శ్రీశైలదేవస్థానం:శ్రావణ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని గురువారం సాయంత్రం దేవస్థానం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించింది. శ్రీస్వామి అమ్మవార్ల మహామంళహారతుల అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేపు చేయించి ప్రత్యేక పూజలు జరిగాయి. తరువాత శ్రీస్వామి అమ్మవార్ల పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరిప్రదక్షిణ ప్రారంభమయింది.
ఆలయ మహాద్వారం నుండి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధరమండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, గంగాసదనం, బయలు వీరభద్రస్వామి ఆలయం, వలయ రహదారి మీదుగా ఫిల్టర్ బెడ్, సిద్ధిరామప్పకొలను, పుష్కరిణి వద్దకు చేరుకుంది. అక్కడి నుండి తిరిగి నందిమండపం వద్దకు చేరుకుంది. నందిమండపం నుండి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోవడంతో ఈ గిరిప్రదక్షిణ ముగిసింది.
శ్రీశైలగిరిప్రదక్షిణ ఎంతో ప్రాశస్త్యం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగములో శ్రీరాముడు త్రిపురాంతకం, సిద్ధవటం, ఉమామహేశ్వరం, అలంపురం మొదలైన ద్వార క్షేత్రాలగుండా గిరిప్రదక్షిణ ఆచరించినట్లు శ్రీశైలఖండం చెబుతోంది.శ్రీశైల క్షేత్రములోని ప్రాచీనమఠాలను, ఆలయాలను భక్తులచేత దర్శింపజేయిస్తూ వారిలో భక్తిభావాలను మరింతగా పెంపొందింపజేయాలని, అదేవిధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ గిరి ప్రదక్షిణను నిర్వహించారు. గిరిప్రదక్షిణ అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేసారు.
*K.V. SagarBabu, Executive Officer, Srikalahasthi Devasthanam visited Srisaila devasthanam . officials received with temple honours.