శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రిని పురస్కరించుకని నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు (19.02.2025 నుండి
01.03.2025వరకు) నిర్ణయించిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు.
ప్రారంభ పూజలలో కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు దంపతులు, సంబంధిత
అధికారులు, స్థానాచార్యులు ( అధ్యాపక), అర్చక స్వాములు, వేదపండితులు పాల్గొన్నారు.
యాగశాల ప్రవేశం :
ఉత్సవ నిర్వహణలో భాగంగా ముందుగా కార్యనిర్వహణాధికారి, స్థానాచార్యులు, అర్చకస్వాములు,
వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయప్రాంగణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం
చేశారు.
వేదస్వస్తి :
ఆలయ ప్రవేశం చేసిన వెంటనే వేదపండితులు చతుర్వేదపారాయణలు చేసి వేదస్వస్తి నిర్వహించారు.
శివసంకల్పం :
వేదపఠనం అయిన వెంటనే స్థానాచార్యుల ( అధ్యాపకులు) వారు లోకక్షేమాన్నికాంక్షిస్తూ బ్రహ్మోత్సవ
సంకల్పాన్ని పఠించారు. దీనికే శివసంకల్పం అని పేరు.
ఈ సంకల్పంలో దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా
సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు
కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు
మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు,
వేదపండితులు సంకల్ప పఠనం చేశారు.
పుణ్యాహవచనం :
గణపతిపూజ తరువాత పుణ్యాహవచనం జరిపారు. వృద్ధి , అభ్యుదయాల కోసం
ఈ పుణ్యాహవచనం జరిపారు
చండీశ్వరపూజ :
సంకల్పపఠనం తరువాత చండీశ్వరపూజ జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలు సృష్టికర్తఅయిన
బ్రహ్మదేవుని ఆధ్వర్యంలో, క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి పర్యవేక్షణలో, శివపరివార దేవతలలో ఒకరైన
చండీశ్వరుని నాయకత్వంలో నిర్వహిస్తారని ప్రతీతి..
అందుకే యాగశాల ప్రవేశం తరువాత చండీశ్వరుని ప్రత్యేకంగా పూజాదికాలు జరిపించడం
సంప్రదాయం.
కంకణ పూజ, కంకణధారణ:
చండీశ్వరపూజ తరువాత కంకణాలకు (రక్షాబంధనాలకు) శాస్త్రోక్తంగా పూజాదికాలు
జరిగాయి. తరువాత కంకణధారణ జరిపారు.
బుత్విగ్వరణం :
కంకణధారణ తరువాత బుత్విగ్వరణం జరిగింది. బ్రహ్మోత్సవాలలో ఆయా వైదిక
కార్యక్రమాలు నిర్వహించాలని బూుత్విక్కులను ఆహ్వానిస్తూ వారికి దీక్షావస్తాలను అందజేసే కార్యక్రమానికే
బుత్విగ్వరణం అని పేరు.
అఖండస్థాపన :
బుత్విగ్వరణం తరువాత అఖండ దీపస్థాపన జరిపారు. అనంతరం వాస్తుపూజ జరిగింది.
తరువాత వాస్తు హోమం జరిపారు.
రుద్రకలశస్థాపన :
వాస్తు హోమం తరువాత మండపారాధన చేసి రుద్ర కలశస్థాపన చేశారు. కలశస్థాపన తరువాత
కలశార్బన జరిపారు. తరువాత పంచావరణార్చనలు జరిగాయి.
అనంతరం లోకకల్యాణం కోసం జపానుష్టానాలు జరిపారు.
అంకురార్పణ :
బ్రహ్మోత్సవాల మొదటిరోజు సాయంకాలం అంకురార్పణకు ఎంతో విశేషముంది.
ఈ కార్యక్రమములో ఆలయ ప్రాంగణంలోని నిర్ణీత పునీత ప్రదేశములోని మట్టిని సేకరించి యాగశాలకు
తీసుకువస్తారు. దీనినే “మృత్సంగ్రహణం” అంటారు. తరువాత ఈ మట్టిని తొమ్మిది పాలికలలో (మూకుళ్ళలో)
నింపి, దాంట్లో నవధాన్యాలను పోసి, ఆ మట్టిలో మొలకెత్తించే పనిని ప్రారంభిస్తారు. ఈ అంకురారోపణ
కార్యక్రమానికి చంద్రుడు అధిపతి, శుక్లపక్ష చంద్రునివలే పాలికలలోని నవధ్యానాలు సైతం దినదినాభివృద్ధి
చెందాలని ప్రార్ధిస్తారు. పాలికలలో రోజూ నీరు పోసి నవధాన్యాలు పచ్చగా మొలకెత్తేలా చూస్తారు.
అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టే దీనికి అంకురార్పణ అని పేరు.
ధ్వజారోహణ :
బ్రహ్మోత్సవాలలో మొదటిరోజు సాయంకాలం ధ్వజారోహణ ప్రత్యేకం.
ఆలయ ప్రాంగణంలో ప్రధాన ధ్వజస్తంభం మీద పతాకావిష్కరణ చేయడమే ఈ ధ్వజారోహణ.
. ఈ కార్యక్రమములోనే భేరీపూజ కూడా ప్రత్యేకం.
ధ్వజస్తంభం మీద ఎగిరే నందిపతాకమే సకల దేవతలకు, యక్ష, గంధర్వ గణాలకు ఆహ్వానం
అన్నమాట. ఈ ఆహ్వానంతో విచ్చేసిన దేవతలకు నిర్ణీత స్థలాలు కేటాయించి, రోజూ పద్ధతి ప్రకారంగా వారికి
నివేదన సమర్పిస్తారు. బ్రహ్మోత్సవ సమయములో దేవతలంతా క్షేత్రంలోనే వుంటూ ఉత్సవాన్ని తిలకిస్తారని
ఆగమశాస్తాలు చెబుతున్నాయి.