట్లు మొదలైనవాటి గురించి చర్చించారు.
మహాశివరాత్రికి వచ్చే భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు ఆరుబయలు ప్రదేశాలలో పైప్ పెండాల్స్, షామియానాలు మొదలైన వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఈ ఓ ఆదేశించారు. తాత్కాలిక వసతి ప్రదేశాలలో తగినన్ని విద్యుద్దీపాలను ఏర్పాటు చేయాలన్నారు.
క్యూకాంప్లెక్స్‌లో మరియు క్యూలైన్ల లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా దర్శనానికి వేచివుండే భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం మొదలైన వాటిని అందజేయాలన్నారు.క్యూలైన్లన్నీ ధృడంగా ఉండేవిధంగా ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం ఉన్న ప్రజాసౌకర్యాలకు (మూత్రశాలలు మరియు మరుగుదొడ్లు) అవసరమైన అన్ని మరమ్మతులు చేసి అన్నింటిని కూడా వినియోగంలోకి వచ్చే విధంగా తగు ఏర్పాట్లు చేయాలన్నారు ఈ ఓ.క్షేత్ర పరిధిలో అవసరమైన చోట్ల అదనపు కుళాయిలను ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా క్షేత్రపరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. హరిహరరాయగోపురం వద్ద ఉత్సవ సమయం లో తాత్కాలిక క్యూలైన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పార్కింగ్ ఏర్పాట్లు, సామానులు భద్రపర్చుగది, ట్రాఫిక్ నియంత్రణ మొదలైన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు.
పాతాళగంగలో కూడా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు ఈ ఓ. ముఖ్యంగా పాతాళ గంగలో సేఫ్టీ మెష్ (రక్షణ కంచె), పాతాళగంగలో మహిళలు దుస్తులు మార్చుకునేందుకు అవసరమైన గదుల ఏర్పాటు, జల్లు స్నానానికి అవసరమైన ఏర్పాట్లు, పాతాళగంగమెట్ల మార్గములో అవసరమైన మరమ్మతులు మొదలైన వాటిపట్ల శ్రద్ధ కనబర్చాలన్నారు.
ఉత్సవాలలో పండుగ వాతావరణం ఉండే విధంగా విద్యుద్దీపాలంకరణ, పుష్పాలంకరణ ఉండాలన్నారు.భక్తులను అలరించేందుకు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు.
తహశీల్దార్ రాజేంద్రసింగ్ మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో కల్పించే వసతి ఏర్పాట్లు, ఉత్సవాలకు విచ్చేయు ప్రభుత్వ సిబ్బంది తదితర అంశాల గురించి వివరించారు. సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వి.రమణ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో చేయవలసిన బందోబస్తు ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై వివరించారు.తరువాత మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డా.సోమశేఖరయ్య మాట్లాడుతూ వైద్య ఆరోగ్యపరంగా చేపట్టవలసిన చర్యలు గురించి వివరించారు.